తిరుమల శ్రీవారికి గో వ్యవసాయ ఆధారిత వంట పదార్థాలతో సంపూర్ణ నైవేద్యం సమర్పించేందుకు వీలుగా దాదాపు ఒక కోటి రూపాయలు విలువైన వంట దినుసులు బుధవారం విరాళంగా అందాయి. టిటిడి మాజీ బోర్డు సభ్యులు, మై హోమ్ గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు ఈ మేరకు హైదరాబాద్‌లోని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి ఈ వంటపదార్థాలను పంపారు. టిటిడి మాజీ బోర్డు సభ్యులు శివకుమార్ ఈ వస్తువులను తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆలయ అధికారులకు అందజేశారు. వీటిలో 6200 కిలోల బియ్యం, 1500 కిలోల దేశీ ఆవునెయ్యి, 600 కిలోల బెల్లం, 17 కిలోల బాదాం, 315 కిలోల జీడిపప్పు, 21 కిలోల కిస్‌మిస్, 85 కిలోల ఆవాలు, 18 కిలోల మెంతులు, 20 కిలోల పసుపు, 25కిలోల ఇంగువ, 380 కిలోల పెసరపప్పు, 200 కిలోల శనగ పప్పు, 265 కిలోల మినుములు, 350 కిలోల చింతపండు, 50 కిలోల రాక్ సాల్ట్, 375 కిలోల నువ్వుల నూనె, 7 కిలోల నువ్వులు, 10 కిలోల శొంఠి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి పోటు పేష్కార్ శ్రీనివాసులు, ఆలయ ఓఎస్‌డి పాల శేషాద్రి, ప్రకృతి వ్యవసాయ రైతు విజయరామ్, వేద పాఠశాల ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.