శాస్త్రోక్తంగా చాతుర్మాసదీక్ష సంకల్పం..


Ens Balu
4
Tirumala
2021-07-25 09:45:48

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త శ్రీ రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైన‌ద‌న్నారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు. అనంతరం  చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ ప‌ర్వ‌దినాన ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారన్నారు.  అంతకుముందు  పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. త‌రువాత సేక‌రించిన పుట్ట మ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయ్యంగారి మఠం వద్ద నుండి  చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ  స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి బాలాలయాన్ని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.

         శ్రీవారి ఆలయ మహ‌ద్వారం చెంత టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.  జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత  పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని,  చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు.   అనంతరం పెద్దజీయర్‌ మఠంలో  పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి కలిసి ఈవో, అద‌న‌పు ఈవో, సివిఎస్వోను శాలువతో సన్మానించారు. అనంత‌రం పెద్దజీయర్ స్వామి భ‌క్తుల‌కు కొబ్బ‌రికాయల‌ను బ‌హూక‌రించారు. ఈ కొబ్బ‌రికాయ‌ల‌ను ఇంటిలో ఉంచుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయ‌ని అర్చ‌కులు తెలిపారు.