ఢిల్లీ వరకూ హోరు వినిపించేలా విశాఖ గర్జన..


Ens Balu
26
2022-10-12 08:18:58

అభివ్రుద్ధి జరగాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలతో ఏక రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటి గర్జించడా నికి విశాఖ సిద్ధమవుతుంది. మన విశాఖ.. మన రాజధాని అనే నినాదంతో యావత్ దేశం మొత్తం తెలిసేలా భారీ ఎత్తున గర్జన నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖలో జేఏసి ఆధ్వర్యంలో అక్టోబరు 15న నిర్వహించే గర్జన గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వినిపించేలా వికేంద్రీకరణ, మూడు రాజధానులు కోరుకునేవారంతా ముందడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో.. అలాంటి అన్యాయం మరోసారి జరగకూడదంటే పరిపాలన వికేంద్రీకరణ ముఖ్యమని భావించిన ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా జరుగుతున్న గర్జనలో ప్రతీ ఒక్కరూ గొంతు కలిపి హోరెత్తించడానికి అంతా ముందుకి వస్తున్నారు.

 విశాఖలో జరగబోయే గర్జన రాష్ట్రంతోపాటు, దేశమంతా తెలిసేలా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రతీ ఒక్కరూ తమ తమ సామాజిక మాద్యమాల్లో సైతం ఈ అంశాన్ని డీపీలు, వాట్సప్, టెలీగ్రామ్ , ట్విట్టర్, ఫేస్ బుక్  స్టేటస్ లుగా పెట్టుకొని మరీ తమ గళాన్ని తెలియజేస్తున్నారు. మూడు రాజధానుల అంశానికి ఒక వర్గం మీడియా అనుకూలించకపోయినా..కొన్ని పార్టీలు కలసిరాకపోయినా..ప్రభుత్వ ఆలోచన వెంట మేమంతా ఉన్నామనే సంఘీబావాన్ని ఉత్తరాంధ్రా ప్రజలు ఉప్పెనై లేస్తూ ముందుకి తరలి వస్తున్నారు. అంతేకాదు విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వలన ఈ ప్రాంతం అంతా ఎంతో అభివ్రుద్ధి చెందడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వశాఖలకు చెందిన ప్రధాన కార్యాలయాల నిర్మాణాలు, ప్రైవేటు సంస్థలు, కర్మాగాలు రావడానికి మార్గం కూడా సుగమం అవుతుందనే విషయాన్ని ప్రముఖ వ్యాపార వేత్తలు సైతం అందరిలోనూ అవగాహన కల్పిస్తున్నారు.

వికేంద్రీకరణ జరిగితే విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని, కూలి వాళ్లకు సైతం చేతి నిండా పనిదొరుకుతుందని భావించే వారంతా తమ మద్దతు ఇతోదికంగా తెలియజేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారాలు, కర్షకులు, కార్మికులు, ఉద్యమకారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు మూడు రాజధానులను బలంగా కోరుకుంటున్నారు. అభివ్రుద్ధి అంటే ఒకే చోట జరిగితే కొందరికే లాభం చేకూరుతుందని..అదే అభివ్రుద్ధి విస్తరణ జరిగితే అన్ని వర్గాలు లాభపడతాయనే ఉద్దేశ్యంతో జరుగుతున్న ఈ విశాఖ గర్జనను విజయవంతం చేయడానికి అన్నిగ్రామాల ప్రజలు తరలి రావాలని కూడా జేఏసి పిలుపునిచ్చిన తరుణంలో ఇక్కడ జరిగే కార్యక్రమ హోరు డిల్లీ వరకూ వినిపించి ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడుని  కేంద్రానికి కూడా తెలియజేయాలనే నినాదంతో అడుగులు పడుతున్నాయి. ఒక్కొక్కరి గొంతు పెను ఉప్పెనై అక్టోబరు 15 జరిగే గర్జనతో ఢిల్లీ సైతం అదిరిపడేలా కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహత్తర కార్యక్రమానికి భారతదేశపు తొలితెలుగు నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మరియు www.enslive.net వెబ్ సైట్లు కూడా మద్దతు పలుకుతున్నాయి..!