యూపీఐ చార్జీలను తిరిగిచ్చేయండి..సీబీడీటీ


Ens Balu
3
New Delhi
2020-08-31 13:46:31

భీమ్‌-యూపీఐ, రూపే, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ డిజిటల్‌ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై వినియోగదారుల నుంచి వసూలు చేసిన చార్జీలను తిరిగి వారికి చెల్లించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలు చేసిన చార్జీలన్నీ తిరిగి ఇచ్చేయాల్సిందేనని ఆదివారం కేంద్రం సర్యులర్‌ జారీచేసింది. డిజిటిల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ తరహా చెల్లింపులపై భవిష్యత్తులో కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని కూడా తేల్చిచెప్పింది. డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2019లో ఫైనాన్స్‌ యాక్ట్‌-2019లో సెక్షన్‌ 269ఎస్‌యూను చేర్చింది. ఆ తరువాత భీమ్‌-యూపీఐ, రూపే- డెబిట్‌కార్డ్‌, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ లావాదేవీలను ఈ సెక్షన్‌ కింద నోటిఫై చేసింది. దాంతో ఈ మార్గాల్లో చేసే చెల్లింపులకు చార్జీలు వసూలు చేయరాదు. కానీ కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటంతో సీబీడీటీ తాజా సర్క్యులర్‌ను జారీచేసింది. ప్రత్యక్ష పన్నుల బోర్డు తీసుకున్న నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు మరింతగా పెరిగే అవకాశం మెరుగుపడనుంది. అంతేకాకుండా ప్రతీసారి బ్యాంకు వెళ్లి కడుతున్న హౌసింగ్, పర్శనల్ లోన్, వెహికల్ లోన్ తదితర అన్ని రకాల లోన్లను ఇక డిటిజల్ పేమెంట్లు చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు...అయితే సిబిడిటి ఆదేశాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.