మహారాష్ట్రలోని నవీ ముంబయిలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన 10 ఎకరాల స్థలానికి సంబంధించిన అధికారిక పత్రాలను మంగళవారం టిటిడి ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జున అందుకున్నారు. సిటి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధికారి కైలాష్ షిండే ఈ పత్రాలను, స్థలం ప్లాన్‌ను అందజేశారు. నవీ ముంబయిలోని ఉల్వే ప్రాంతంలో ఉన్న ఈ 10 ఎకరాల స్థలాన్ని టిటిడి ఎస్టేట్ విభాగం అధికారులు సర్వే చేశారు. సముద్ర తీరానికి, కొత్తగా రానున్న విమానాశ్రయానికి సమీపంలో, అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్న ఈ స్థలం శ్రీవారి ఆలయ నిర్మాణానికి అత్యంత అనువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముంబయి శ్రీవారి ఆలయ సూపరింటెండెంట్ గిరి కిరణ్, సర్వేయర్ హరినాథ్ పాల్గొన్నారు.