తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఆ రోజున తెల్లవారుజామున 5.30 గంటల నుండి ఉదయం 8.00 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథారూఢుడై సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, 'రథసప్తమి'ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.
సమయం వాహనం
ఉ. 5.30 - ఉ. 08.00 సూర్యప్రభ వాహనం
(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.38 గంటలుగా నిర్దేశించడమైనది)
ఉ. 9.00 - ఉ. 10.00 చిన్నశేష వాహనం
ఉ. 11.00 - మ. 12.00 గరుడ వాహనం
మ. 1.00 - మ. 2.00 హనుమంత వాహనం
మ. 2.00 - మ. 3.00 చక్రస్నానం
సా. 4.00 - సా. 5.00 కల్పవృక్ష వాహనం
సా. 6.00 - సా. 7.00 సర్వభూపాల వాహనం
రా. 8.00 - రా. 9.00 చంద్రప్రభ వాహనం
ఆర్జితసేవలు రద్దు :
శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.
కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాలు ఫిబ్రవరి 10 నుండి 12వ తేదీ వరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం 5.30 నుండి 7 గంటల వరకు సుప్రభాతం, ధ్యానం, సమూహిక భజనలు, నగర సంకీర్తన నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో శ్రీ పురందర దాస సంకీర్తనమాల జరుగనుంది. అనంతరం ఉదయం 9:30 మరియు మధ్యాహ్నం 12 గంటల వరకు బెంగుళూరుకు చెందిన వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ, ఉడిపికి చెందిన పుత్తిగే మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ, పాలిమారు మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కుక్కె సుబ్రహ్మణ్యంస్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీలు మంగళ శాసనములు అందించనున్నారు.
కాగా, ఫిబ్రవరి 11 న సాయంత్రం 6 గంటలకు సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడున్న శ్రీ పద్మావతి పరిణయ మండపంలో శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు శ్రీ పురందరదాస కీర్తనలను బృందగానం చేస్తారు. 1480వ సంవత్సవం కర్ణాటకలో జన్మించిన శ్రీ శ్రీనివాస నాయక తరువాత పురంధర దాసగా మారి తన 84 సంవత్సరాల జీవితకాలంలో దాదాపు 4.75 లక్షల సంకీర్తనలను రాశారు. 1564 లో శ్రీవారిలో ఐక్యమైనారు.
తెలుగు పద పితామహుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు మాదిరిగానే, శ్రీ పురంధర దాస కూడా తన సంకీర్తనాల ద్వారా శ్రీ వేంకటేశ్వరుడికి విశేష సేవ చేసారు. టిటిడి 1979 లో దాసా సాహిత్య ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలను నిర్వహిస్తున్నది. తిరుమలలో 2006వ సంవత్సరం నుండి శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాలను పురస్కరించుకొని టిటిడి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి పి ఆర్ ఆనంద తీర్థచార్యులు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
