తిరుమలలో అర్ధ‌ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు..


Ens Balu
25
Tirumala
2024-02-13 14:18:04

 సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో దీనిని అర్ధ బ్ర‌హ్మోత్స‌వ‌మ‌ని, ఒక‌రోజు బ్ర‌హ్మోత్స‌వమ‌ని కూడా పిలుస్తారు.  భ‌క్తులు ఎండ‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా అఖిలాండం వ‌ద్ద‌, మాడ వీధుల్లో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు.  మాడ  వీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా సాంబార‌న్న‌, పెరుగ‌న్నం, పులిహోర‌, పొంగ‌ళి త‌దిత‌ర అన్నప్రసాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, టి, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక దర్శనాలు రద్దు

   ఫిబ్ర‌వ‌రి 16న ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది. సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్ర‌వ‌రి 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు తిరుప‌తిలోని కౌంట‌ర్ల‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీ ఉండ‌దు. భ‌క్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 ద్వారా శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. కాగా, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం భ‌క్తులు నిర్దేశించిన టైంస్లాట్ల‌ను పాటించ‌ని ప‌క్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.  ఫిబ్ర‌వ‌రి 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు గ‌దుల‌ కేటాయింపు కోసం సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఎంబిసి, టిబి కౌంటర్ల‌ను మూసివేస్తారు. కౌంట‌ర్ల‌లో 4 లక్షలతో పాటు అద‌నంగా మ‌రో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వాహ‌న‌సేవ‌లు

 శ్రీ మలయప్పస్వామివారు ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సూర్యప్రభ, ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు చిన్నశేష, ఉద‌యం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు గరుడ వాహ‌నంపై, మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు హనుమంత వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు పుష్క‌రిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.  అనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు క‌ల్పవృక్ష, సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనాలపై భ‌క్తుల‌ను క‌టాక్షిస్తారు. వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.