టీటీడీకి జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి..


Ens Balu
2
New Delhi
2021-06-24 15:28:00

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గతంలో వుడా)ని చారిటబుల్‌ సంస్థగా పరిగణిస్తూ గతంలో ఆదాయ పన్ను కింద వుడా చెల్లించిన 219 కోట్ల రూపాయలను వడ్డీతో సహా రీఫండ్ చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత  వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గురువారం ఆయన ఆర్థిక మంత్రితో జరిపిన భేటీలో జీఎస్టీ కారణంగా టీటీడీ, ఆదాయ పన్ను కారణంగా వుడా ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వేర్వేరుగా రెండు విజ్ఞాపన పత్రాలను మంత్రికి సమర్పించారు. హుండీ ఆదాయం, ప్రసాదాల విక్రయం ద్వారా లభించే ఆదాయంపై టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. అయితే కాటేజీలు, వసతి గృహాలపై భక్తుల నుంచి వసూలు చేసే అద్దెలు, క్యాంటీన్‌ ఆదాయం, హుండీ ద్వారా స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకల వేలం ద్వారా లభించే ఆదాయం, క్యాలెండర్లు, డైరీల అమ్మకాలపై వచ్చే అదాయం ఇతర రాష్ట్రాలలోని టీటీడీకి చెందిన వివిధ శాఖలు, అనుబంధ ట్రస్టులు సరఫరా చేసే వివిధ వస్తువులపై యధావిధిగా జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు శ్రీ విజయసాయి రెడ్డి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఇలా వసూలు చేసే జీఎస్టీ ఏడాదికి 120 కోట్ల రూపాయల పైబడే ఉంటోందని ఆయన వివరించారు. అందువలన ఈ సేవలు, వస్తు విక్రయాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే టీటీడీకి చెందిన ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించవలసిందిగా ఆయన మంత్రిని కోరారు. టీటీడీకి ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను సత్వరం పునరుద్ధరించడం వలన ఎన్‌ఆర్‌ఐ భక్తులు శ్రీవారికి సమర్పించే విరాళాలు మళ్ళీ పుంజుకుంటాయని తద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని ఆయన మంత్రికి వివరించారు.