తెలుగుభాష పరిరక్షణ ఉద్యమంలా సాగాలి..


Ens Balu
9
Visakhapatnam
2021-06-27 06:53:07

తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో ఆదివారం విశాఖ నుంచి ముఖ్యఅతిధిగా అంతర్జాల వేదిక ద్వారా ప్రసంగించిన ఆయన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా సంఘటితం కావలసిన అవసరం ఉందని తెలిపారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏక తాటి మీదకు తీసుకు రావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు. మనుషులనే గాక తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్న ఉపరాష్ట్రపతి, మనల్ని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే, రెండో గొలుసు భాష-సంస్కృతులని తెలిపారు. తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు వారు తమ సంస్కతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్న ఆయన,  మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు లాంటి సంప్రదాయాలను పునరుజ్జీవింపచేసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆహార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అన్ని మన ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఉపరాష్ట్రపతి, ఇందు కోసం తెలుగు వారందరూ తెలుగు భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. మన మాతృభాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడమే గాక, ఇతరుల భాషా సంస్కృతులను తప్పని సరిగా గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాథమిక విద్య మాతృభాషలో సాగడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడం సులభతరం అవుతుందన్న ఆయన, నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్ద పీటల వేయడం ఆనందించదగిన అంశమని తెలిపారు. మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమనే తప్పుడు అపోహ సమాజంలో నాటుకుపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రస్తుత భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా అందరూ మాతృభాషలో విద్యను అభ్యసించి ఎదిగిన వారేనని గుర్తు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల వెలుపల సుమారు వెయ్యికి పైగా సంస్థలు భాష, సంస్కృతుల పరిరక్షణకు పాటు పడుతున్నాయన్న ఉపరాష్ట్రపతి, ఈ సంస్థలన్నీ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా ఏకతాటి మీదకు వచ్చి అనేక సంగీత, సాహిత్య, భాషాభివృద్ధి కార్యక్రమాలతో, తెలుగు సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్న వారి చొరవను అభినందించారు. తెలుగు రాష్ట్రాల వెలుపల తెలుగు సంస్కృతిని తమ నివాస ప్రాంతాల్లో విస్తరించేందుకు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చేస్తున్న కృషి గురించి తెలుసుకుని ఆనందించానన్న ఆయన,  వివిధ రాష్ట్రాల్లో తెలుగు భాషను ఐచ్చిక విషయంగా ప్రోత్సహించడం కోసం వారు చేస్తున్న కృషి ఉన్నతమైనదని తెలిపారు.

భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి మాత్రమే చాలదన్న ఉపరాష్ట్రపతి, భాషా పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. స్వచ్ఛభారత్ మొదలుకుని వ్యాక్సిన్ వరకూ ప్రజా ఉద్యమంగా మారి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్న ఆయన, తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చకపోతే సంరక్షించుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇందు కోసం పరభాషా వ్యామోహం నుంచి బయట పడడంతో పాటు తెలుగు వారందరూ తెలుగులోనే మాట్లాడం, ప్రభుత్వాలు మాతృభాషను ప్రోత్సహించేలా ఒత్తిడి తీసుకురావడం అవసరమని తెలిపారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఉన్న తెలుగు వారు తమ తమ రాష్ట్రాల్లో భాష-సంస్కృతుల గొప్పతనాన్ని చాటుకునే దిశగా ఆయా రాష్ట్రాల భాషల్లోకి తెలుగు సాహిత్య అనువాదం కోసం చొరవ తీసుకోవాలని సూచించారు. ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదమైనంతగా, తెలుగు సాహిత్యం అనువాదం కావడం లేదని, ఇందు కోసం ప్రభుత్వాలతో పాటు తెలుగు సంస్థలు కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సహా పలు తెలుగు సంస్థలు తమ సమావేశాలను అంతర్జాల వేదిక ద్వారా నిర్వహిస్తుండడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, ఇదే స్ఫూర్తితో భాషను, సాంకేతికతతో అనుసంధానించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయ, బెంగాల్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. శశి పంజా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్, ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డా. సి.ఎం.కె.రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు, కార్యదర్శి  పి.వి.పి.సి ప్రసాద్ తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.