కేంద్రం మరోసారి విశాఖ వాసుల సెంటింమెంటుపై ప్రైవేటు ఉక్కుపాదం మోపి క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసి ఈ ప్రాంతాన్ని, భూములను బడా గుత్తేదారులకు దారాదత్తం చేయాలని చూస్తుంది. ఎవరు ఏమనుకున్నా తమకు పట్టదంటూ కేంద్ర కేబినెట్ లో ముసాయిదాను పెట్టి స్టీలు ప్లాంట్ ను అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చింది. విశాఖ సిగలో మణిహారంగా వున్న విశాఖ ఉక్కును వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని, నాటి ప్రధాని దివంగత పీవీ నర్శింహారావు దీనిని జాతికి అంకితం నేటి ప్రధాని నరేంద్రమోడీ గుత్తేదారులకు దారాదత్తం చేయాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక్షంగా 20 వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాది చూపిస్తున్న నవరత్న హోదా కలిగిన స్టీలు ప్లాంట్ ను కరోనా సమయంలోని నష్టాలను ఎరగా చూపి కేంద్రం దీనిని ప్రైవేటు పరం చేయాలని భావిస్తోంది. దీనిపై గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రజా ఉద్యమం నేడు తీవ్రరూపం దాలుస్తోంది. యావత్ భారతావనికే తలమానికంగా వున్న విశాఖ స్టీల్ ప్లాంటను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి విశాఖ వాసులు సిద్దంగా లేరనే విషయాన్ని కేంద్రానికి మరోసారి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వ్యతిరేకతను కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేసింది. అయినప్పటికీ కేంద్రం విశాఖ స్టీలు ప్లాంటును అందులోని ప్రధాన వాటాలను, యాజమాన్య హక్కులను, 19వేల ఎకరాలకు పైగా ఖాళీగా ఉన్న భూములను కూడా అమ్మేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కేంద్రంలో అన్ని పనులు కర్మాగారాశాఖలో చక చకా జరిగిపోతున్నాయి. నాటి ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడితే విశాఖకి రైల్వే జోన్ ఇస్తామని మొండి చేయి చూపిన కేంద్రం ఇపుడు విశాఖ వాసుల సెంటిమెంటుగా వున్న విశాఖ స్టీలును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి మొత్తం విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను లేకుండా చేయాలని చూస్తోంది. నాటి విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు ఉద్యమం మరోసారి విశాఖలో మొదలై రాష్ట్ర వ్యాప్తం అయ్యింది. ఇప్పటికే దీనిపై జాతీయ రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగ తమ నిరసన గళాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి..
తమిళనాడు రాష్ట్రం ఉలుందుర్పేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ సభ్యులు కుమారగురు 4 ఎకరాల స్థలం, నిర్మాణ ఖర్చులకు రూ 3.16 కోట్లు చెక్కులు శనివారం విరాళంగా అందించారు. తిరుమల గుబ్బ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి వీటిని అందించారు. ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలు, రూ 3.16 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కులను కుమారగురు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ధర్మ ప్రచారం చేస్తున్నామన్నారు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్ లో శ్రీవారి ఆలయానికి శంఖుస్థాపన చేస్తామన్నారు. కుమారగురు తన నియోజకవర్గ ప్రజలకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడానికి రూ 20 కోట్ల విలువ చేసే 4 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఆలయ నిర్మాణానికి గతంలో కోటి విరాళం ఇచ్చారనీ, ప్రస్తుతం ఇచ్చిన చెక్కులతో కలిపి రూ 3 కోట్ల 16 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు. ఆలయ నిర్మాణానికి ఖర్చయ్యే మిగిలిన మొత్తం కూడా కుమార గురు విరాళంగా అందిస్తామని చెప్పడం సంతోషమని సుబ్బారెడ్డి చెప్పారు. మంచి ముహూర్తం చూసుకుని ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు.
