సోషల్ మీడియా పుణ్యమాని మీడియాకి పనితగ్గిపోయింది. కాదు కాదు ఎవరూ పట్టించుకునే పరిస్థితి రాను రాను పోయే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వారే.. ఏ రాజకీయ పార్టీకి ఆ పార్టీయే సోషల్ మీడియా వేదిక ద్వారా వారి ప్రచారాలను ముమ్మరంగా చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్ సెల్ ఫోన్ తెచ్చిన సాంకేతిక విప్లవం ఎవరికీ కలిసిరానంతగా రాజకీయపార్టీలకు బాగా కలిసొచ్చింది. ఒప్పుడు ప్రజలను నమ్మించడానికి, చేసిన పనులు చెప్పుకోవడానికి రాజకీయపార్టీలు మీడియా సంస్థలు, టీవీలను, పత్రికలను ఏర్పాటు చేసేవి. అది కాస్తా సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలా సులువైపోయింది. ఇంటర్నెట్, ఈమెయిల్ అకౌంటున్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా(యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ ఛానల్, వెబ్ సైట్, టెలీగ్రామ్ ఛానల్, ప్రైవేటు యాప్) ఏర్పాటు చేసుకుంటున్నారు. రాజకీయపార్టీలైతే ఒక అడుగు ముందుకి వేసి.. ఒకరిద్దరు యాడ్స్ డిజైనర్లను, స్క్రిప్ట్ రైటర్లను, ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్, వీడియో ఎడిటర్ ఇలా సోషల్ మీడియా ప్రమోషన్ కి ఉపయోగా పడేవారందరినీ ఒక యూనిట్ ఏర్పాటు చేసి, వారికోసం ప్రత్యేకంగా కార్యాలయాలను కూడా తెరుస్తున్నది.
ఎవరి టీము వారి నాయకుల కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వారి స్టైల్ లో తయారు చేసి జనాలమీదకు వదులుతున్నారు. అదే జనం నమ్మేసే స్థితికి వచ్చారు. మీడియా ఏం చెబుతున్నది మరిచిపోయి.. పొలిటికల్ సోషల్ మీడియాలో ఏమొస్తుందోనని వేచి చూస్తున్నారు. ఒక రకంగా మీడియా కూడా సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్నే వార్తలుగా రాసుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందంటే సోషల్ మీడియా రాజకీయపార్టీలకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. కొత్తగా న్యూస్ ఛానల్ పెట్టాలన్నా, దినపత్రిక పెట్టాలన్నా ఒకప్పుడు రాజకీయపార్టీలు కోట్లాది రూపాయలు వెచ్చించేవి. ఇపుడు ఆ మొత్తం కాస్తా లక్షల్లోకి వచ్చేసింది. అందులోనూ ఒక్కసారి సోషల్ మీడియా యూనిట్ పెడితే అది శాస్వతంగా పైసా ఖర్చులేకుండా ఉచితంగానే ఎవడి ప్రచారం వాడే చేసుకోవడానికి అవకాశం ఉండటంతో ప్రతీ రాజకీయపార్టీ వారి పార్టీ అంశాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాటి నిర్వహణకు పార్టీలోని వారినే నియమించుకుంటున్నాయి. దానికోసం ఒక స్టేట్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తున్నది.
