ఈఎస్ఐ ఆసుపత్రి శంఖుస్థాపనకు కేంద్రమంత్రి..


Ens Balu
3
న్యూఢిల్లీ
2020-12-30 18:45:14

రాజమహేంద్రవరం నగరంలో దాదాపు రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ శంకుస్ధాపన  కార్యక్రమానికి కేంద్రమంత్రి గాంగ్వార్ వచ్చేనెల రెండవ వారంలో వస్తున్నారని ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు. ఈమేరకు ఢిల్లీలో స్వయంగా మంత్రిని కలిసి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించినట్టు చెప్పారు. ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణంతో పాటు 32 మంది సిబ్బంది నివసించడానికి వీలుగా క్వార్టర్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్టు చెప్పారు. సుమారు మూడున్నర ఎకరాల సువిశాల స్ధలంలో నిర్మించే ఈ ఆసుపత్రికి అవసరమైన నిధుల మంజూరు జరిగిందని వివరించారు. ఇదే విషయం మంత్రికి అందజేసిన లేఖలో ఎంపీ పేర్కొన్నారు. అంతేకాకుండా  రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారికి సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ పరిధిలో కూడా పలు క్వారీలు  పరిశ్రమలు ఉండటం, పట్టణ గ్రామీణ ప్రజలు, కార్మికులు అధికశాతం ఉన్నందున అటు ఏలూరు కాకుంటే ఇటు రాజమహేంద్రి కి రావాల్సిన క్లిష్టపరిస్ధితి ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరినట్టు ఎంపీ మీడియాకి చెప్పారు. తాను చేసిన ప్రతిపాదనకు మంత్రి అంగీకరించినట్టు వివరించారు.