2రోజుల్లో చంద్రుడిపై పగలు.. రోవర్‌, ల్యాండర్‌ ఏం చేయబోతున్నాయి..?!


Ens Balu
31
Bengaluru
2023-09-20 05:18:32

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌-3 సక్సెస్‌ ను భారత్ తోపాటు ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేస్తున్నది. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు ఇప్పటికే కీలక సమాచారాన్ని దివి నుంచి భువి అందించాయి. అయితే, చంద్రుడిపై లూనార్‌ నైట్‌ ప్రారంభం కావడంతో ఇస్రో.. ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్‌, రోవర్‌లను నిద్రాణ స్థితిలోకి పంపింది. మళ్లీ చంద్రుడిపై పగలు ఏర్పడిన తరువాత ఇవి తన పనిని ప్రారంభిస్తాయని ఇస్రో ఆదిలోనే ప్రకటించాయి. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో విడుదల చేసింది. మరోవైపు.. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక టిట్వర్ ఖాతాలో పంచుకుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు నిద్రాణస్థితి నుంచి బయటకు రావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి  పగలు మొదలయ్యాక  22న ల్యాండర్, రోవర్‌ స్లీప్‌ మోడ్‌ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది.  లూనార్‌ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్‌ మళ్లీ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అక్కడి మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్‌ పరికరాలు తట్టుకోవడం, రీఛార్జి కావడంపైనే ఇది ఆధారపడి ఉంది. అయితే, రోవర్‌, ల్యాండర్‌లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అప్పటికే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్ లలో బ్యాటరీలు ఫుల్ గా చార్జింగ్ లోనే ఉన్నాయని, అవి తిరిగి పగలు వచ్చినత తరువాత ఛార్జ్ అవడానికి పూర్తిస్థాయిలో అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే చంద్రుడిపై అతి శీతల వాతావరణ పరిస్థితులు ఏమైనా ప్రతికూల ప్రభావాలు చార్జింగ్ విషయంలో చూపించవచ్చుననే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న ఇక్కడి పరిశోదకులు. 

విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. చంద్రుడిపై పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. చంద్రుడిపై పగలు వచ్చిన తరువాత ఎలాంటి సమాచారం మళ్లీ చంద్రయాన్-3 పంపిస్తుందనే అంశంపై ప్రపంచం మొత్తం ఆశక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో చంద్రునిపై రోవర్ ఆటలను అమ్మలా ఆప్యాయతా చూస్తున్నట్టుగా ఉంటే వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది.