అడ్డగోలు హెట్రో..అన్నీ అతిక్రమణలే..!


Ens Balu
129
Visakhapatnam
2023-11-08 01:49:47

అధికారం..డబ్బూ..పలుకుడి..అధికారుల వత్తాసు..ప్రభుత్వం సహకారం ఉంటే అనుమతులు ఆలస్యంగా వచ్చినా..పనులు మాత్రం ముందుగానే చేసేసుకోవచ్చు. అదీ పోలీసు బందోబస్తును పెట్టి మరీ.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.15కోట్ల తో సముద్రంలోకి సుమారు రెండు కిలోమీటర్లు చేపట్టే వ్యర్ధాల పైప్ లైన్. ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు అనుమతులు రాకుండా ఉంటాయా..అన్నీ ఆఘమేఘాలపై వచ్చేశాయి..ఎన్నికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అనుమతులు ఇచ్చినా స్థానిక సంస్థల అనుమతులు( నక్కపల్లి మండలంలోని ఎన్.నరసాపురం పంచాయతీ, సిహెచ్ లక్ష్మీపురం, రాజయ్యపేట, పెద తీనార్ల,గ్రామ పంచాయతీల తీర్మాణాలు) లేకపోతే పనులు ప్రారంభించడానికి లేదు. అదీ సముద్ర జలాలు కలుషితం అయ్యే పనులకు స్థానికులు ఒప్పుకోరు, పంచాయతీ గ్రామసభ తీర్మాణం కూడా రాదు. కానీ.. పనులు చేస్తున్నది మెస్సర్స్ హెట్రో ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ కదా పంచాయతీ అనుమతి మాత్రం కాస్త తేడా వచ్చింది. ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వం, ప్రైవేటు నిర్మాణాలు చేపట్టే సమయంలో సదరు గ్రామసభ అనుమతితో పంచాయతీ తీర్మాణం ఉండాలి. దానికోసం తహశీల్ధార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ఆ నివేదికను ఆర్డీఓ ద్వారా జెసి, ఆపై కలెక్టర్ తరువాత ప్రభుత్వానికి నివేదించాల్సి వుంటుంది. 

కానీ హెట్రో విషయంలో పెద్ద పెద్ద అనుమతులన్నీ ముందే వచ్చేశాయ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, జిల్లా పరిశ్రమలశాఖ, ఫైర్ అండ్ సేఫ్టీ ఇలా అన్ని అనుమతులూ వచ్చేశాయి. అదేంటి ఇవన్నీ గ్రామ పంచాయతీల తీర్మాణాలు జరిగిన తరువాత కదా వస్తాయి..అంటే ఇక్కడ మాత్రం ముందు సదరు అనుమతులన్నీ వచ్చేశాక పనులు మొదలు పెట్టేశాక..చివరాఖరున పంచాయతీ అనుమతి వస్తుంది. అదీ నవంబరు 6వ తేదీన అంటే పనులు నవంబరు 1వ తేదీ కంటే ముందుగానే మొదలైపోయి, నిర్మాణాలకు సంబంధించిన సామాగ్రి మొత్తం వచ్చేశాక చివరాఖరుగా తీసుకున్నారన్నమాట. అదీ ఎలా అంటే గ్రామసభ పెడితే అడ్డంకులు వస్తాయని, ముందుగా అన్నిప్రభుత్వశాఖలు అనుతమతులు ఇచ్చేశాయని కేవలం పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి సంతకాలతో  అనుమతు ఇచ్చేశారు. రూ.15కోట్ల ఖర్చు స్థానికులు గొడవలు చేస్తే ఊరుకుంటారా..? సముద్ర జలాలు, భూగర్భ జలాలు కలుషితం అయిపోయినా పర్లేదు, మత్స్యసంపద సర్వ నాసనం అయిపోయినా పట్టించుకోవాల్సిన పనిలేదు.

 వారికి కావాల్సింది రెండో పైప్ నిర్మాణం ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి. దీనితో జిల్లా అధికార యంత్రాంగంతో అనుమతులు తెచ్చుకొని మరీ పోలీసులను, బలగాలను రంగంలోకి దింపి పనులు ప్రారంభించారు. దీనితో ఇక్కడ హెట్రో పైప్ లైన్ వద్దంటూ 700 రోజులు ఆందోళన చేసిన స్థానికుల సమస్యను, ఇబ్బందిని, పక్కన పెట్టి జిల్లా అధికారులు కూడా అనుమతులు ఇచ్చేశారు. అన్నీ వచ్చేసిన తరువాత అడ్డెవరు వస్తారనుకున్న హెట్రో యాజమాన్యం స్థానికుల నుంచి ఇబ్బందులు రాకుండా నక్కపల్లి మండల మెజిస్ట్రేట్, నర్సీపట్నం డివిజన్ మెజిస్ట్రేట్ కి కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా జిల్లా పోలీసులను రంగంలోకి దించింది. దీనితో విషయాన్ని రెవిన్యూ అధికారులు అనకాపల్లి జెసి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన జెసి హెట్రో వద్ద జరుగుతున్న నిర్మాణపనులను పరిశీలించాలని ఫైమెన్ కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా మంగళవారం ఫ్యాక్టరీలో సమావేశం జరిపి అంతా సక్కమంగానే ఉందని నివేదిక ఇవ్వడం విశేషం. మొదట అనుకున్నట్టుగా కాకుండా కంపెనీ స్థలం నుంచి కొత్త పైప్ లైన్ కూడా వేసుకోవడానికి అన్ని శాఖల అనుమతులు ఇచ్చేశారు. 

