వైకుంఠ ద్వారా దర్శన నిర్ణయం హర్షదాయకం..


Ens Balu
3
Tirumala
2020-12-16 21:25:55

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా డిసెంబ‌రు 25 నుంచి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని టిటిడి తీసుకున్న నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయ‌మ‌ని కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిప‌తి శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామి చెప్పారు. శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామి బుధ‌‌వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామీజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి‌ ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు. ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం వెలుప‌ల శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామి మీడియాతో మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మ‌ధ్వాచార్య సంప్రదాయంలో ప్రధాన మూల మఠంగా  ఆరాధింప‌బ‌డుతోంద‌న్నారు. 45వ మఠాధిపతిగా తాను కొనసాగుతున్నాన‌ని చెప్పారు.  శ్రీ రాఘ‌వేంద్ర‌స్వామివారికి కుల‌దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివార‌ని, ఆ సంప్ర‌దాయాన్ని పాటిస్తూ స్వామివారిని ద‌ర్శించుకుంటున్నామ‌ని తెలిపారు. త‌మ మ‌ఠానికి చాలా కాలం నుండి తిరుమ‌ల‌లో ఇస్తిక‌ఫాల్ స్వాగ‌తం ల‌భిస్తోంద‌ని, ఇది ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని చెప్పారు. శ్రీ‌వారి కృప‌తో త్వ‌ర‌గా క‌రోనా వ్యాధి న‌శించిపోయి భ‌క్తులంద‌రూ సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని స్వామీజీ ఆకాంక్షించారు.   శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో జ‌రుగుతున్న అఖండ వేద‌పారాయణంలో శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామివారు పాల్గొన్నారు.            ఏప్రిల్ 13 నుండి అఖండ వేద‌పారాయ‌ణం జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు కృష్ణ‌య‌జుర్వేద పారాయ‌ణం, జ‌ఠా పారాయ‌ణం పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం ఋగ్వేద పారాయ‌ణం జ‌రుగుతోంది.   ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, విజివో బాలిరెడ్డి, ఓఎస్‌డి  పాల శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.