తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత పారదర్శక సేవలు అందించేందుకు టిటిడి కౌంటర్లను మరింత నైపుణ్యంతో నిర్వహించనున్నట్లు అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకుగాను వృత్తి నిపుణత కలిగిన ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా గురువారంనాడు తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో ఆయన పూజలు నిర్వహించి ఏజెన్సీ సిబ్బందితో లడ్డూ కౌంటర్లలో సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిటిడిలో భక్తులకు విశేష సేవలందిస్తున్న పలు కౌంటర్లను మరింత పారదర్శకంగా, వృత్తి నిపుణతతో నిర్వహించే ఏజెన్సీలను అహ్వానించామన్నారు. ఇందులో బెంగుళూరుకు చెందిన కెవిఎం ఎన్‌ఫో అతి తక్కువ ధరకు టెండరు వేసిందన్నారు. ఇకపై తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, కల్యాణ కట్ట తలనీలాలు సమర్పిచే భక్తులకు టోకెన్లు ఇచ్చే కౌంటర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో దర్శనం టికెట్లు స్కానింగ్ కౌంటర్లు, తిరుపతిలోని ఎస్‌ఎస్‌డి కౌంటర్లు, అలిపిరి టోల్‌గేట్ వద్ద ఉన్న కౌంటర్లు ఈ ఏజెన్సీ చేత నిర్వహించబడతాయన్నారు.
తిరుమల, తిరుపతిలలో యాత్రికులకు సేవలందించే 164 కౌంటర్లలో మూడు షిఫ్టులలో నడపడానికి 430 మంది సిబ్బంది అవసరమని చెప్పారు. కౌంటర్లలో విధులు నిర్వహించే సిబ్బందికి ఒక వారం పాటు శిక్షణ ఇచ్చామన్నారు. వారి వేతనాలు ప్రభుత్వ కనీస వేతన నిబంధనల ప్రకారం ఉంటాయని, ఇపిఎఫ్, ఇఎస్ఐ ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. కౌంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రోటేషన్ పద్ధతిలో వారం వారం ఈ సిబ్బందిని మార్చనున్నట్లు వివరించారు. అనంతరం ఆయన లడ్డూ కౌంటర్లలో లడ్డూల పంపీణిని పరిశీలించారు. అనంతరం బూంది పోటును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, పోటు పేష్కార్ శ్రీనివాసులు, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.