100 రోజుల్లో అంగన్వాడీలకు మంచినీరు..


Ens Balu
3
New Delhi
2020-10-03 12:13:55

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ 2024వ సంవత్సరానికల్లా మంచినీటి ట్యాప్ కనెక్షన్లు కల్పించాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ (జె.జె.ఎ.) కార్యక్రమాన్ని చేపట్టి నట్టు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు కేవలం వంద రోజుల తక్కువ వ్యవధిలో పైపుల ద్వారా మంచినీరు అందించే ప్రత్యేక బృహత్ కార్యక్రమాన్నిఅక్టోబరు 2న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చిన్నారులకు సురక్షిమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న గొప్ప సంకల్పంతో కూడిన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర మంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా శుద్ధమైన నీటిని అందించే కార్యక్రమాన్ని ప్రధాని ఇదివరకే అంటే 2020 సెప్టెంబరు 29న ప్రకటించారు. ఆ రోజున, జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) కింద గ్రామ పంచాయతీలకు, పానీ సమితులకు ‘మార్గదర్శిక’ విడుదల సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు.  పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలకు పైపుల ద్వారా మంచినీరు కల్పించే ఈ పథకాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవలసిందిగా  వివిధ రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు చిన్న పిల్లలకు సోకే అవకాశం ఎక్కువ కాబట్టి అంగన్ స్కూళ్లకు, అంగన్ వాడీ కేంద్రాలకు, ఆరోగ్య రక్షణ కేంద్రాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందించే కార్యక్రమం కోసం జలజీవన్ మిషన్ లో తగిన ఏర్పాటు చేసినట్టు కూడా ప్రధాని చెప్పారు. గ్రామాల్లోని పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్వచ్ఛమైన నీటిని అందించే అంశంపై తీర్మానాల ఆమోదానికి సాధ్యమైనంత త్వరగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ సదుపాయాలను గ్రామ పంచాయతీలు, పంచాయీతీల సబ్ కమిటీలు, (గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలు, లేదా పానీ సమితులు) నిర్వహించవలసి ఉంటుంది. చిన్నారుల ఆరోగ్యానికి, వారి బహుముఖ అభివృద్ధికి దోహదపడేలా వారికి సురక్షిత నీటిని అందించేందుకు ఈ కార్యక్రమ రూపంలో పెద్దఎత్తున కృషి చేయనున్నారు. మహాత్మాగాంధీ 151 జయంతి సందర్భంగా ఇది ‘జాతిపిత’కు అందించే సరైన నివాళిగా పరిగణిస్తున్నారు.