నిరాశగానే బీజేపీ ప్రభుత్వ బడ్జెట్..
Ens Balu
3
New Delhi
2021-02-01 21:05:51
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సింహభాగం ఆశాజనకంగా లేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ,అరకు ఎంపీ గొడ్డేటి మాధవిలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ (ఆంధ్రప్రదేశ్ ) ప్రత్యేక హోదా తో పాటు,విశాఖ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేకరైల్వేజోన్ పై కేంద్రం నీళ్లు చల్లడం దారుణమన్నారు. దశాబ్దాల రైల్వే జోన్ ఆకాంక్షపై కేంద్రం ఎప్పటికప్పుడు పక్షపాత ధోరణిని అవలంబించడం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగానే భావిస్తున్నామన్నారు. ఓవైపు ఆంధ్రులు, మరోవైపు విశాఖ ప్రజల ఆశలకు కేంద్రంలోని బీజేపి బడ్జెట్ గండికొట్టిందన్నారు. ఆయా అంశాల పురోగతిపై తాము పలుమార్లు కేంద్ర మంత్రులు , రైల్వే బోర్డు ఛైర్మెన్ ని కలిసి ఈ విషయాలను ప్రస్తావించినా, జోన్ పై ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఇదే విషయంపై ఇతర ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ ఎంపీ లతో కలిసి పార్లమెంట్ లో తమదైన శైలిలో గళం విప్పుతామన్నారు. ఈ క్రమంలో దేశంలో పేరెన్నిగన్న కొచ్చి ,పారాదీప్ ,చెన్నై ,పెట్యూ వా ఘాట్ తో పాటు అత్యాధునిక అభివృద్ధి చెందుతున్న హార్బర్ల సరసన విశాఖను చేర్చడం ఊరట కలిగించే అంశమన్నారు. విశాఖ హార్బర్ అభివృద్ధి, దాని శక్తి సామర్ధ్యాలపై తాము పలు దఫాలుగా ఆయా కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర విభజన డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.. ఈ క్రమంలో ప్రకటన వెలువడం సంతోషకరమన్నారు .