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోందని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోని సత్యనారాయణ పురం లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురువారం గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గాయత్రి సొసైటీ ఆలయానికి కపిల గోవును బహూకరించింది. టీటీడీ చైర్మన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శాస్త్రోక్తంగా గోపూజ చేసి ఆలయానికి గోవును అందించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఏ ఆలయం అయినా టీటీడీని కోరితే ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి గోమాత, దూడను అందిస్తుందన్నారు. వీటి పోషణ భాద్యత ఆ ఆలయమే తీసుకోవాలని చైర్మన్ చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వం మంగళం పాడిన కళ్యాణమస్తు కార్యక్రమం త్వరలో ప్రారంభించ బోతున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్య కార గ్రామాల్లో త్వరలోనే 500 దేవాలయలను నిర్మిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన సభ్యుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎపి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి.గౌతమ్ రెడ్డి, గాయత్రి పీఠాధి పతి శ్రీ రాగానంద స్వామి, ఆలయ చైర్మన్ ముప్పూరి రాజ, ఆలయ ఈవో సీతారామయ్య తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి కైంకర్యాలకు అవసరమైన పుష్పాల కోసం తిరుమల బాట గంగమ్మ ఆలయం సమీపంలో శ్రీవారి పుష్ప ఉద్యానవనాన్ని టిటిడి ఏర్పాటు చేసింది. టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో గార్డెన్ విభాగం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సంప్రదాయ పుష్పాలైన చామంతి, వృక్షి, రోజ, మధురై మల్లెలు, కనకాంబరం, మాను సంపంగి, లిల్లీలు, తులసీ, పన్నీరు ఆకు, తదితర మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ పుష్పాలను ఏప్రిల్, మే నెలల నుండి శ్రీవారి కైంకర్యాలకు వినియోగించనున్నారు. అదేవిధంగా దాదాపు రూ.1.5 కోట్లతో తిరుమల క్షేత్ర పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో శిలా తోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేశారు. ఇందులో ఏడు ఆకులు కలిగిన అరటితోపాటు, తులసి, ఉసిరి, మోదుగ, జువ్వి, జమ్మి, దర్భ, సంపంగి, మామిడి, పారిజాతం, కదంబం, రావి, శ్రీగంధం, అడవి మల్లి, మొగలి, పున్నాగ, అశోక, పొగడ, ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, నాబి, మాదిఫల, బొట్టుగు, భాందిరా వంటి 25 రకాల మొక్కలు ఉన్నాయి. గోగర్భం డ్యాం వద్ద శ్రీ వేంకటేశ్వర శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనంలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కల్పించేందుకు దాతల సహకారంతో తిరుమలలోని ఉద్యాన వనాలను టిటిడి అభివృద్ధి చేస్తోంది. టిటిడి గార్డెన్, అటవీ విభాగం ఆధ్వర్యంలో రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలోను విరివిగా మొక్కలను పెంచుతున్నారు.
కర్టాటక హరిదాసవరేణ్యుల సంకీర్తనలను దాససాహిత్య సర్వస్వం పేరుతో టిటిడి ముద్రించదలచిందని, ఇందుకు భక్తుల సహకారం అవసరమని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల తమ కార్యాలయం నుండి దాససాహిత్య ప్రాజెక్టు అధికారులతో ఈవో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ లక్షలాదిగా ఉన్న కర్ణాటక హరిదాస కీర్తనలను పుస్తకరూపంలోకి తెచ్చే బృహత్తర కార్యక్రమాన్ని టిటిడి ప్రారంభించిందన్నారు. ఇందులో కొన్ని కీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయన్నారు. మిగిలినవి కర్ణాటకలోని వివిధ విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల్లోను, దాససాహిత్య వంశీకులు వద్ద ఉన్నాయని, వాటిని తాము సేకరించి పరిష్కరిస్తామని పండితమండలి సభ్యులు ఈవోకు తెలిపారు. ఇందుకోసం ఎస్వీబీసీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించే ఏర్పాటు చేయాలని పండితులు కోరారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన విజయ్ ముతాలిక్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని ఈవో తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, పండిత మండలి సభ్యులు డా. ప్రభంజనాచార్, డా. నాగరత్న, డా.గోకుల్నాథ్, డా. హయవదన పురానిక్, విజయ్ ముతాలిక్, డా. నాగరాజాచార్యులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఆన్‌లైన్‌లో డోనార్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు పొందే అవకాశాన్ని బుధవారం (ఈ రోజు) నుండి టిటిడి కల్పించింది. కోవిడ్ - 19 కారణంగా సెప్టెంబరు 11వ తేదీ నుండి ఈ సేవ టికెట్లు పొందిన గృహస్తులకు విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారు. కోవిడ్ - 19 కారణంగా గత ఏడాది మార్చి 13వ తేదీ నుండి శ్రీవారి ఆర్జిత సేవలు రద్ధు చేసిన విషయం తెలిసిందే. ఉదయాస్తమాన సేవ టికెట్లు పొందిన గృహస్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్లు పొందిన భక్తులతో పాటు విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ఇతర వివరాలకు ఆర్జితం కార్యాలయం ఫోన్ నెం - 0877-2263589 లేదా ఇ - మెయిల్ arjithamoffice@gmail.com కు సంప్రదించాలి.
తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఫిబ్రవరి 5వ తేదీన శుక్రవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి కి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261. అత్యధిక భక్తులు ఇచ్చిన సూచనలు, చేసిన ఫిర్యాదులు ఆధారంగా టిటిడి చర్యలు తీసుకుంటుంది. దానికోసం టిటిడి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. డయల్ యువర్ ఈఓ ద్వారా భక్తుల సందేహాలకు, అనుమానాలకు టిటిడి అధికారులు నివ్రుత్తి చేయడంతోపాటు, లోపాలను పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటారు. అందుకే ఈ కార్యక్రమాన్ని శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టిటిడి అధికారులు కోరుతున్నారు.
భారత పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ లోక్‌సభాపక్ష నేత పి.వి. మిధున్ రెడ్డి, సహచర పార్టీ ఎంపీలతో కలిసి న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిందని ఆయన అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను బడ్జెట్‌లో విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఇది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందని అన్నారు.
ఎన్నడూ లేనటుంవటి బడ్జెట్ వస్తున్నదంటూ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ చెప్పకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు గత బడ్జెట్‌లకు ఏమాత్రం భిన్నంగా లేదన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు సంబంధించి తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున వాటికి వేల కోట్ల రూపాయల విలువైన రోడ్ల ప్రాజెక్ట్‌లను బడ్జెట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు.
అలాగే మెట్రో రైల్ విషయానికి వస్తే... కొచ్చి, బెంగుళూరు, చెన్నై, నాగపూర్‌లలో మెట్రో రైల్ కోసం వేల కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్ కావాలని అడుగుతున్నాం. కానీ దాని గురించి బడ్జెట్లో ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టు విషయంలో ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ ఊసే లేదని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రూ. 55,656 కోట్ల సవరించిన అంచనాల గురించి కూడా బడ్జెట్‌లో చెప్పలేదు. దీని మీద నెలకొన్న అస్పష్టతను తొలగించే ప్రయత్నం బడ్జెట్‌లో చేయలేదు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు.
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఖరగ్‌ఫూర్ నుంచి విజయవాడ, నాగపూర్ నుంచి విజయవాడ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కానీ దానివల్ల రాష్ట్రానికి ఒరికే ప్రయోజనం ఏమీ ఉండదు. కడప-బెంగుళూరు రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని ఇప్పటికి అనేకమార్లు అడిగాం. ఆ కేటాయింపులపై ప్రస్తావన లేదు. ఉద్యానవన పంటల రవాణా కోసం మరిన్ని కిసాన్ రైళ్లు అడిగాం. దేశం మొత్తంమీద 11.8% పండ్లు ఆంధ్రప్రదేశ్‌లోనే పండుతాయి. కాబట్టి దేశంలోని వివిధ నగరాలకు వాటిని త్వరితగతిన రవాణా చేసేందుకు ఎక్కువ కిసాన్ రైళ్లు నడపాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మొహన్ రెడ్డి కేంద్రాన్ని అడుగుతూ వచ్చారు. బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదని విజయసాయి రెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈనాటి బీజేపీ ప్రభుత్వానికి కానీ మొదటి నుంచి ఆసక్తి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. హోదా విషయాన్ని కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాలపై నెట్టివేస్తూ వచ్చిందని అన్నారు.
బడ్జెట్ విషయంలో వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్స్..
దేశవ్యాప్తంగా నాలుగు వైరాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. అందులో ఒక వైరాలజీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ సభ్యులంతా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
దేశంలో ఏడు టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. వాటిలో ఒకటి రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
విస్టాడోమ్ రైల్వే బోగీలు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం-అరకు మధ్య మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు కేంద్రం చెల్లించాల్సిన రూ.4,282 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
రాష్ట్రంలోని 13 జిల్లాలను త్వరలోనే 26 జిల్లాలుగా ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.
అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం అనేది చాలా ప్రధానమైన అంశమని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. నదులన్నింటినీ అనుసంధానం చేసిన పిమ్మట టెలీమెట్రీ పరికరాల సాయంతో ప్రతి 15 రోజులకు ఒకసారి నదులలో ప్రవాహాన్ని అంచనా వేసి ఆయా రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణత ప్రాతిపదికగా నదీ జలాలని కేటాయించాలన్నది మా ప్రభుత్వ విధానం. దాన్ని అనుసరించాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పన్నుల సంస్కరణల విషయానికి వస్తే.. ఒక లక్షరూపాయలకు స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలనేది మా డిమాండ్. దాన్ని కూడా ఈసారి బడ్జెట్‌లో పరిగణలోకి తీసుకోలేదు.
బడ్జెట్‌లో ఒకే ఒక్క ఆశాజనకమైన అంశం కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌అభివృద్ధి, పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35,000 కోట్లు ఖర్చు పెడుతోంది. అంతే తప్ప ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు.
కరోనా నేపథ్యంలో అభివృద్ధికాముక బడ్జెట్ కావాలి కానీ సర్వసాధారణ బడ్జెట్ అవసరం లేదు. అప్పు చేసి అయినా డబ్బును చెలామణిలోకి తెస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. అభివృద్ధి అనేది అప్పుడే సాధ్యమౌతుందని అన్నారు.
ఈస్ట్రన్ రైల్వే కారిడార్‌లో ఖరగ్‌పూర్ - విజయవాడ వరకు సరుకు రవాణా కారిడార్ వేశారు. దీంతో మేం సంతృప్తి పడటం లేదని అన్నారు.
బడ్జెట్‌లో విశాఖపట్నంకు ఫిషింగ్ హబ్ కేటాయించారు. కానీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దాంతో పోల్చి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక ఫిషింగ్ హార్బర్ ఏమాత్రం సరిపోదని అన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి.. పీఎం కిసాన్- రైతు భరోసా కింద ప్రతి రైతుకు సీఎం శ్రీ జగన్ గారు రూ.13,500 ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,000 మాత్రమే ఇస్తోంది. ఆ మొత్తాన్ని రూ.10,000లకు పెంచాలని విజ్ఞప్తి చేయటం జరిగింది. రాష్ట్రంలో 65% ప్రజలు వ్యవసాయ ఆధారిత పనులపై జీవిస్తున్నారు. పీఎం కిసాన్ కేటాయింపుల్లో ఏమాత్రం మార్పు లేదు. దీన్ని రూ.10,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌లో 1350 వ్యాధులు మాత్రమే కవర్ అవుతుంటే.. సీఎం శ్రీ జగన్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీలో 2,434 వ్యాధులు కవర్ అవుతాయి. దీనినిబట్టి ఆరోగ్యశ్రీ ఎంతో ఉత్తమమైనదని తెలుస్తోంది. ఆరోగ్యశ్రీలా ఆయుష్మాన్ భారత్ కూడా అన్ని వ్యాధులు కవర్ చేయాలని కోరారు.
రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దానికి సంబంధించి మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద బడ్జెట్‌లో రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. నవరత్నాల కింద 2020-21 రాష్ట్ర బడ్జెట్‌లో సామాజిక సంక్షేమం కోసం చేసిన కేటాయింపుల్లో 110% పెరుగుదల కనిపిస్తుంటే కేంద్ర బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు.
దేశంలో నిరుద్యోగ శాతం డిసెంబర్ 2020 నాటికి 38.7 మిలియన్లుగా ఉంది. గతేడాదితో (2019) పోల్చి చూస్తే 27.4 మిలియన్లుగా ఉంది. నిరుద్యోగ శాతం 11.3 మిలియన్లు పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించటానికి సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాలంటీర్లు, సెక్రటేరియట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ప్రత్యేకంగా పెట్టుకోవటం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా రాష్ట్రం ముందుకు వచ్చిందని అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని కోరుతున్నాం. కానీ బడ్జెట్‌లో దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదని చెప్పారు.