ఇప్పటికే ఉన్న పైప్ లైన్ ద్వారా సముద్రంలో సుమారు 100 కిలోమీటర్ల వరకూ మత్స్యసంపద మొత్తం రసాయానాల వాసన వస్తుందని, వాటి తింటుంటే అనారోగ్యాల భారిన పడుతున్నామని స్థానికులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ఈ తరుణంలో వామపక్షాలు వందల రోజులు ఆందోళనలు చేసినా వాటిని పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేసింది ప్రభుత్వం. ఈ విషయంలో ప్రభుత్వంలోని పెద్దలను ప్రశన్నంచేసుకొని ఎక్కడా పనులకు ఆటంకం రాకుండా ఉండాలని, అనుమతుల్లో ఇచ్చినట్టుగా ఏడేళ్లలోగా అన్ని పనులు పూర్తిచేసుకోవడానికి ఆఘమేఘాలపై పనులు మొదలు పెట్టేసింది యాజమాన్యం.


అనుమతులన్నీ ఉన్నాయి..స్థానికుల ఆందోళన ఉంటుందనే పోలీసు బందోబస్తు
హెట్రో చేపడుతున్న ఖర్మాగార వ్యార్ధాలను సముద్రంలోకి విడిచిపిట్టే డిశాలినేషన్ ప్లాంట్ పైప్ లైన్ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు వచ్చేశాయని యాజమాన్యానికి చెందిన సుబ్బారెడ్డి అనే ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉద్యోగి వివరణ ఇచ్చారు. పైగా అనుమతులు రాకుండా పోలీసుల బందో బస్తు ఎవరిస్తారని కూడా ఎదురు ప్రశ్నవేశారు. అలాంటపుడు పనులు ప్రారంభించడానికి ఒకరోజు ముందు పంచాయతీ తీర్మాణం అదీ, గ్రామసభ కాకుండా పాలకవర్గం అనుమతి మాత్రమే తీసుకొని, ప్రజలు కంపెనీ విస్తరించి ఉన్న మూడు పంచాయతీ ప్రజల గ్రామసభ ఆమోదం లేకుండా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తే..నేను బండిపై ఉన్నాను..మీకు కావాలనుకుంటే కంపెనీ వచ్చి అనుమతులు చూసుకోవచ్చునని సమాధానమిచ్చారు. అంటే అన్ని రకాల అనుమతులు ముందే వచ్చినా ప్రధాన అనుమతి అంటే పంచాతీల గ్రామసభల తీర్మాణంతో ప్రజల అభీష్టం మేరకు ఇచ్చిన అనుమతి మాత్రం ఇంతకాలం ( నక్కపల్లి మండలంలోని ఎన్.నరసాపురం పంచాయతీ, సిహెచ్ లక్ష్మీపురం, రాజయ్యపేట, పెద తీనార్ల,గ్రామ పంచాయతీల తీర్మాణాలు) అనుమతులు రాలేదనే విషయం గ్రామపంచాయతీలు నవంబరు 6వతేదీతో రాసి ఇచ్చిన అనుమతులే రుజువు చేశాయి.

 అంటే 6వ తేదీ వరకూ అనుమతి రాకపోయినా పనులు ప్రారంభించేశారు. ఈ విషయంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్,  నర్సీపట్నం ఆర్డీఓ, నక్కపల్లి తహశీల్దార్, ఇలా మొత్తం అందరినీ ఒకేసారి బురిడీలను చేసింది హెట్రో. అదేవిషయం అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో జరిగే వ్యవహారం కనుక అధికారులు కూడా ఏమీ చేయలేక.. అన్ని అనుమతులు సక్రమంగానే ఉన్నాయని, కాకపోతే పైప్ లేన్ వేరే విధంగా వేస్తున్నామని చెప్పి ఫైవ్ మెన్ కమిటీ ని కూడా మమ అనిపించేశారు. అడ్డగోలు హెట్రోపై అనుమతులు, వాటి నకళ్ల ఆధారాలతో మళ్లీ కలుద్దాం..!