పీఐబీ లో ఆంధ్రప్రదేశ్ కి నేటికి దక్కని చోటు..!


Ens Balu
2
New Delhi
2021-01-03 09:02:32

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు పీఐబీ వెబ్ సైట్ లో హైదరాబాదుకి స్థానం దక్కింది. ఆ తరువాత పదేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ పీఐబి న్యూస్ వెబ్ సైట్ లో నేటికీ ఆంధ్రప్రదేశ్ చోటు సంపాదించలేకపోయింది. ఫలితంగా సీఎంఓ వార్తలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేసే సమయంలో చేసే పర్యటనలన్నీ న్యూడిల్లీ పీఐబీ పేరుతోనే వస్తున్నాయి. దానికి కారణం కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నిర్వహించే పీఐబీ న్యూస్ వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ కి చోటు లేకపోవడమే. విభజన హామీల్లో అటు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పీఐబిలో చేర్చాల్సి వుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రసమాచారశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మన రాష్ట్రానికి చోటు దక్కలేదు. పీఐబీలో ఆంధ్రప్రదేశ్ కి చోటు దక్కితే రాష్ట్రంలోని ప్రధాన మంత్రిత్వ శాఖల్లోని అంశాలను, అభివ్రుద్ధి కార్యక్రమాలను, జాతీయస్థాయి ప్రాజెక్టులను మనం తెలియజేయకుండానే దేశంలోని అన్ని రాష్ట్రాలు పీఐబి న్యూస్ వెబ్ సైట్ ద్వారా వీక్షించే వీలుంటుంది. గతంలో టిడిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ ని పీఐబీ వెబ్ సైట్ లో ఏర్పాటు చేసి ఏపీ సీఎంఓ దగ్గరే ప్రత్యేక కార్యాలయలయం ఏర్పాటు చేయాలని సూచించినా అది పలించలేదు. ఆ తరువాత కేంద్రం ఔట్ రీచ్ బ్యూరోలను ఏర్పాటు చేసినా..అవి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాయి. దీనితో ఏపీ సమాచారశాఖకు, రాష్ట్రప్రభుత్వానికి పీఐబీ వెబ్ సైట్ లో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ వెబ్ సైట్ లో రాష్ట్రాలకు చోటు దక్కడం ద్వారా రాష్ట్రంలో జరిగే అభివ్రుద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అధికారిక వర్గాలు, కేంద్రప్రభుత్వం చూసే వీలుంటుంది. ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఐబీ వెబ్ సైట్ లో అధికారికంగా చోటు కల్పించాల్సిన బాధ్యత, దానికోసం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే పోలవరం, గ్రామ సచివాలయ వ్యవస్థ లాంటి ప్రాజెక్టులను కేంద్ర స్థాయిలో అన్ని రాష్ట్రప్రభుత్వాలకి తెలియజేసే అవకాశం లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న 12 రాష్టాలకు పీఐబీలో చోటు ఉండటాన్ని ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఆశన్నమైంది..!