ఈ బడ్జెట్ చాలా నిరాశజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ఆశించిన స్థాయిలో ఈ బడ్జెట్‌లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారాయన.
దీనిని కేంద్ర బడ్జెట్ అని పిలిచే బదులు. వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్‌ను పరిశీలించి చూస్తే ఇది మిగతా రాష్ట్రాలకు వర్తించదేమో అన్న అనుమానం కలుగుతోందని అన్నారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సింహభాగం ఆశాజనకంగా లేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ,అరకు ఎంపీ గొడ్డేటి మాధవిలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ (ఆంధ్రప్రదేశ్ ) ప్రత్యేక హోదా తో పాటు,విశాఖ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేకరైల్వేజోన్ పై కేంద్రం నీళ్లు చల్లడం దారుణమన్నారు. దశాబ్దాల రైల్వే జోన్ ఆకాంక్షపై కేంద్రం ఎప్పటికప్పుడు పక్షపాత ధోరణిని అవలంబించడం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగానే భావిస్తున్నామన్నారు. ఓవైపు ఆంధ్రులు, మరోవైపు విశాఖ ప్రజల ఆశలకు కేంద్రంలోని బీజేపి బడ్జెట్ గండికొట్టిందన్నారు. ఆయా అంశాల పురోగతిపై తాము పలుమార్లు కేంద్ర మంత్రులు , రైల్వే బోర్డు ఛైర్మెన్ ని కలిసి ఈ విషయాలను ప్రస్తావించినా, జోన్ పై ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఇదే విషయంపై ఇతర ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ ఎంపీ లతో కలిసి పార్లమెంట్ లో తమదైన శైలిలో గళం విప్పుతామన్నారు. ఈ క్రమంలో దేశంలో పేరెన్నిగన్న కొచ్చి ,పారాదీప్ ,చెన్నై ,పెట్యూ వా ఘాట్ తో పాటు అత్యాధునిక అభివృద్ధి చెందుతున్న హార్బర్ల సరసన విశాఖను చేర్చడం ఊరట కలిగించే అంశమన్నారు. విశాఖ హార్బర్ అభివృద్ధి, దాని శక్తి సామర్ధ్యాలపై తాము పలు దఫాలుగా ఆయా కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర విభజన డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.. ఈ క్రమంలో ప్రకటన వెలువడం సంతోషకరమన్నారు .
కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం ఫిబ్రవరి 11న తిరుమలలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడున్న శ్రీ పద్మావతి పరిణయ మండపంలో శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు శ్రీ పురందరదాస కీర్తనలను బృందగానం చేస్తారు. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేస్తుంది.
ఒక్క రోజు పర్యటనలో భాగంగా గౌరవ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 7న చిత్తూరు జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యత లు) డి. మార్కండేయులు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 7న గౌరవ భారత రాష్ట్రపతి మదనపల్లె ,సదుం మండలాల్లో పర్యటించ నున్నారని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గౌరవ రాష్ట్రపతి 7వ తేదీ ఆదివారం మ. 12.10 గం.లకు వైమానిక దళ హెలికాప్టర్ ద్వారా మదనపల్లె చేరుకుంటారని తెలిపారు. అనంతరం మ.12.30 గం.లకు ఆశ్రమం చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం సా. 3.20 గం.లకు అక్కడి నుండి బయలుదేరి సా. 3.40 గం. లకు సదుంలోని పీపల్ గ్రూవ్ స్కూల్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ చేరుకుని స్కూల్ లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉపాద్యాయులు మరియు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం సా. 4.50 గం. లకు సదుం నుండి వైమానిక దళ హెలికాప్టర్ ద్వారా బెంగళూరు బయలుదేరి వెళతారని, అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) ఆ ప్రకటన లో తెలిపారు.