కరోనాలోనూ నరకం చూపిస్తున్న మొబైల్ నెట్వర్క్ లు..


Ens Balu
4
New Delhi
2021-05-10 01:34:24

భారతదేశంలో మొబైల్ నెట్వర్క్ కంపెనీలు అదును చూసి ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సమయానికి రీచార్జ్ చేయకపోతే సేవలు నిలుపుదల చేసేసే ప్రైవేటు మొబైల్ నెట్వర్క్ తోపాటు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ ఎల్ కూడా వినియోగదారులకు కరోనా సమయంలో చుక్కలు చూపిస్తున్నాయి. అన్ని మొబైల్ నెట్వర్క్ సంస్థలు కాల్ క్వాలిటీని తగ్గించేయడంతోపాటు, ఇంటర్నెట్ స్పీడ్ ని కూడా పూర్తిగా కుదించేశాయి. తీసుకున్న ఆఫర్లకు అనుగుణంగా ప్రతీరోజూ, 1జిబీ, లేదా 2జీబీ ఇంటర్నట్ డెటాలో సగం కూడా వినియోగదారులకు అందించడం లేదు. ముఖ్యంగా జియో నెట్వర్క్ వినియోగదారులతో తీవ్రంగా ఆటలాడుతోంది. ఉచిత ఇంటర్నెట్, 4జి అని ప్రచారాలు ఊదరగొట్టి తీరా వినియోగదారులు అత్యధికంగా ఈ నెట్వర్క్ ని ఎంచుకున్న తరువాత కాల్ క్వాలిటీని పూర్తిగా తగ్గించేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వారంలో సుమారు నాలుగు రోజులు ఎయిర్ టెల్, ఐడియా నెట్వర్క్ లు తమ సిగ్నల్స్ ని ఆపేస్తున్నాయి. ఆ సమయంలో ఎవరినైనా సంప్రదించడానికి కూడా వీలు లేకుండా పోతుంది. నిత్యం బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ రావడం లేదు. ఎవరికైనా ఫోన్ చేయాలంటే గంటల తరబడి కాల్ కలిసే వరకూ అలా ఫోన్లు చేస్తూ చే ఉండాల్సి వస్తుంది. తీరా కాల్ కనెక్ట్ అయ్యిందంటే ఇవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అవతలి వ్యక్తికి అర్ధం కావడం లేదు...అదే అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో ఇవతల వ్యక్తికి అర్ధం కావడం లేదు. ట్రాయ్ నిబంధనల మేరకు తీసుకున్న మొత్తానికి వినియోగదారులకు నాణ్యమైన కాల్ క్వాలిటీతోపాటు, ప్రకటించిన ఇంటర్నెట్ స్పీడు కూడా అదే స్థాయిలో అందించాల్సివున్న ప్రైవేటు నెట్వర్క్ లు ఏ ఒక్క నిబంధనను కూడా అమలు చేయడం లేదు. కరోణా సమయంలో అత్యవసరంగా వైద్య సహాయం కోసం ఎవరికైనా కాల్ చేయాలంటే సుమారు పది 15సార్లు ట్రై చేస్తే తప్పా కాల్ కనెక్ట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా, పట్టణాలు, నగరాల్లోకూడా ఇదే పరిస్థితి ఉందంటే మొబైల్ నెట్వర్క్ లు ఏ స్థాయిలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మొబైల్ నెట్వర్కలన్నీ ట్రాయ్, కేంద్ర టెలీకాం మంత్రిత్వశాఖ అధీనంలో ఉన్నప్పటికీ ఆ శాఖ నుంచి అధికారులు గానీ, మంత్రులు గానీ కరోనా సమయంలోనైనా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచన చేయకపోవడంతో ప్రైవేటు నెట్వర్క్ లు ఆడింది ఆటగా, పాడింది పాటగా తయారవుతున్నాయి. ఎపుడైనా తప్పిదారి కస్టమర్ కేర్ సెంటర్ కి కాల్ చేస్తే...నెట్వర్క్ లో మరమ్మతు చేస్తున్నారు కొద్ది రోజులు పరిస్థితి ఇలానే వుంటుందని చెప్పడంతో వినియోగదారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్లు గానీ మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేస్తే తప్పా ఈ కరోనా సమయంలో మొబైల్ వినియోగదారుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు..