వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టిటిడి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుధేంద్రతీర్థ స్వామి చెప్పారు. శ్రీశ్రీశ్రీ సుబుధేంద్రతీర్థ స్వామి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామీజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల శ్రీశ్రీశ్రీ సుబుధేంద్రతీర్థ స్వామి మీడియాతో మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మధ్వాచార్య సంప్రదాయంలో ప్రధాన మూల మఠంగా ఆరాధింపబడుతోందన్నారు. 45వ మఠాధిపతిగా తాను కొనసాగుతున్నానని చెప్పారు.
శ్రీ రాఘవేంద్రస్వామివారికి కులదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారని, ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నామని తెలిపారు. తమ మఠానికి చాలా కాలం నుండి తిరుమలలో ఇస్తికఫాల్ స్వాగతం లభిస్తోందని, ఇది ఎంతో సంతోషకరమని చెప్పారు. శ్రీవారి కృపతో త్వరగా కరోనా వ్యాధి నశించిపోయి భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామీజీ ఆకాంక్షించారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరుగుతున్న అఖండ వేదపారాయణంలో శ్రీశ్రీశ్రీ సుబుధేంద్రతీర్థ స్వామివారు పాల్గొన్నారు.
ఏప్రిల్ 13 నుండి అఖండ వేదపారాయణం జరుగుతోంది. ఇప్పటివరకు కృష్ణయజుర్వేద పారాయణం, జఠా పారాయణం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఋగ్వేద పారాయణం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఓఎస్‌డి పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
తిరుమల గిరుల్లోని ఆంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మ క్షేత్రమని పురాణాలు ముక్త కంఠంతో చేబుతున్నాయని పలువురు పండితులు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి వివరించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి ఆధారాలతో నిరూపించాలని ఈవో పండితులను కోరారు. టిటిడి పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన పండితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కొన్ని దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేరువేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పౌరాణిక, చారిత్రక, ఆచార వ్యవహార దృష్ఠితో ఆంజనేయస్వామివారు తిరుమలలో జన్మించారని పరిశోధించి నిరూపించడానికి పండితులతో ఒక కమిటి ఏర్పాటు చేశారు.
పురాణాల ఆధారంగా తిరుమల ఆంజనేయస్వామివారి జన్మ స్థలమని సమావేశంలో పాల్గొన్న పండితులు ఈవో దృష్ఠికి తీసుకువచ్చారు. ఆధునిక కాలంలో శ్రీవారి భక్తులందరికి ఆంజనాద్రిపై మరింత భక్తి విశ్వాసాలు ఏర్పడాలని ఈవో సూచించారు. ఆంజనేయస్వామివారి జన్మస్థలం తిరుమల అని నిరూపించడానికి తగిన సమాచారం సిద్ధం చేయవలసిందిగా ఆయన పండితులను కోరారు. స్కంధ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం, వెంకటాచల మహాత్యం మొదలైన పురాణాల్లో ఉన్న శ్లోకాలను పండితులు సమావేశంలో ప్రస్తావించారు. త్వరిత గతిన ఈ అంశాన్ని ఆధారాలతో సహా పరిష్కరించే ప్రయత్నం చేయాలని ఈవో అదనపు ఈవోకు సూచించారు. ఈ సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు జె.రామక్రిష్ణ, శంకరనారాయణ, ఎస్వీ వేద ఆధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ పాల్గొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ద్వైత సంస్థానంగా పేరుగాంచిన వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వ్యాసరాజ మఠానికి 41వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ కొనసాగుతున్నారు. 8 శతాబ్దాలకు పైగా చరిత్ర గల ఈ మఠం వ్యవస్థాపకులు శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదులవారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు గోవిందహరి, డి.పి.ఆనంత, శ్రీవారి డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఒఎస్‌డి పాల శేషాద్రి, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2021, జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.
ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం..
కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు.
ఆండాళ్ తిరుప్పావై పారాయణం..
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
ధనుర్మాస వ్రతం ...
శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు. పాపకర్మలను నశింపచేసి మోక్షసాధనకోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.
