రక్షణ రంగ పరిశోధనల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయానికి తగిన భాగస్వామ్యం, ప్రాధాన్యత కల్పిస్తామని డిఆర్‌డిఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఆచార్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో నెలకొల్పే ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్, ఇంక్యుబేషన్ కేంద్రాలతో కలసి పనిచేస్తామన్నారు. మైసూర్‌లో ఉన్న తమ ఫుడ్ టెస్టింగ్ లాబరీటరీతో ఎంఓయూ చేసుకోవాలని కోరారు. తద్వారా రెండు సంస్థలు కలసి పనిచేయడం వీలవుతుందన్నారు. వీటికి అవసరమైన ఆర్ధిక సహకారాన్ని సైతం డిఆర్‌డిఓ అందించే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగ సమస్యలకు పరిష్కారాలు చూపే దిశగా పనిచేసే స్టార్టప్,ఇంక్యుబేషన్ కేంద్రాలకు రూ కోటి వరకు ఆర్ధిక సహకారం అందించే వెసులుబాటు ఉందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలలో సైతం పరిశోధనల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. బెంగళూరు, ఢల్లీి నగరాలలో ఉన్న తమ ప్రయోగశాలలో కలసి పనిచేస్తూ, పరిష్కారాలను చూపాలని సూచించారు.డిఫెన్స్ టెక్నాలజీలో ఏఐసిటిఈ సహకారంతో ఎంటెక్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతోందని, వీటిని ఏయూ సైతం అందించే ప్రయత్నం జరగాలన్నారు. ఏయూ సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ కేంద్రంగా చేసుకుని పరిశోధన ప్రాజెక్టులను నిర్వహించే విధంగా బలోపేతం చేయడానికి తమ సహకారాన్ని అందిస్తామన్నారు. ఎన్‌ఎస్‌టిఎల్, డిఆర్‌డిఓలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వర్సిటీలో బోధన బాధ్యతలు స్వీకరించి తమ నిపుణతను విద్యార్థులకు అందిస్తారన్నారు. అదే విధంగా వర్సిటీ ఆచార్యులు రక్షణ రంగ సంస్థల ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశం కల్పింస్తారన్నారు.కంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తూ 500 పిహెచ్‌డి పరిశోధకులను తమ ప్రయోగశాలల్లో పనిచేసే విధంగా ప్రతిపాదన ఉందని, దీనికి సైతం ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. విశ్వవిద్యాలయం ఆచార్యులు నిర్వహిస్తున్న రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్సిటీ ఆచార్యులు పరిశోధన ప్రాజెక్టులకు దరఖాస్తు చేయాలని సూచించారు.
వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో ఫుడ్ టెస్టింగ్, ఫార్మ టెస్టింగ్, జెనెటిక్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, స్టార్టప్`ఇంక్యుబేషన్ కేంద్రాలను, నాస్‌కామ్ సహకారంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లను నెలకొల్పుతున్నామని వివరించారు.
ముందుగా డాక్టర్ సతీష్ రెడ్డి ఏయూ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగా రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సెనేట్ మందిరంలో ప్రిన్సిపాల్స్, ఆచార్యులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పి.హరి ప్రసాద్, డిఆర్‌డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కామత్, ఏయూ సిడిఎస్ సంచాలకులు ఆచార్య కె.నిరంజన్, ప్రిన్సిపాల్స్, ఆచార్యులు, డీన్‌లు తదితరులు పాల్గొన్నారు.