యువతలో మానవీయ, నైతిక విలువలు పెంపొందించేందుకు, ఆర్ష గ్రంథాలు, ప్రాచీన సంప్రదాయాలకు చేరువ చేసేందుకే రామాయణం, మహాభారతం, భగవద్గీత పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం బాలకాండ పారాయణ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ సుందరకాండ పారాయణం ద్వారా శ్రీవారి అనుగ్రహంతో కరోనా మొదటి దశ, రెండో దశలను అధిగమించగలిగామని చెప్పారు. కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని, ఇది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశముందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో బాలకాండ పారాయణం ద్వారా శ్రీవారి ఆశీస్సులు పిల్లలందరిపై ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో శ్రీరాముని బాల్యం, విద్యాభ్యాసం, విశ్వామిత్రుని శిష్యరికం, రాక్షససంహారం, శివధనుర్భంగం తదితర అంశాలు ఉంటాయని తెలిపారు. మంత్రపూరితమైన ఈ శ్లోకాలను ఉచ్ఛరించి, అర్థతాత్పర్యాలు తెలుసుకుని, ప్రస్తుత సమాజ పరిస్థితులకు అన్వయించుకోవడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయన్నారు. టిటిడి ఏర్పాటుచేసిన పండిత్ పరిషత్ సూచలతో ఇలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని, పారాయణం ద్వారా రామాయణంలోని ప్రతి శ్లోకాన్ని భక్తులందరితో పలికిస్తామని చెప్పారు.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధరశర్మ బాలకాండ ప్రాముఖ్యత, విశిష్టతపై మాట్లాడుతూ రామాయణ కావ్యం ధర్మార్థకామమోక్షాలను ప్రసాదిస్తుందన్నారు. భగవంతుడు విశ్వచైతన్యస్వరూపుడని, శ్రీరాముడు తన అవతరణ ద్వారా కుమారుడిగా, భర్తగా, సోదరుడిగా, తండ్రిగా, చక్రవర్తిగా అనేక ఆదర్శాలను చాటారని వివరించారు. యోగ్యుడైన విద్యార్థి శ్రీరాముడైతే, యోగ్యుడైన గురువు విశ్వామిత్రుడని అన్నారు. విశ్వామిత్రుడు తపస్సుతో సంపాదించిన అస్త్రాలన్నీ తన శిష్యుడైన రామునికి అందించారని, ఇది గురుశిష్యుల సంబంధానికి ప్రతీక అని తెలియజేశారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని బాలకాండ ప్రవచనకర్తలను పరిచయం చేశారు. ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం శాస్త్ర పండితులు డా. కోగంటి రామానుజాచార్యులు శ్లోక పారాయణం చేస్తారని, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు డా. ప్రవా రామకృష్ణ సోమయాజి వ్యాఖ్యానం అందిస్తారని తెలిపారు. రామాయణంలోని బాలకాండను కర్మకాండ, అయోధ్యకాండను ధర్మకాండ, అరణ్యకాండను మోక్షకాండ, కిష్కింధకాండను ఆచార్యకాండ, సుందరకాండను మంత్రకాండ, యుద్ధకాండను ముక్తికాండ, ఉత్తరకాండను సమాధానగా కాండగా అభివర్ణించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డా. కుప్పా విశ్వనాథశర్మ విద్యార్థులపై బాలకాండ ప్రభావంపై మాట్లాడుతూ లక్ష్యసాధనకు చేయాల్సిన కఠోరమైన పరిశ్రమ, తల్లిదండ్రుల మాటను శిరసావహించడం లాంటి విషయాల్లో శ్రీరాముడు విద్యార్థులందరికీ ఆదర్శనీయుడన్నారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ రామాయణ వైభవం - వాల్మీకి వైశిష్ట్యంపై మాట్లాడుతూ రామాయణం ద్వారా మానవుని ఆదర్శ జీవన విధానం ఎలా ఉండాలో తెలుసుకోవచ్చన్నారు. ఆర్ష చింతనతోనే సమాజంలో నాగరికత వర్ధిల్లుతుందని, మనస్ఫూర్తిగా కర్మను ఆచరిస్తే ఎంతటి ఉన్నతస్థితికైనా చేరుకోవచ్చని తెలిపారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు డా. ప్రవా రామకృష్ణ సోమయాజి బాలకాండ స్వరూపం - వివిధ అంశాలు అనే అంశంపై మాట్లాడారు. దశరథ మహారాజు రాజ్యపాలన, మంత్రవర్గం, భార్యలు, పరివారం, అశ్వమేథయాగం నిర్వహణ, పుత్రకామేష్టి యాగం, వానరరాజ్యం, రామచంద్ర ప్రభువు జననం, విశ్వామిత్రుని యాగసంరక్షణ, తాటకి వధ, అహల్య శాపవిమోచనం, శివధనుర్భంగం, సీతారాముల కల్యాణం తదితర అంశాలు బాలకాండలో ఉంటాయని వివరించారు. ఆ తరువాత ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం శాస్త్ర పండితులు డా. కోగంటి రామానుజాచార్యులు బాలకాండ రామాయణ ఫలశృతిని వినిపించారు. బాలకాండ శ్లోకంతో పారాయణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రార్థనా శ్లోకాలు, సంకల్పం, విషూచికా మంత్రం, ధన్వంతరి మంత్రం, నవగ్రహ ప్రార్థన శ్లోకాలను పారాయణం చేశారు. ముందుగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు... అనే కీర్తనను వీనులవిందుగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ధర్మగిరి వేద విజ్ఞానపీఠం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు పాల్గొన్నారు.