సింహాచలంలో అప్పన్న నిత్య కళ్యాణం ఈ విధంగా..!


Ens Balu
39
simhachalam
2024-03-11 06:13:25

సింహగిరిపై కొలువున్న శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం జరుగుతోంది. భక్తులు స్వామివారి కల్యాణం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పద్దతులు అనుసరించడం ద్వారా స్వామివారికి చేయించే కల్యాణోత్సవం మది నిండా కొండంత ఆనందాన్ని పంచుతుంది. అప్పన్న కల్యాణం కోసం దేవస్థానం రూ.1000 టిక్కెట్టు ఛార్జి చేస్తున్నది. ఈ టిక్కెట్టుతో దంపతులిద్దరు కల్యాణంలో కూర్చోవచ్చు. టిక్కెట్టుతోపాటు తలంబ్రాల బియ్యం, కండువా, జాకిట్టుముక్క ఇస్తారు. స్వామివారి దగ్గరకు వెళ్లే సమయంలో భక్తులు తులసిమాల లేదా విడిపువ్వులు, కొబ్బరికాయ, అరటి పళ్లు, తీసుకెళ్లవచ్చు. స్వామివారి నిత్య కల్యాణం ప్రతీరోజూ ఉదయం 9.30గంటలకు ఆల యంలోని ఎడమచేతి వైపు ఉన్న మండపంలో ప్రారంభం అవుతుంది. భక్తులు 9గంటలకే టిక్కెట్టు తీసుకొని కల్యాణ మండపంలో కూర్చోవచ్చు. అప్పన్న కల్యాణం పూర్త యిన తరువాత సదరు జంటను స్వామివారి అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు. కల్యాణ టిక్కెట్టుపై ఒక లడ్డూ, ఐదు పులిహోర ప్యాకెట్లు ప్రసాదం కూడా ఇస్తారు. ఆపై స్వామివారి అన్నప్రసాదం స్వీకరించాలనుకునేవారు క్యూలైన్లోకి వెళ్లి అన్నప్రసాదం కూడా స్వీకరించవచ్చు. కల్యాణానికి వెళ్లే జంటలు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలి. సింహాద్రి అప్నన్న కళ్యాణం జన్మ జన్మల పుణ్యఫలం. ఏడాదిలో ఒక్కసారైనా శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామివారి కల్యాణం జరిపించుకుంటే స్వామివారి కరుణ, కృప దక్కుతాయని భక్తుల విశ్వాసం. మరిన్ని వివరాలకు దేవస్థనంలోని ఈ 0891-2764949, 297966 నెంబర్లలో సంప్రదిస్తే మరిన్ని వివరాలు ఆలయ సిబ్బంది తెలియ జేస్తారు..