పీవీ జాతి గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడు..


Ens Balu
1
Visakhapatnam
2021-06-28 09:11:13

పాములపర్తి వెంకట నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అని  ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శతజయంతి సందర్భంగా విశాఖలోని సర్క్యూట్ హౌస్ వద్ద ఆయన విగ్రహానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా  పీవీని అభివర్ణించారు. ఆయన నాయకత్వం , దూరదృష్టి ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలోకి మరలించారని తెలిపారు. పీవీ మాటల్లో చమత్కారం, చేతల్లో నిర్వహణా సామర్థ్యం మరువలేనివని తెలిపారు. దేశంలో లైసెన్స్ రాజ్ ను రద్దు చేసిన ఘనత  పీవీ నరసింహారావుదన్న ఉపరాష్ట్రపతి, భారత ఆర్థిక సరళీకరణల నిర్మాతగా అభివర్ణించారు. ముఖ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.వో)లోకి  భారతదేశ ప్రవేశానికి వీలు కల్పించినది ఆయనేనని అన్నారు.  ప్రపంచ యవనికపై దేశ ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించిన  పీవీ, ఎంతో క్లిష్టమైన సమయంలో దేశ పాలనా పగ్గాలను చేపట్టి, వ్యూహాత్మకంగా దేశాభివృద్ధిని గాడిలో పెట్టారని తెలిపారు.  పీవీ భాషాభిమానాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, శ్రీ విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫాణ్’ గా హిందీలోకి అనువదించిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేగాక ప్రసిద్ధ మరాఠీ నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేతో’ని ‘అబల జీవితం’ పేరిట తెలుగులోకి అనువదించారని తెలిపారు. బహుభాషా కోవిదుడైన  పీవీ మాతృభాషలో ప్రాథమిక విద్య సాగాలని ఆకాంక్షించారన్న ఉపరాష్ట్రపతి, హైస్కూల్ స్థాయి వరకూ బోధనా మాధ్యమం మాతృభాషగా ఉండాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

‘రాజకీయ వ్యవస్థ కంటే దేశమే ఉన్నతమైనదని నమ్మిన దేశభక్తుడైన రాజనీతిజ్ఞుడు’అంటూ  పీవీ గురించి మాజీ రాష్ట్రపతి  కలాం పలుకులను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆయన ఈ నేలపై ఘనమైన వారసత్వాన్ని విడిచి వెళ్ళారని, యువతరం వారి నుంచి ప్రేరణ పొంది, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.  పీవీ నరసింహారావు లాంటి గొప్ప నాయకుడి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న ఉపరాష్ట్రపతి, ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశనిర్మాణంలో  పీవీ కృషిని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏ దేశం కూడా తన సంస్కృతి, వారసత్వం మరియు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల అపారమైన సేవలను మరచి ముందుకు సాగలేదన్న ఆయన,  నరసింహారావు లాంటి మహనీయుల జీవితాలను, బోధనలను యువతరానికి తెలియజేయాలని పేర్కొన్నారు.