ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు టిటిడి అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పిస్తున్నారు. ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును. ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు వుంటుంది. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు.
కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సులలోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా అధికారులు కోరతున్నారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుంచి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం. శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారు ఈ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలరు.