తిరుమల పవిత్రతను, స్వచ్ఛతను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని, భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకురావద్దని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలకు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు చేరకుండా అలిపిరి చెక్‌పాయింట్ వద్ద తనిఖీలు చేసి వాటిని తొలగిస్తామన్నారు. తిరుమలలోని దుకాణాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను విక్రయించకూడదన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా గాజు, కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్లు భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. 2 నెలల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి తిరుమల స్థానికులు, వ్యాపారులు సహకరించాలన్నారు. భక్తుల అవసరాల కోసం అన్ని కాటేజీల్లో జలప్రసాదం తాగునీరు, జగ్గులు, గ్లాసులు ఏర్పాటు చేశామన్నారు. సదరు జగ్గులు, గ్లాసులను ప్రతిరోజూ శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, డెప్యూటీ ఈవోలు విజయసారథి, హరీంద్రనాథ్, లోకనాథం, భాస్కర్, ఇఇలు శ్రీహరి, మల్లికార్జునప్రసాద్, డిఇ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.