శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం టిటిడి వైద్య విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎబి.నర్మద తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు. ఈ మూడు రోజుల్లో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో 1, భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో 20, స్థానికుల కోసం 4 కలిపి మొత్తం 25 శిబిరాలను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంపై తిరుమలలోని భక్తులకు, స్థానికులకు అవగాహన కల్పించేందుకు జనవరి 30వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఎస్వీ హైస్కూల్, ఎస్వీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తారు.
తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి గురువారం ఏకాంతంగా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఏకాంతంగా నిర్వహించారు. ప్రతిఏటా పుష్యమి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను ఏకాంతంగా చేపట్టారు. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ బయలుదేరి శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు మురళీకృష్ణ, ఆర్జితం ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ రాజు, ఇంజినీరింగ్, అటవీ, విజిలెన్స్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. ప్రతీమాసంలోనూ స్వామివారికి విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఫిబ్రవరి నెలలో నిర్వహించే ఉత్సవాల వివరాలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న స్మార్థ ఏకాదశి, ఫిబ్రవరి 8న వైష్ణవ మాధ్వ ఏకాదశి, ఫిబ్రవరి 11న శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవం, ఫిబ్రవరి 12న కుంభ సంక్రమణం, శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవారంభం, ఫిబ్రవరి 16న వసంత పంచమి, ఫిబ్రవరి 19న రథసప్తమి, ఫిబ్రవరి 23న భీష్మ ఏకాదశి, సర్వ ఏకాదశి, ఫిబ్రవరి 24న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, ఫిబ్రవరి 27న కుమారధారతీర్థ ముక్కోటి నర్వహిస్తారు. దీనికోసం ఇప్పటికే అధికారులు ప్రత్యేక కార్యాచరణ కూడా తయారు చేసింది..
సృష్ఠిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం సుందరకాండలోని 36వ సర్గ నుంచి 38వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను పారాయణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ 9వ విడత సుందరకాండ అఖండ పారాయణం ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగింది. కోవిడ్ - 19 లాక్‌డౌన్‌ను అధిగమించాలని లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న పరాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పరాయణం ప్రారంభించి 293 రోజులు పూర్తి చేయగా, జనవరి 27వ తేదీకి సుందరకాండ పారాయణం 231 రోజులు పూర్తి అయింది. వాల్మీకి మహర్షి రచించిన రామయణంలోని సుందరకాండ పారాయణం వలన బుద్ధి, బలం, దైర్యం, భయం లేక పోవడం, సఖల జీవులు ఆయురారోగ్యాలతో ఉంటాయి. సుందరకాండలోని 68 సర్గలలోని 2821 శ్లోకాలను మొత్తం 16 పర్యాయలు అఖండ పారాయణం నిర్వహిస్తారు. టిటిడి ఇప్పటివరకు ఎనిమిది పర్యాయలు సుందరకాండ అఖండ పారాయణం పూర్తి చేసింది.
తొమ్మిదవ విడత అఖండ పారాయణంలోని 188 శ్లోకాలను ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో శ్రీ పవన్‌కుమార్ శర్మ, శ్రీ రామానుజాచార్యులు పారాయణం చేశారు. ఈ పారాయణంలో దాదాపు 200 మంది ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటీ ఉప కులపతి మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు దక్షిణామూర్తి, ఉన్నత వేద అధ్యయన ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలతోపాటు శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ తిరుమల హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతోందని టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో మంగళవారం ఉదయం 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన జాతీయ నాయకుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుమలలో చేపడుతున్న విశ్రాంతి గృహాల మరమ్మతులు, ఉద్యానవనాలు, పరకామణి భవనం, పోటు భవన నిర్మాణంతోపాటు అలిపిరి కాలిబాట పైకప్పు పునర్నిర్మాణ పనులు ఈ ఏడాదిలోనే పూర్తవుతాయని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు దర్శనం కల్పించామని, ఇందుకోసం ఒక సంవత్సర కాలం పాటు జీయర్‌స్వాములు, ఆగమసలహాదారులు, పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు నివాసముండే వైకుంఠంలో 12 గంటల సమయం ఉత్తరాయన పుణ్యకాలంలో మానవులకు 6 నెలలకు సమానమని, ఆ తర్వాత 12 గంటలు దక్షిణాయన పుణ్యకాలంలో 6 నెలలు సమానమని తెలియజేశారు. ఉత్తరాయన పుణ్యకాలంలో స్వామివారు 33 మంది దేవతలతో 40 నిమిషాల పాటు ఆస్థానం నిర్వహిస్తారని, ఈ సమయం భూలోకంలో 10 రోజులకు సమానమని చెప్పారు. దేశంలోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరంగంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవడానికి ఇదే కారణమని తెలియజేశారు. అన్ని పురాణ గ్రంథాలను పరిశీలించిన అనంతరం తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వారం తెరిచి 4.26 లక్షల మందికి దర్శనభాగ్యం కల్పించినట్టు వివరించారు.
