శ్రీమద్రామాయణ పారాయణం..
Ens Balu
11
Tirumala
2021-07-25 10:26:35
శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంత మండపంలో శ్రీమద్రామాయణ పారాయణం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 23వ తేదీ వరకు 30 రోజుల పాటు ఈ పారాయణం జరుగనుంది. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ శ్రీమద్రామాయణ పారాయణం ఒక జ్ఞానయజ్ఞమన్నారు. వేదస్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి కలుగుతాయని, వీటి ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పారు. మోక్షసాధనే మానవ జీవితానికి సార్థకత అన్నారు. ఈ పారాయణ గ్రంథాన్ని ఎస్వీబీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని పారాయణం చేసుకోవచ్చని తెలిపారు. రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలోని ప్రధానమైన సర్గలను రోజుకు ఒకటి చొప్పున పారాయణం చేస్తామన్నారు. అయితే జన్మాంతర సకలసౌఖ్యప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గలో గల 120 శ్లోకాలను 30 రోజుల పాటు పారాయణం చేస్తామని వివరించారు. మరోవైపు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, జపాలు, హనుమంత, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూలమంత్రానుష్టానం జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో మొత్తం 32 మంది వేదపండితులు పాల్గొంటున్నారని చెప్పారు. తొలిరోజు ధర్మకార్యసిద్ధి కోసం అయోధ్యకాండలోని 21 నుండి 25 సర్గల్లో గల 221 శ్లోకాలు, జన్మాంతర సకలసౌఖ్యప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గలో గల 120 శ్లోకాలు కలిపి మొత్తం 341 శ్లోకాలను పారాయణం చేశారు. ముందుగా హనుమత్ సీతాలక్ష్మణభరతశత్రుజ్ఞ సమేత శ్రీరాములకు పూజలు నిర్వహించి ఐదు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, ధర్మగిరి వేద విజ్ఞానపీఠం పండితులు పాల్గొన్నారు.