గో సంరక్షణ కోసం టీటీడీ ప్రతిష్టాత్మకంగా అమలు చేయదలచిన గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదివారం సాయంత్రం బెంగుళూరు లో ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఆవు, దూడ అందించి కర్ణాటక రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించిందని చెప్పారు. దేశంలోని మఠాలు, పీఠాలు, వేద పాఠశాలలకు కూడా గోవులను అందిస్తామన్నారు. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అన్నారు. గోవును రక్షిస్తే హిందూధర్మాన్ని రక్షించినట్లేనన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించామని, త్వరలో తమిళనాడు లో కూడా ప్రారంభిస్తామని చెప్పారు.
చైర్మన్ పిలుపుతో 216 గోవుల దానానికి ముందుకొచ్చిన దాతలు
గుడికో గోమాత కార్యక్రమం అమలు కోసం దాతలు ముందుకొచ్చి గోవులను దానం ఇవ్వాలని సభలో చైర్మన్ సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. టీటీడీ కి చెందిన ఎస్వీ గోసంరక్షణ శాలకు గోవులను అప్పగించాలని కోరారు. చైర్మన్ పిలుపునకు స్పందించి పలువురు టీటీడీ స్థానిక సలహామండలి సభ్యులు, ఇతర ప్రముఖులు 216 గోవులను దానం చేయడానికి ముందుకొచ్చారు.
యతిరాజ మఠం గురూజీ శ్రీశ్రీశ్రీ నారాయణ యతిరాజ రామానుజ స్వామి, స్థానిక సలహా మండలి సభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కుపేంద్ర రెడ్డి, స్థానిక సలహా మండలి సభ్యులు మురళి కృష్ణ, భక్తవత్సల రెడ్డి, కృష్ణా రెడ్డి, గీతారాం, భాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జగన్నాథ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటకలో గోమాత కోసం దరఖాస్తు చేసిన ఆలయాలను సందర్శించి, గోమాతను వారు సంరక్షించుకోగలరో లేదో అని తనిఖీ చేయడానికి కుపేంద్ర రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించబోతున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించామని, అలాగే తిరుపతి, విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించామని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ బాలాత్రిపురసుందరి ఆలయానికి శనివారం ఆవు, దూడను అందించి గుడికో గోమాత కార్యక్రమాన్ని వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవును పూజిస్తే తల్లిని, ముక్కోటి దేవతలను పూజించినట్లేనని, అందుకే టిటిడి గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు. దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉందన్నారు.
దేశంలోని ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు ముందుకొస్తే టిటిడి గోవును అందిస్తుందని, వాటి రక్షణ, పోషణ మాత్రం వారే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో కర్ణాటక, తమిళనాడులో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హిందూ ధర్మప్రచారంలో భాగంగా గిరిజన, దళిత, బలహీన, మత్స్యకారుల కాలనీల్లో హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా 500 ఆలయాలు నిర్మించడానికి టిటిడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. టిటిడి సామాన్య ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా నుంచి ప్రపంచ ప్రజలను కాపాడాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వామివారి దర్శనం చేయిస్తున్నామని ఛైర్మన్ వివరించారు. ఈసారి 26 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించి డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల ఆలయ వైకుంఠ ద్వారం తెరిచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే, భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందుగా టికెట్ బుక్ చేసుకుని తిరుమలకు రావాలని, ఆన్‌లైన్‌లో టికెట్లు లభించని వారు తిరుపతిలో ముందుగా దర్శనం టికెట్లు పొందాలని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. టిటిడి వెబ్‌సైట్ ద్వారా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం లక్షలాది మంది ఆన్‌లైన్‌లో ఒకేసారి ప్రయత్నించడంతో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయన్నారు. టిటిడి ఐటి విభాగం ఈ సమస్యను పరిష్కరించిందన్నారు. కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయాక సమాచార కేంద్రాలను తిరిగి భక్తులకు అందుబాటులోకి తెచ్చి దర్శనం టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
రాష్ట్ర మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, ఎంపి వంగా గీత, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాపాక వరప్రసాద్, పెండెం దొరబాబు, మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెదపాటి అమ్మాజి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ బందన హరి, బాలాత్రిపురసుందరి ఆలయ ఛైర్మన్ పెద్ది రత్నాజి పాల్గొన్నారు.