నిధులు తక్షణమే విడుదల చేయండి..
Ens Balu
4
New Delhi
2021-06-22 15:57:05
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ ఎస్ రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ కోవిడ్ తత్కారణంగా చేపట్టిన లాక్డౌన్ వల్ల పేదలు పనికి పోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని పేర్కొన్నారు. వైద్యం పై అత్యవసరంగా అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కోవిడ్ వల్ల రాష్ట్రం ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నా రేషన్, మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్, బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఒక్కరికి 5-7 లక్షలు ఖర్చవుతోందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి, ప్రజాభివృద్ధికి వనరులు చాలా ముఖ్యమని వివరించారు. పేద, మద్యతరగతి వర్గాలను ఆదుకుని అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందడుగు వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.