తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా పునఃప్రారభించనున్న కళ్యాణమస్తు ( సామూహిక వివాహాలు) కోసం పండిత మండలి బుధవారం మూడు ముహూర్తాలను ఖరారు చేసింది. టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డికి లగ్న పత్రికను అందించింది. తిరుమల నాద నీరాజనం వేదిక మీద బుధవారం ఉదయం గోపావజ్జల బాల సుబ్రహ్మణ్య శాస్త్రి, కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, అర్చకం వేణుగోపాల దీక్షితులు, వేదాంతం , విష్ణు భట్టాచార్యులతో కూడిన పండిత మండలి సమావేశమైంది. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కళ్యాణమస్తు నిర్వహణకు దివ్యమైన ముహూర్తాలను పరిశీలించింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వివాహం చేసుకునే జంటలు ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యాలతో జీవించగలిగే శుభ లగ్నాలను పరిశీలించింది. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మూడు దివ్యమైన లగ్నాలు ఖరారు చేసింది. ఇందులో వైశాఖ బహుళ విదియ శుక్రవారం మూల నక్షత్రం సింహ లగ్నం తేదీ 28 - 5- 2021మధ్యాహ్నం 12-34 నుంచి 12 - 40 నిముషముల మధ్య ఒక ముహూర్తం నిర్ణయించారు. ఆశ్వయుజ బహుళ పక్ష తత్యాల దశమి శనివారం మఖ నక్షత్రం ధనుర్లగ్నం తేదీ 30 - 10 - 2021 ఉదయం 11-04 నుంచి 11-08 గంటల మధ్య రెండవ ముహూర్తం పండితులు నిర్ణయించారు. అలాగే కార్తీక మాసం శుక్లపక్ష తత్యాల చతుర్దశి బుధవారం అశ్విని నక్షత్రం ధనర్లగ్నం తేదీ 17- 11- 2021 ఉదయం 9 -56 నుంచి 10 -02 గంటల మధ్య మరో ముహూర్తం నిర్ణయించారు. ఈ మూడు ముహూర్తాలతో లగ్న పత్రికను రాసి టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డికి అందించారు. అదనపు ఈవో ఎ. వి. ధర్మారెడ్డి, హిందూధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్ర నాథ్, విజిఓ బాలిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లగ్న పత్రికను శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తమ బిడ్డల పెళ్ళిళ్ళ వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో దేశ వ్యాప్తంగా సామూహిక వివాహాలు ( కళ్యాణ మస్తు) నిర్వహించబోతున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు లోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో గుడికి గోమాత కార్యక్రమాన్ని చైర్మన్ ప్రారంభించారు. టీటీడీ పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఐదు ఆలయాలకు దానంగా ఇచ్చిన గోవులు, దూడలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ దంపతుల చేతుల మీదుగా వీటిని ఐదు ఆలయాలకు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రి ఆదేశాల మేరకు టీటీడీ దేశవ్యాప్తంగా అనేక హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా పవిత్ర కార్తీక మాసంలో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజయించినట్లే నని పురాణాలు చెబుతున్నాయన్నారు.దీనివల్ల దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయని ఆయన చెప్పారు. కళ్యాణ మస్తు ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పాటు దేశంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో ఉచిత వివాహాలు నిర్వహించాలని సంకల్పించామన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని బిసి, ఎస్సి, ఎస్టి కాలనీల్లో 500 ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారన్నారు. కోవిడ్ వల్ల ఆలస్యమైన ఈ పనులు త్వరలో ప్రారంభిస్తామని వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,టీటీడీ పాలకమండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హిందూ ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం లోని ధ్యానారామంలో సోమవారం రాత్రి పరమశివుడికి కుంద కుసుమార్చన ( మల్లె పూలు) నిర్వహించారు. మాఘ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ శాంతి, సమస్త మానవులకు మంచి జరగాలని పరమ శివుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు ముందుగా లోక క్షేమం, శాంతిని కాంక్షిస్తూ గణపతి పూజ చేసి భక్తులతో కూడా సంకల్పం చేయించారు. మాఘ శుక్ల చతుర్థిని కుంద చతుర్థి అని కూడా పిలుస్తారని వేద పండితులు వివరించారు. ఈ రోజు పరమ శివుడిని మల్లె పూలతో అర్చిస్తే అఖండ ఐశ్వరం సిద్ధిస్తుందని కుంభ పురాణంలో పేర్కొన్నారని చెప్పారు. రుద్రాధ్యాయం లోని మంత్రాలు పఠిస్తూ షోడ సోపచార పూజ చేశారు. త్రిశత నామావళితో ఉమామహేశ్వరుడిని అర్చించారు. వివిధ దళాలు ( ఆకులు) తో పాటు మల్లె పూలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నీరాజనం, నక్షత్ర హారతి ఇచ్చి, మంత్ర పుష్పం, క్షమా ప్రార్థన చేశారు. చివరగా శ్రీ ఉమామహేశ్వరునికి మంగళ హారతి ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ తో పాటు వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం మాఘభాను పూజను టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ సూర్య మండలంలో సమస్తదేవతలు కొలువై ఉంటారని, సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవంగా భాసిస్తున్నాడాన్నారు. విష్ణువు అలంకారప్రియుడు, శివుడు అభిషేకప్రియుడైతే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడని తెలిపారు. ''ఆరోగ్యం భాస్కరాదిత్చేత్'' అన్న విధంగా భాస్కరుడు జీవకోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడని తెలియజేశారు. మాఘమాసంలో వచ్చే ఆదివారం సూర్యునికి ప్రీతికరమైనదని, ఈ రోజున సూర్యప్రార్థన, స్త్రోత్ర పారాయణంతో పాటు సూర్యనామావళి జపిస్తే సమస్త దోషాలు తొలగిపోతామన్నారు. లోకంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని టిటిడి మాఘభాను పూజ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా మంగళధ్వనితో వేద విజ్ఞానపీఠం సంస్కృత అధ్యాపకులు శ్రీ కృష్ణమూర్తి భాను పూజ ప్రారంభించారు. మొదటగా ప్రార్థన, సంకల్పం, అంగపూజ, షోడశోప పూజ, యంత్ర పూజ, సూర్య స్త్రోత్ర పఠనం, సూర్య నమస్కారాలు నిర్వహించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే పూజ, స్త్రోత్ర పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏ.వి.దర్మారెడ్డి దంపతులు వేద విజ్ఞానపీఠం అధ్యాపకులు, వేద విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఫిబ్రవరి 21వ తేదీన 10వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది. తిరుమలలో నిర్వహిస్తున్న సుందరనకాండ పారాయణం ఫిబ్రవరి 15వ తేదీ సోమవారానికి 250 రోజులు పూర్తి అవుతుంది. అంతేకాకుండా పవిత్ర మాఘమాసంను పురస్కరించుకొని ఫిబ్రవరి 14వ తేదీ ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మాఘభాను పూజ జరుగనుంది.
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొని ప్రధాని ట్రోఫీ గెలుచుకున్న శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి ఎ. హరిప్రసాద్ ను టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అభినందించారు. గురువారం సాయంత్రం టీటీడీ పరిపాలన భవనంలో హరిప్రసాద్ ఈవోను కలిశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట హరిప్రసాద్ స్వగ్రామం. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న హరి ప్రసాద్ రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎన్ సిసి తరపున ఎయిర్ వింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కేరే ఎంపికయ్యారు. పరేడ్ లో విశేష ప్రతిభ కనబరచి 15 ఏళ్ళ తరువాత ఆంద్రప్రదేశ్ కు ప్రధాని ట్రోఫీని సాధించారు. హరిప్రసాద్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సి ఎం అతన్ని అభినందించి రాష్ట్రం తరపున ట్రోఫీ తో పాటు రూ 2 లక్షల ప్రోత్సాహక నగదు బహుమతి అందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఈవోను కలిశారు. వారిని రిపబ్లిక్ డే పరేడ్ ఎంపిక విధానం గురించి ఈఓ అడిగి తెలుసుకున్నారు. టీటీడీ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి పి ఎం ట్రోఫీ గెలవడం అభినందనీయమన్నారు. తాను సివిల్ సర్వీసెస్ కు ఎంపికై ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నట్లు హరిప్రసాద్ ఈవోకు తెలిపారు. టీటీడీ విద్యా విభాగం డిప్యూటీ ఈవో గోవింద రాజన్, హరిప్రసాద్ తల్లిదండ్రులు ఎ. శ్రీనివాసులు, ఎ. కమల, ఎన్ సిసి కేర్ టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ పి.మోహన్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ టి.నారాయణమ్మ, డాక్టర్ ఎల్ ఆర్ మెహన్ రెడ్డి పాల్గొన్నారు.
భగవన్నామస్మరణతో ఎంతటి కష్టమైనా దూరం అవుతుందని బెంగుళూరు వ్యాసరాజమఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ కలియుగంలో భగవంతుని నామసంకీర్తనమే ముక్తికి మార్గమని పేర్కొన్నారు. పురందరదాసుల వారు తన జీవితాన్ని దాస కీర్తనల రచనకే అంకితం చేశారని చెప్పారు. దాస పదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్వాన్ని, శరణాగతి విధానాన్ని, ధర్మాన్ని, నైతిక విలువలను తెలియజేశారని వివరించారు. అనంతరం ఉడిపిలోని పాలిమారు మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ పురందరదాస కీర్తనలు భక్తిని విశేషంగా వ్యాప్తి చేస్తున్నాయని తెలిపారు. భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉత్కృష్టమైన భక్తి మార్గమని పురందరదాసులు చాటి చెప్పారన్నారు. పురందరదాసులవారు అమితమైన భక్తితో స్వామివారిపై అనేక కీర్తనలు రచించారని తెలియజేశారు. అంతకుముందు దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి ఆర్ ఆనంద తీర్థచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 300 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
“ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు” అనే సంస్కరణ వ్యవస్థను దేశంలో విజయవంతంగా అమలు చేసిన 12వ రాష్ట్రంగా రాజస్థాన్ పేరుగాంచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిర్దేశించిన ఈ సంస్కరణను రాజస్థాన్ సమర్థంగా అమలు చేసింది. తద్వారా,.. బహిరంగ మార్కెట్లో రుణాల సేకరణ ద్వారా అదనంగా రూ. 2,731కోట్ల మేర ఆర్థిక వనరుల సేకరణకు రాజస్థాన్ అర్హత సాధించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం తగిన అనుమతిని ఇప్పటికే మంజూరు చేసింది. ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు అన్న సంస్కరణను ఇప్పటికే విజయవంతంగా అమలు చేసిన 11 రాష్ట్రాల సరసన తాజాగా రాజస్థాన్ చేరింది. ఇప్పటివరకూ ఆంధప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ సంస్కరణను సమర్థవంతంగా అమలు చేశాయి. “ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు” సంస్కరణను విజయంవతంగా అమలు చేసిన ఈ 12 రాష్ట్రాలకు అదనపు రుణాల సేకరణకు అనుమతి లభించింది. మొత్తం రూ. Rs.33,440 కోట్ల మేర రుణాల సేకరణకు ఈ రాష్ట్రాలకు కేంద్ర వ్యయ శాఖ అనుమతి ఇచ్చింది.