భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నౌకాదళంలోకి ప్రవేపెట్టారు.ఈ కార్యక్రమం కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో జరిగింది. భారత్ ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే కావడం విశేషం. ఈ నౌక నిర్మాణానికి సుమారు రూ.20,000 కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దీంతోపాటు భారత నౌకా దళానికి సరికొత్త గుర్తును కూడా ఆవిష్కరించారు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఆటోమేషన్ సౌకర్యాలను కూడా ప్రధాని ప్రారంభించారు. దేశీయంగా నిర్మాణం పూర్తిచేసుకున్న విక్రాంత్ నౌకలో ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిర్మాణంతో విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న 6వ దేశంగా భారత్ నిలిచింది. అమెరికా,యూకే,రష్యా,ఫ్రాన్స్,చైనా వద్ద మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.
ఈ నౌకలో అత్యధిక శాతం దేశీయంగా తయారైన పరికరాలనే వినియోగించారు. ఇందుకోసం పలు భారీ పరిశ్రమలు,100 ఎంఎస్‌ఎంఈలు శ్రమించాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ రాకతో భారత్‌కు రెండో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అందుబాటులోకి వచ్చినట్లైంది. విక్రాంత్ డిజైన్‌ను భారత నౌకాదళంలోని వార్‌షిప్ డిజైన్ బ్యూరో తయారు చేసింది. ఈ నౌక నిర్మాణాన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ పూర్తిచేసింది. ఈ యుద్ధ నౌకకు అవసరమైన స్టీల్‌ను ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్, డీఆర్‌డీవోలు సమష్టిగా అభివృద్ధి చేశాయి. ఈ నౌక 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో 43,000 టన్నుల బరువు ఉంది. ఇది గంటకు 28 నాట్స్ వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు.
ఈ నౌకలో మొత్తం 2,200 కంపార్టుమెంట్లు నిర్మించారు. ఇక్కడ 1,600 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండొచ్చు. మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. ఈ నౌకలో పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ ఉంది. ఫిజియోథెరపీ, ఐసీయూ, పరీక్షశాలలు కూడా ఉన్నాయి. ఈ నౌకపై 30 యుద్ధవిమానాలను సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. మిగ్-29కే ఫైటర్ జెట్‌లు, కమావ్-31, హెచ్‌ఆర్-60ఆర్ హెలికాప్టర్లు దీనిపై అందుబాటులో ఉంటాయి. ఇంతి వివేషాలున్న నౌక దేశీయంగా నిర్మాణం జరగడంతోపాటు ప్రపంచంలోనే నౌకానిర్మాణ రంగంలో 6వ స్థానాన్ని పొందగలడం విశేషం.