యాత్రికుల కోసం కంప్లైంట్ ట్రాకింగ్..


Ens Balu
3
Tirumala
2021-07-20 16:59:01

తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు..వారు పొందే గదులు, యాత్రికుల సౌక‌ర్యాల‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచ‌న‌లు వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ అప్లికేష‌న్ రూపొందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ఐటి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల గోకులంలో గ‌ల కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం  అద‌న‌పు ఈవో వివిధ విభాగాల అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో వేలాది గ‌దులు ఉన్నాయ‌ని, ఆయా ప్రాంతాల్లో గ‌దులు పొందిన యాత్రికులు ఫ‌ర్నీచ‌ర్‌, ప‌రుపులు, కొళాయిలు, ప‌రిశుభ్ర‌త‌, లైట్లు త‌దిత‌ర‌ స‌మ‌స్య‌ల‌ను తెలిపేందుకు వీలుగా ప్ర‌త్యేకంగా సెల్ నంబ‌రు ఏర్పాటు చేయాల‌ని రిసెప్ష‌న్ అధికారులను ఆదేశించారు. ఈ నంబ‌రుతో పాటు అవ‌స‌ర‌మైన ఇత‌ర స‌మాచారాన్ని అన్ని గ‌దుల్లో స్టిక్క‌ర్ల ద్వారా యాత్రికుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. గ‌దులు పొందిన యాత్రికుల‌కు పంపే ఎస్ఎంఎస్‌లో కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ స‌మాచారం ఉంచాల‌న్నారు. యాత్రికుల ఫిర్యాదులు/సూచ‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు వీలుగా రిసెప్ష‌న్ విభాగం త‌గినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. గ‌దుల్లో మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.  అంత‌కుముందు సుప‌థం మార్గం ద్వారా భ‌క్తుల ప్ర‌వేశానికి సంబంధించి ఆల‌య అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మీక్షించారు. ఈ స‌మావేశాల్లో డెప్యూటీ ఈవోలు ర‌మేష్‌బాబు, లోక‌నాథం,  భాస్క‌ర్‌, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి, విజివో  బాలిరెడ్డి, ఈఈ(ఎఫ్ఎంఎస్‌) మ‌ల్లికార్జున ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.