అన్ని జిల్లాలకు అన్ని గ్రామాలకు మండల గ్రూపులు, మండలాలతో జిల్లా గ్రూపులు, జిల్లాలతో స్టేట్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా టీవీ ఛానల్, పేపర్లు కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రచారం చేయడం మొదలు పెడుతున్నాయి. టీవీ ఛానళ్లను యూట్యూబ్ ఛానళ్లు వెక్కిరిస్తుంటే.. వెబ్ సైట్లు, న్యూస్ యాప్ లను, దినపత్రికలను వాట్సప్ చిన్న చూపు చూస్తున్నది. ఫేస్ బుక్ పైత్యం పెరిగిపోయి ఎడా పెడా పోస్టులతో ఎవరికి వారే సోషల్ మీడియా నిర్వాహకులుగా మారిపోతున్నారు. ఏదైనా రాజకీయపార్టీ ఒకప్పుడు మరేదైనా సమాచారం, ముఖ్యమైన విషయాన్ని ప్రజలకు, నాయకులకు తెలియజేయాలంటే ఖచ్చితంగా పత్రిక, టీవీ ఛానల్ విలేఖరులను పిలిచి ప్రెస్ మీట్లు పెట్టేవి. అవి వార్తలుగా మరుసటి రోజు వచ్చేవి. ఇపుడు ఆ పరిస్థతి పోయి సోషల్ మీడియా రావడంతో మీడియా వచ్చినా రాకపోయినా.. ముందు ఫోటోలు, వీడియోలు, వారికి నచ్చిన భాషతో నాయకుడికి పేరు ముందు గుడిలో దేవుళ్లను కొలిచినట్టుగా ముందు మూడు శ్రీశ్రీశ్రీలు పేరు తరువాత గార్లు, బూర్లు, వడలు, ఇంకా ఏమైనా డిగ్రీలుంటే అవికూడా తగిలించి.. ఆ విధంగా జరగడం జరిగిందంటూ.. ఓ ప్రెస్ నోటు కూడా రిలీజ్ చేసి జనాలే చస్తారులే అన్నట్టుగా వాట్సప్ లలో వదిలేస్తున్నారు.
అందులో వినియోగించే పదప్రయోగం కొంతమందికి పిచ్చి, మెంటలు ఎక్కించిన దాఖలాలు కూడా లేకపోలేదు. ప్రజలకు సమాచారం వీటి ద్వారానే గబుక్కున చేరిపోతున్నది. మీడియా కంటే సోషల్ మీడియా ముందు కదా.. అంతే దానితో సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్నే వార్తలుగా, వాళ్లిచ్చిన ఫోటోలే న్యూస్ ఫోటోలుగా మీడియా ఆ వీడియోలనే వినియోగించక తప్పడం లేదు. అలా పబ్లిసిటీ చేయకపోతే అసలు మీడియా ఉందో లేదో తెలియని పరిస్తితికి వచ్చేస్తుందని.. ఆ సమాచారంతోనే ఓ న్యూస్ క్లిప్ ఫోటో తయారు చేయించి మళ్లీ వాళ్లకే సోషల్ మీడియాలో వదులుతున్నాయి మీడియా సంస్థలు. అంతే ఆ క్లిప్పింగుని కూడా నిర్వాహకులు ఎడాపెడా సోషల్ మీడియాలో షేర్లు చేసి వైరల్ చేసుకుంటున్నారు. దానితో పూర్తిగా మీడియా పనే లేకుండా పోయింది. కొందరు సోషల్ మీడియా నిర్వాహకులు ఏకంగా కార్యక్రమం జరిగిన ప్రదేశం నుంచే లైవ్ కవరేజీ ఇచ్చేస్తున్నారు. దానితో ఎవరి మొబైల్ ఫోన్లలో వారే ఆ కార్యక్రమాన్ని వీక్షించేస్తున్నారు. ఫలితంగా టీవి న్యూస్ అవసరం లేకుండా పోయింది.
కార్యక్రమం అయిన వెంటనే సోషల్ మీడియా లైవ్ ఇచ్చేస్తుంటే.. ఆ తరువాత మరుసటి రోజు ఆ పాసి వార్తలను అసలు మీడియా ప్రజలకు వార్తలు ద్వారా తెలియజేస్తున్నది. రాజకీయ పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి మీడియా సంస్థలు ఉన్నా.. లైవ్ లో వారి కార్యక్రమాలను, ప్రచారాల కోసం ప్రత్యేక సోషల్ మీడియా విభాగాలనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఉండే కేబుల్ టీవీ బిల్లు నెలకి రూ.150 కట్టలేనివారు ఇపుడు నెలకి రూ.600 ఇంటర్నెట్ ప్యాక్ వేసుకొని మొత్తం సమాచారాన్ని కేవలం సోషల్ మీడియాద్వారానే వీక్షిస్తున్నారు జనం కూడా. రాజకీయపార్టీలకు కూడా అదే కలిసి రావడంతో అసలు మీడియాని వదిలేసి సోషల్ మీడియా ద్వారానే గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. రానున్నరోజుల్లో మీడియా మనుగడ ప్రశ్నార్ధకం కాబోతుందనే సంకేతాలని సోషల్ మీడియా ద్వారా రాజకీయపార్టీలే ప్రజలకు తెలియజేస్తున్నాయి. పొలిటికల్ సోషల్ మీడియానా మాజాకా...?!