ఇట్లు నాన్నకు ప్రేమతో.. మీ పిల్లలు..!


Ens Balu
35
visakhapatnam
2025-06-15 12:25:38

నాన్నంటే నీలాకాశం.. దానికి కొలమానం ఉండదు..చూపించే ప్రమకూ హద్దుండదు.. పదినెలలు కడుపున మోసి అమ్మ జన్మనిస్తే.. జీవితాం తం పెంచి పోషించి నాన్న జీవితాన్ని ఇస్తాడు.. కొవ్వొత్తుని చూసినపుడుల్లా నాన్నే గుర్తుకి వస్తాడు. పిల్లల జీవితాల్లో వెలుగుని నింపడానికి తాను కరిగిపోతాడు. వయసు మీదనవేసుకొని లొంగిపోతాడు. నాన్న అనే పదం ప్రతీ బిడ్డ జీవితంలోనూ 6వ నెల నుంచి 8వ నెలలోనే మొదలవుతాయి. తొలుత బిడ్డ అమ్మ అనే పదం నేర్చుకుంటే.. తరువాత పదం నేర్చుకునేది నాన్ననే. అక్కడి నుంచి తాను భారం మోస్తూ.. మనకి జీవితాలను తేలిక చేస్తాడు నాన్న. అమ్మ, నాన్న ప్రతీ ఒక్కరికీ రెండు కళ్లు. ఏ ఒక్క కంటికి ఇబ్బంది వచ్చినా జీవితమే అంధకారం అవుతుంది. రక్తాన్ని పంచి అమ్మ జీవం పోస్తే.. తాను శ్రమించి ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాడు. అమ్మను మించిన దైవం లేదు.. నాన్న ను మించిన అర్ధం లేదు. నాన్న అనే పదం ప్రతీశ్వాసలోనూ మనల్ని బ్రతికిస్తుంటే.. ప్రతీ శ్వాసను త్యధిస్తూ.. జీవితాన్ని ధారపోస్తాడు. 

నడక నేర్చిన దగ్గర నుంచి నడవడిక నేర్చుకునే వరకూ అందరికీ నాన్నే రోల్ మోడల్. అదే నాన్న ఒక ఉన్నతస్థానంలో ఉంటే.. దానిని సమాజం కీర్తిస్తే.. ఇక నాన్న మనకే కాదు అందరికీ రోల్ మోడల్ అయిపోతాడు. అలాంటి నాన్న మనకి నాన్న అయ్యాడంటే దేవుడు సృష్టి ఎంతటి గొప్పదో అర్ధమవుతుంది. బిడ్డగా పుట్టి.. పౌరుడిగా ఎదిగి.. మనిషిగా మారడానికి మార్పు చెందడం వెనుక నాన్న కృషి, పట్టుదల, శ్రమ వెలకట్టలేనివి. ఈ సృష్టిలో  నాన్న ఉన్నవారు అదృష్టవంతులు.. నాన్న లేనివారు దురదృష్టవంతులనే చెప్పాలి. ఒకరకంగా నాన్న లేకపోవడం శాపంగానే భావిస్తారు అంతా. సుఖంలోనూ, బాధలోనూ, ఆనందంలోనూ, ఆప్యాయతలోనూ అన్నింటా మనవెనుక ఉండేది నాన్న మాత్రమే నాన్న లేకపోతే బిడ్డకు గమనం లేదు. నాన్న లేకపోతే మన బ్రతుకుకి అర్ధం లేదు.. నాన్న లేకపోతే సృష్టి మనుగడే ప్రారంభంకాదు. అందుకే నాన్నను దేవుడితో పోలుస్తారు. దేవుడంటే భక్తుల కోర్కెలు తీర్చేవాడు.

 అలాగే నాన్నఅంటే  బిడ్డల ఆనందాలు, సంతోషాలను తీర్చేవాడు.. తీరుస్తుంటాడు.  ఒక కుటుంబం ఆనందంగా ఉంటుందంటే అందులో నాన్న పాత్ర వెలకట్టలేనది. అమ్మ కుటుంబాన్ని విస్తరిస్తే.. నాన్న కుటుంబానికి గౌరవం తీసుకు వస్తాడు. నాన్న వెన్నంటే ఉంటే నిజంగా పండుగే.. అదే నాన్న లేకపోతే జీవితం కూడా దండగే. ప్రతీ జీవి నాన్నను నా తొలి హీరో అంటాడు..  నాన్నను చూసే బిడ్డ కూడా అన్నీ నేర్చుకుంటాడు. ప్రతీ ఒక్కరి జీవితంలో నాన్న కొండంత అండ, చలువ నీడనిచ్చే చెట్టు.. ప్రాణాన్ని నిలబెట్టే ఆయువు. ఆ ఆయువును పెంచి పోషించడానికి నాన్న పడే కష్టం అంతా ఇంతా కాదు. బిడ్డకు నాన్న తోడుంటే అన్ని విషయాలు నాన్నతో పంచుకుంటాడు. అదే నాన్న లేకపోతే నాన్న ఉన్నవారి చూసి ఆనందపడి.. నాన్న లేనందుకు కడివెడు కన్నీళ్లు కారుస్తూ.. నీలాకాశంలో దేవుడి దగ్గర ఉన్న నాన్నను తలచుకొని ఆకాశం వైపే చూస్తూ.. నాన్న నువ్వు నా దగ్గర లేవు. నేను నా ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలని నాన్న అంటూ బాధపడతాడు. 

నాన్న అనే పదం విన్నప్రతీసారీ నువ్వే గుర్తొస్తున్నావు. మళ్లీ ఎప్పుడు నువ్వు కనిపిస్తావు నాన్న అంటూ దేవుడిని వేడుకుంటూ నాన్నను స్మరించుకుంటాడు. యుక్త వయస్సుకి వచ్చిన తరువాత మా నాన్న నా కడుపున పుట్టాలనుకుంటాడు. అలా మగబిడ్డ పుడితే నాన్నగానూ, ఆడబిడ్డ పుడితే అమ్మగాను అనుకుంటాడు. నాన్నకు దూరమైన లోటుని తనకి పుట్టిన బిడ్డతోనే అన్నీ పంచుకుంటాడు. నాడు పిలవలేని నాన్న అనే పదం తన బిడ్డను ప్రతీసారి నాన్న నాన్న.. అంటూ పిలిచి మురిసిపోతాడు. అంతటి నాన్నకోసం ఏమని చెప్పాలి.. ఎలా చెప్పాలి.. ఆకాకాశమంత నాన్నను ఎలా ఒడిసి పట్టాలి.. ప్రతీ ఏడాది జూన్ 2వ ఆదివారం వచ్చే నాన్నల దినోత్సవరం రోజున నాన్న కోసం ఇలా చెప్పుకొని మురిసి పోవడం తప్పా.. కొందరికి నాన్న దగ్గరున్నా వారికి నాన్నవిలువ తెలియదు.. విలువ తెలిసే వారికి నాన్న దగ్గరుండడు. ఇదే విధి ఆడిన వింత నాటకం. నాటకంలో అన్ని పాత్రలు సజీవంగా ఉంటే దేవుడి కరుణ.. అందరిలో ఏ ఒక్కరిని మనకి దూరం చేసినా  ఆ దేవుడి శాపమే అనుకోవాలి.. ఇంత చెప్పినా మాకు ప్రతీ పదంలో మీరు గుర్తొస్తూనే ఉంటారు. ప్రతీ నాన్నకు ఈ అక్షరాలను అంకిత మిస్తూ.. ఇట్లు నాన్నకు ప్రేమతో మీ పిల్లలు..!