పోలీస్ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని పేర్కొంది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్ కూడా చేయాలని సూచించింది. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ప్లేసులతో పాటు లాకప్ రూములు, కారిడార్, స్టేషన్ రిసెప్షన్ ఏరియా, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ రూమ్‌లు, వాష్ రూమ్ బయట సీసీ కెమెరాలను అమర్చాలంది. ఈ ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది.
ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్‌ను ఆరు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఈ కెమెరాల్లో రికార్డైన పుటేజ్‌ను, ఆడియో రికార్డింగ్‌ను 18 నెలల పాటు జాగ్రత్త చేయాలని, అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్‌గా అందజేయాలని పేర్కొంది. పోలీస్ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్ ప్యానెల్‌తో తరచూ సీసీటీవీ ఫుటేజ్ చెకింగ్ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతీ జిల్లాలో హ్యూమన్ రైట్స్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్ వేసింది. పంజాబ్‌లో జరిగిన కస్టోడియల్ డెత్‌కు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇంటరాగేషన్ ఏరియాలలో కెమెరాల ఏర్పాటుకు 2018లోనే ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏర్పాట్ల సంబంధించిన వివరాలను వచ్చే నెల 27న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.