పరకామణి ప్రక్రియను భక్తులు వీక్షించేందుకు వీలుగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమరుస్తూ రూ.8.90 కోట్లతో పరకామణి భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. పోటులో రోజుకు 7.50 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు వీలుగా అధునాతన 40 బర్నర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్వీ మ్యూజియంలో స్వామివారి ఆలయ దర్శన అనుభూతిని కల్పించేరీతిలో గ్యాలరీలు, శ్రీవారి ఆభరణాల నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యానవనాలను అభివృద్ధి చేయడంతోపాటు రూ.120 కోట్లతో విశ్రాంతి గృహాల మరమ్మతులు చేపడుతున్నట్టు చెప్పారు.
శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన తరువాత తిరుమలలో దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడిందని, భక్తుల ఆదరణతో ఈ ట్రస్టు విరాళాలు రూ.100 కోట్ల మార్కుకు చేరుకున్నాయని తెలిపారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో యోగవాశిస్టంతోపాటు సుందరాండ పారాయణం, విరాటపర్వం, గీతాపారాయణం, వేదపారాయణం ప్రారంభించామన్నారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి విశేష ఆదరణ లభించిందన్నారు. ఈ కారణంగానే జూలైలో ప్రారంభించిన ఎస్వీబీసీ ట్రస్టుకు ఇప్పటివరకు రూ.16 కోట్ల విరాళాలు అందాయని, భవిష్యత్తులో ఈ ఛానల్ స్వయం సమృద్ధి సాధించేదిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు విశేష సేవలందిస్తున్న టిటిడిలోని సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదేస్ఫూర్తితో సంస్థకు కీర్తిప్రతిష్టలు తెచ్చేలా సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విజివో బాలిరెడ్డి, ఎస్ఇ-2 నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, డిఎఫ్వో చంద్రశేఖర్, డెప్యూటీ ఈవోలు బాలాజీ, నాగరాజ, సెల్వం, విజయ సారధి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు స్పాన్సర్ షిప్పుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఆదివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షలా 98 వేలా 70 రూపాయలు తమవంతుగా స్పాన్సర్షిప్ అందించింది. ఈ మేరక బ్యాంకు ఎండి చల్లా శ్రీనివాసులు చెట్టి ఈ స్పాన్సర్షిప్ మొత్తం డిడిని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. తమ స్పాన్సర్ షిప్ తో ధార్మిక కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ అమరావతి సర్కిల్ సిజిఎం సంజయ్ సహాయ్, జనరల్ మేనేజర్ వినిత భట్టాచార్జీ, తిరుపతి డిజిఎం ఎస్.గిరిధర్, రీజనల్ మేనేజర్ ఎస్.సత్యనారాయణ, తిరుమల శాఖ మేనేజర్ సిహెచ్‌విఎస్.ప్రసాదరావు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమించాలని ఢిల్లీ జెఎన్‌యు విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు, ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఐషీ ఘోష్ పిలుపునిచ్చారు. ఆదివారం రైతు చట్టాలను రద్దు చేయాలని దేశంలోని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, విసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన స్టూడెంట్స్ మార్చ్‌లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ న్నర కార్యదర్శి ఎల్.జె.నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. ఢిల్లీ శివారులో 58 రోజులుగా రైతులు పోరాటాలు చేస్తున్నారని, ఎన్నో పోరాటాలు చేసిన ఢిల్లీ ఎస్ఎఫ్ఐ, జెఎన్‌యు నేడు రైతుల పోరాటాలకు మద్దతుగా నిలిచిందన్నారు. బిజెపి ప్రభుత్వం ఆదాని, అంబానీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులను రోడ్డెకించిందన్నారు. దేశంలో మేధావులను, ప్రశ్నించే వారిని పొట్టన పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. వివిధ భాషలు, సంస్కృతులున్న దేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్లు మతాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఆరేళ్ళుగా దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. ప్రజా స్వామ్య, రాజ్య్నా హక్కులను కాలరాస్తున్నారని దుయ్య బట్టారు. ఇటువంటి తరుణంలో విద్యార్ధి, యువజన, కార్మిక, కర్షక, మహిళలు అంతా కలిసి ఐక్య పోరాటాలు సాగించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నారు. బిజెపి ఎమర్జెన్సీ పాలన సాగిస్తుందని, వారు అనుసరిస్తున్న హింసాత్మక ధోరణిలను వ్యతిరేకించాలన్నారు. ఒక వైపు కుల, మతాలను రెచ్చగొడుతూ మరో వైపు జాతీయ వాదాన్ని అనుసరించి మాటాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లు తగ్గించి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఐశ్వర్య అనే అమ్మాయి స్కాలర్షిప్ రాలేదని ఆత్మ హత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేలను అమ్మకానికి పెట్టి సామాన్యులు రైలెక్కలేని పరిస్థితికి తీసుకువస్తున్నారన్నారు. బిఎస్ఎన్ఎల్, ఎల్,ఐ,సి వంటి ప్రభుత్వ ర్న సంస్థలను కార్పొరేట్ పరంచేసే కుట్రలు చేస్తున్నారని బిజెపి తీరును తీవ్రంగా ఎండ్నట్టారు. బ్రిటిష్ వారికి సహకరించిన ఆర్ఎస్ఎస్, బిజెపిలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్ జయంతిని ఏ ముఖం పెట్టుకొని చేస్తారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో దక్షిణ భారత దేశం నుంచి మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగించాలన్నారు. ముందుగా ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు భారీ ప్రదర్శనగా జివిఎంసి ఎదురుగా ఉన్న గాంధీ వ్నిహ్రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విదార్ధులు, ప్రజానాట్య మండలి, విసిసి సభ్యులు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శించిన వివిధ నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధక్షుడు ఎ.అశోక్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, డివైఎఫ్ఐ న్నర కార్యదర్శి యుఎస్ఎన్ రాజు, ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు చిన్నారి, మౌనిక, ఐద్వా న్నర కార్యదర్శి డాక్టర్ జి.ప్రియాంక, విసిసి కన్వినర్ కె.సుశీల తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ఒక సంవత్సరం పాటు ధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు గాను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 లక్షలా 55 వేల 120 రూపాయలు స్పాన్సర్షిప్ అందించింది. బ్యాంకు ఎండి, సిఈవో రాజ్‌కిరణ్ రాయ్ సూచనల మేరకు తిరుపతి డిజిఎం దత్తాత్రేయ వేంకటేశ్వరశర్మ స్పాన్సర్షిప్ మొత్తం డిడిని శనివారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. తద్వారా ఇకపై ఎస్వీబీసీ ఛానల్ కు కేవలం స్పాన్పర్ షిప్ కార్యక్రమాలే మాత్రమే స్వీకరిస్తాయని, ప్రకటనలు లేని శ్రీవారి ప్రసారాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఎస్వీబీసీ అడుగులు ముందుకు వేస్తోంది. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ తిరుపతి ఎజిఎం చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల శాఖ మేనేజర్ సాంబశివరావు పాల్గొన్నారు.
భరతజాతి గర్వించదగ్గ వీరుడు సుభాష్ చంద్ర బోస్ అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లారడుతూ, ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాత బానిస సంకెళ్ళను విముక్తం చేయుటకై అహింసాయుత మార్గమే కాకుండా శస్త్రఅస్త్రాలతో వారిని ఎదుర్కొని స్వాతంత్ర్యం కోసం పోరాటం సల్పారని గుర్తుచేశారు. రక్తం చిందించి, దేశం కోసం సమర్పితులవ్వాలని దాని కోసం భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దాలని పిలుపునివ్వడంతోపాటు ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ పేరుతో భారత జాతీయ సైన్యంను స్థాపించిన గొప్ప స్వతంత్ర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. జులై 4, 1944 లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో “మీ రక్తాన్ని ధారపోయండి..మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అని యువను ఉత్తేజ పరిచారన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశభక్తుడని.. భారతజాతి స్వాతంత్రానికి ఆయన చేసిన నిస్వార్ధ సేవలను స్మరించుకుంటూ ఈసారి ఆ మహానుభావుడి 125వ జయంతిని దేశవ్యాప్తంగా "పరాక్రమ దినం" గా జరుపుకుంటున్నామని అన్నారు.
తిరుమలలో జనవరి 28వ తేదీన జరగాల్సిన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను టిటిడి రద్దు చేసింది. ఈ కారణంగా రామకృష్ణ తీర్థంలోకి భక్తులకు అనుమతి లేదని టిటిడి స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తీర్థంలో స్నానాలకు రావొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉన్నందు వలన టిటిడి పరిధిలో చేపట్టే కార్యక్రమాల వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి 27వ తేదీన 9వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 36వ సర్గ నుంచి 38వ సర్గ వరకు ఉన్న 186 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి ప్రత్యేకంగా కోరుతోంది..