2000 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసిన రైల్వే..


Ens Balu
6
Tadipatri
2021-06-01 12:58:58

భారతీయ రైల్వే నూతన అన్వేషణలతో దేశానికి అనేక విధాలుగా సేవలందిస్తోంది. ఊహించని అనేక సవాళ్లను అధిగమిస్తూ  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 16 రోజుల స్వల్ప కాలంలోనే 2000 మెట్రిక్‌ టన్నులకుపైగా వైద్య ఆక్సిజన్‌ను భారతీయ రైల్వే సరఫరా చేసింది. 1 జూన్‌ 2021 తేదీ నాటికి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా మొత్తం మీద 2,125.6 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ రైల్వే ద్వారా సరఫరా చేసింది.  భారతీయ రైల్వే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణపట్నం, సింహాచలం, తాడిపత్రి వంటి 4 ప్రాంతాలకు ద్రవ రూప వైద్య ఆక్సిజన్‌ను చేరవేసింది.  గుంటూరుకు 720.9 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ చేరవేయగా, కృష్ణపట్నంకు 756.7  మెట్రిక్‌ టన్నులు, సింహాచలంకు 360 మెట్రిక్‌ టన్నులు మరియు తాడిపత్రికి 368 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరా చేశారు. రాష్ట్రానికి కావాల్సిన వైద్య ఆక్సిజన్‌ అవసరాలను తీర్చడానికి దేశంలోని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల నుండి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు నడుపబడినాయి. 33 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 130 ఎల్‌ఎమ్‌ఓ ట్యాంకర్లలో  ఆక్సిజన్‌ సరఫరా అయ్యింది. ఒడిస్సా నుండి 15 రైళ్లు రాగా, జార్ఖండ్‌ నుండి మరో 9 రైళ్లు, గుజరాత్‌ నుండి 7 రైళ్లు మరియు పశ్చిమబెంగాల్‌ నుండి 2 రైళ్లు వచ్చాయి. 
రాష్ట్రాలకు కావాల్సిన ఆక్సిజన్‌ అవసరాలను  వీలైనంత త్వరాగా తీర్చడానికి  రైళ్లు తక్కువ సమయంలో  గమ్యం స్థానాలకు చేరేలా రైల్వే గ్రీన్‌ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్‌ రైళ్లు వీలైనంత త్వరలా చేరేలా పర్యవేక్షణకు రైల్వేలో వివిధ విభాగాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.  వీటి ఫలితంగా, ఈ రైళ్లు సగటను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి.  ఈ క్లిష్ట సమయంలో ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైద్య ఆక్సి.జన్‌ సరఫరా చేయడంలో శ్రమిస్తున్న అధికారులను మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య అభినందించారు. రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్‌ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రైళ్లను వీలైనంత వేగంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా ఇదే తరహ పర్యవేక్షణను ఇక మీదట కూడా కొనసాగించాలని ఆయన రైల్వే బృందాలకు సూచించారు.