రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం..


Ens Balu
2
Tirumala
2021-07-03 11:08:09

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని వ‌సంత మండపంలో రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణంలో భాగంగా జూలై 6వ తేదీన‌ రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం చేయ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మ‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో శ‌నివారం ఉద‌యం ఆయ‌న అధికారులు, పండితుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వ‌సంత మండ‌పంలో జూన్ 11న ప్రారంభ‌మైన రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణంకు ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తొంద‌న్నారు. ఇందులో భాగంగా జూలై 6న రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం సంద‌ర్భంగా ఎస్వీబీసీ ప్ర‌సారంలో ప్ర‌త్యేక గ్రాఫిక్స్, వ‌సంత మండ‌పంలో అశోక‌వ‌నంను త‌ల‌పించే సెట్టింగ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. యుద్ధ‌కాండ‌ 109 నుండి 114 వ‌ర‌కు ఉన్న 270 శ్లోకాల‌ను పారాయ‌ణం చేస్తార‌ని చెప్పారు. ఇందులో 111వ స‌ర్గ 14వ శ్లోకంలో శ్రీ రామ‌చంద్ర‌మూర్తి రావ‌ణునిపై బాణం ఎక్కు పెట్ట‌డంతో ప్రారంభ‌మై, 19వ శ్లోకంలో వ‌ధించ‌డంతో పూర్త‌వుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హార‌తి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

        రామ‌ణ సంహారంపై శ్రీ తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల‌వారు ర‌చించిన కీర్త‌న‌ల‌ను అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆల‌పిస్తార‌ని వివ‌రించారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్నిఉద‌యం 8.30 గంట‌ల నుండి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంద‌ని తెలిపారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని హార‌తులు ఇచ్చి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో  సురేష్‌కుమార్, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వేద పండితులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.