తిరుమలలో వసతి పొందిన భక్తులు గది ఖాళీ చేశాక కాషన్ డిపాజిట్ త్వరగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గోకులం అతిథి గృహంలో గురువారం సాయంత్రం ఆయన ఐటి విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులు గది ఖాళీ చేసిన 12 గంటల్లోగా కాషన్ డిపాజిట్ టీటీడీ వారి ఖాతాకు జమ చేయడం జరుగుతోందన్నారు. అయితే బ్యాంకు నుంచి వెండార్ కు, వెండార్ నుంచి భక్తుడి ఖాతాలో జమ కావడానికి మూడు రోజుల సమయం పడుతోందని చెప్పారు. ఇంకా త్వరగా కాషన్ డిపాజిట్ భక్తుల ఖాతాలో జమ అయ్యేలా బ్యాంక్ అధికారులతో.మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాలుగు రోజుల్లో కాషన్ డిపాజిట్ తిరిగి రాకపోతే భక్తులే ఫోన్ చేసి అడిగేందుకు వీలుగా ఒక మొబైల్ నంబర్ ఏర్పాటు చేయాలని ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలో గదులు పొందిన భక్తులు ఆ గదుల్లో వసతికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయడానికి వీలుగా 9966812345 నంబర్ అందుబాటులోకి తేవాలన్నారు. గదుల్లో వసతులకు సంబంధించి ప్రస్తుతానికి భక్తుల నుంచి చాలా తక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, ఇవి కూడా రాకుండా ఎఫ్ ఎమ్ ఎస్ అధికారులు పని చేయాలని అదనపు ఈవో సూచించారు. తిరుమలలో గదుల లభ్యత, మరమ్మతుల వివరాలు తెలిపేలా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్లను క్రమం తప్పకుండా సెక్యూరిటి ఆడిట్ చేయించాలని ఆయన చెప్పారు. తిరుపతిలో భక్తులు దిగగానే తిరుమల యాత్ర గొప్ప అనుభూతి కల్పించేలా చేయడానికి సకల సమాచారంతో కూడిన వర్చువల్ టూర్ లాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపొందించాలన్నారు. టీటీడీలో పలు విభాగాలకు సంబంధించిన కేబుల్స్ ఎలా పడితే అలా ఉంచకుండా, క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
టీటీడీ డేటా సెంటర్ ను బలోపేతం చేయాలని, ఇందుకోసం టీటీడీలోని క్వాలిఫైడ్ సిబ్బందిని ఎంపిక చేసి అవసరమైతే ప్రోత్సాహకాలు ఇద్దామని ఆయన అన్నారు. టీటీడీలోని ఐటి విభాగం సిబ్బందికి శిక్షణ ఇప్పించడానికి దేశంలోని ప్రముఖ ఐటి సంస్థల నుంచి నిపుణులను ఆహ్వానించాలని చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐటి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ఐటి అధికారులను ఆయన ఆదేశించారు. డోనార్ సెల్ కు వివిధ ట్రస్ట్ లకు విరాళాలు ఇస్తున్న భక్తుల కోసం యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా సాఫ్ట్వేర్ ను మార్పులు చేయాలని ఆయన చెప్పారు. ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సందీప్, డిప్యూటీ ఈవో లు లోకనాథం, భాస్కర్, రమేష్, పద్మావతి ఈ సమీక్ష లో పాల్గొన్నారు.