నాలుగు రాష్ట్రాల్లో గుడి కో గోమాత..


Ens Balu
4
విజయవాడ, Andhra Pradesh, India
2021-02-04 17:53:48

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోందని టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి చెప్పారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోని సత్యనారాయణ పురం లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురువారం గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గాయత్రి సొసైటీ  ఆలయానికి కపిల గోవును బహూకరించింది. టీటీడీ చైర్మన్ ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శాస్త్రోక్తంగా గోపూజ చేసి ఆలయానికి గోవును అందించారు.   ఈ సందర్భంగా  సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఏ ఆలయం అయినా టీటీడీని కోరితే ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి గోమాత, దూడను అందిస్తుందన్నారు. వీటి పోషణ భాద్యత  ఆ ఆలయమే తీసుకోవాలని చైర్మన్ చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం మంగళం పాడిన కళ్యాణమస్తు కార్యక్రమం త్వరలో ప్రారంభించ బోతున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్య కార గ్రామాల్లో త్వరలోనే 500 దేవాలయలను నిర్మిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన సభ్యుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్  మల్లాది విష్ణు, ఎపి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్  పి.గౌతమ్ రెడ్డి,  గాయత్రి పీఠాధి పతి శ్రీ రాగానంద స్వామి, ఆలయ చైర్మన్ ముప్పూరి రాజ, ఆలయ ఈవో  సీతారామయ్య తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.