మత్స్య సంపదతో ఆరోగ్యం, ఐశ్వర్యం..


Ens Balu
3
Visakhapatnam
2020-12-07 17:35:59

చేపలు మానవాళికి పౌష్ఠికమైన, శక్తివంతమైన ఆహారంగా ఉపయోగ పడతాయని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.  భారతదేశంలో వున్న అపారమైన మత్స్యసంపదను  సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు.  సోమవారం ఆయన రామకృష్ణా బీచ్ లో గల సముద్ర మత్స్య పరిశోధన సంస్థ ను సందర్శించారు. ఈ సందర్భంగా శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన దేశానికి 8 వేల కి.మీ.ల సముద్రతీరం వుందని, తీరప్రాంతంలో వున్న ప్రజలకు సముద్ర మత్స్య సంపద జీవనోపాధిని కల్పిస్తున్నదని చెప్పారు.  దేశంలో ప్రజలకు ఆహార కొరత తీర్చుతున్నదని, మూడంచలుగా ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు.  ప్రకృతి ప్రసాదించిన ఘనమైన సంపదను మరింత అభివృద్ధి చేసి, అందరికీ అందుబాటులోనికి తీసుకు వచ్చేందుకు సి.యం.ఎఫ్.ఆర్.ఐ. పరిశోధనా సంస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.   సంవత్సరానికి 13.75 మిలియన్ మెట్రిక్ టన్నుల సముద్ర ఆహారోత్పత్తులతో మన దేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో వుందన్నారు.  నదులు, సరస్సులు, చెరువులు తదితర ప్రాంతాలలో చేపట్టిన మత్స్య ఉత్పత్తులతో కలపితే దేశంలో 22 మిలియన్ల మెట్రిక్ టన్నుల ఆహారం ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.  మత్స్య సంపద దేశ సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నదని, ఒక శాతం జాతీయ డి.జి.పి.ని పెంచుతూ,  దేశ ఎగుమతుల్లో 10 శాతంతో రూ.7 బిలియన్ డాలర్ల వాణిజ్యం చేస్తూ  దేశానికి ప్రపంచ ఎగుమతులలో 4వ స్థానం తీసుకు వచ్చిందని వివరించారు.   శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి ప్రజలకు సుఖమయ, సంతోకరమైన జీవనానికి కృషి చేస్తారన్నారు.  వివిధ రకాల జలచరాలను అభివృద్ధి చేయడం,  మత్స్య జాతుల ఉనికి, పెరుగుదల, లభ్యత లపై పరిశోధనచేసి సముద్రంలో మత్స్య సంపద పెరెగేందుకు, నాణ్యమైన, పౌష్ఠికమైన రకాలను అభివృద్ధి చేయడం, తద్వారా దేశ ఆర్ధికరంగం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.  మత్స్యకారుల జీవనం మెరుగుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు.    సముద్ర మత్స్య పరిశోధనా సంస్థకు మూడు పర్యాయాలు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అవార్డులు లభించాయన్నారు.  కరోనా విపత్కర పరిస్థితుల అనంతరం తాను మొదటిసారిగా  బయట సమావేశానికి  హాజరయ్యానని, కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన శక్తివంతమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు.  పాశ్చాత్య వ్యామోహంలో పడి సాంప్రదాయక ఆహారం, యోగా, కసరత్తులను దూరం చేసుకున్నామని తెలిపారు. మనం పూర్వపు జీవన విధానానికి వెళ్లాలని, సంస్కారం పాటించాలని చెప్పారు.  సామాన్యులకు చౌకగా పౌష్ఠికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  దేశ అభివృద్ధికి యువత, రైతులు, శాస్త్రజ్ఞులు, స్వచ్ఛంద సంస్థల వారిని కలసి వారి ద్వారా దేశం, సమాజం అభివృద్ధి చెందే కార్యక్రమాలను చేపట్టాలనేదే తన కోరిక అని ఉప రాష్ట్రపతి వెల్లడించారు. అంతకు ముందు ఉపరాష్ట్రపతి సి.ఎమ్.ఎఫ్.ఆర్.ఐ కేంద్రాన్ని సందర్శించారు.  తమ పరిశోధనలను గూర్చి  శాస్త్రజ్ఞులు ఆయనకు వివరించారు.  సంస్థ మత్స్య ఉత్పత్తులకు సంబంధించిన కరపత్రానికి ఆవిష్కరించారు. శాస్త్రజ్ఞులు రూపొందించిన  మేలైన మత్స్య జాతులను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించి మత్స్యకార రైతులు యు.కె.కృష్ణ, టి.పైడన్నలకు అందించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సి.ఎమ్.ఎఫ్.ఆర్.ఐ. డైరక్టరు  ఎ.గోపాలకృష్ణ, శాస్త్రజ్ఞులు  ఆర్.రఘుప్రకాష్, కె.మురళిధరన్, రవిప్రకాష్ లు ప్రసంగించారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, జె.సి. ఆర్.గోవిందరావు, మత్స్యశాఖ జె.డి.ఫణిప్రకాష్, ఎస్.పి. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.  సంస్థ విశాఖపట్నం శాఖ చీఫ్ సైంటిస్టు  శుభ దీప్ ఘోష్ వందన సమర్పణ చేశారు.