పోలవరం నిధుల వెంటనే చెల్లిస్తాం..నిర్మలా సీతారామన్


Ens Balu
3
New Delhi
2020-09-15 13:28:57

పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ  రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సభలోనే ఉన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ధృవీకరిస్తూ కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించిదని, ఆ మేరకు రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ఆమె సభకు వివరించారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటిదని, దీనిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన నిధులన్నింటినీ కేంద్రమే సమకూర్చవలసి ఉంటుందని విజయసాయి రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌ 2021 నాటికల్లా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందనన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల కోసం నిరీక్షించకుండా ప్రాజెక్ట్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఖర్చు చేస్తూ వస్తోంని సభకు వివరించారు. ఆ విధంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 3,805 కోట్ల రూపాయల బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన జల శక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు.