ఆగస్టులో 2 సార్లు శ్రీవారి గరుడవాహన సేవ..
Ens Balu
11
తిరుమల
2021-08-09 13:19:59
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 13వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఆగస్టు 13వ తేదీన గరుడ పంచమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ''గరుడపంచమి'' పూజ చేస్తారని ప్రాశస్త్యం. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.