హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా హిందూ ధర్మప్రచార పరిషత్, టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టులు కలిపి ఉమ్మడి ప్రణాళిక రూపొందించాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం అన్ని ప్రాజెక్టుల అధికారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా నిర్వహించే కార్యక్రమాలతో ప్రాజెక్టుల వారీగా వార్షిక క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణపౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి పర్వదినాలను మండల స్థాయిలో నిర్వహించాలని, ఇందుకోసం భజనమండళ్లు, ఎస్వీ వేదవిశ్వవిద్యాలయం వేదపండితులు, నాలాయిర దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధ్యాపకులు, స్థానిక అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, శ్రీవారి సేవకులను భాగస్వాములను చేయాలన్నారు. ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను తెలుగులోకి అనువదించాలని, ఇందుకోసం తెలుగు, తమిళం తెలిసిన పండితులతో కమిటీ ఏర్పాటుచేయాలని కోరారు. ఆళ్వార్ల తిరునక్షత్ర ఉత్సవాల్లో స్థానిక భక్తులను భాగస్వాములను చేయాలన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిపుణులైన పండితులతో కమిటీ ఏర్పాటుచేసి అందుబాటులో ఉన్న అన్ని దాస సంకీర్తనలను సేకరించాలని, వాటిని ఇతర భాషల్లోకి అనువదించాలని ఆదేశించారు.
కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో శ్రావణమాసంలో శుక్రవారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించాలని అదనపు ఈవో సూచించారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో కృష్ణాష్టమి పర్వదినాన్ని నిర్వహించాలన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలకు అర్థాన్ని వివరించే పనిని వేగవంతం చేయాలన్నారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న అగ్నిపురాణం ముద్రణను త్వరగా పూర్తి చేసి, మిగిలిన 13 పురాణాల అనువాద పనులు చేపట్టాలని సూచించారు. తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇంకా ముద్రించాల్సిన పుస్తకాల వివరాలను సిద్ధం చేయాలన్నారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వేదసభలు, చతుర్వేద హవనాల్లో మిగిలిన ప్రాజెక్టుల సిబ్బంది కూడా పాల్గొనాలన్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, పురందరదాస సంకీర్తనల రికార్డింగ్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులున్నాయా అనే అంశాన్ని పరిశీలించాలన్నారు.
టిటిడి నిర్వహించే అన్ని ధార్మిక కార్యక్రమాల్లో ఆయా ప్రాజెక్టుల అధికారులు, సిబ్బందితోపాటు ప్రజాసంబంధాల విభాగం, ఎస్వీబీసీ, సప్తగిరి మాసపత్రిక విభాగాలను భాగస్వాములను చేయాలని సూచించారు. అన్ని ప్రాజెక్టుల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ బాధ్యతను ప్రోగ్రాం అధికారులు తీసుకోవాలని కోరారు. ఆయా ప్రాజెక్టుల్లో అపరిష్కృతంగా ఉన్న ధార్మిక గ్రంథ రచనలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అన్ని ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.