తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకీపై మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకీలపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చారు. దివ్యప్రబంధ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగారు పూలచెండ్లతో వేటకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నింద - స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు, పార్ పత్తేదార్ ఉమామహేశ్వరరెడ్డి, ఎవిఎస్వో గంగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం నగరంలో దాదాపు రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ శంకుస్ధాపన కార్యక్రమానికి కేంద్రమంత్రి గాంగ్వార్ వచ్చేనెల రెండవ వారంలో వస్తున్నారని ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు. ఈమేరకు ఢిల్లీలో స్వయంగా మంత్రిని కలిసి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించినట్టు చెప్పారు. ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణంతో పాటు 32 మంది సిబ్బంది నివసించడానికి వీలుగా క్వార్టర్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్టు చెప్పారు. సుమారు మూడున్నర ఎకరాల సువిశాల స్ధలంలో నిర్మించే ఈ ఆసుపత్రికి అవసరమైన నిధుల మంజూరు జరిగిందని వివరించారు. ఇదే విషయం మంత్రికి అందజేసిన లేఖలో ఎంపీ పేర్కొన్నారు. అంతేకాకుండా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారికి సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ పరిధిలో కూడా పలు క్వారీలు పరిశ్రమలు ఉండటం, పట్టణ గ్రామీణ ప్రజలు, కార్మికులు అధికశాతం ఉన్నందున అటు ఏలూరు కాకుంటే ఇటు రాజమహేంద్రి కి రావాల్సిన క్లిష్టపరిస్ధితి ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరినట్టు ఎంపీ మీడియాకి చెప్పారు. తాను చేసిన ప్రతిపాదనకు మంత్రి అంగీకరించినట్టు వివరించారు.
భక్తుల సౌకర్యార్థం జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు రూ.300/-ల తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 30న బుధవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. జనవరి 3వ తేదీ వరకు ఇదివరకే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయడం జరిగింది. ఈ కారణంగా జనవరి 4 నుంచి నెలాఖరు వరకు టిటిడి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుధవారం విడుదల చేయనుంది.
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి 3వ తేదీన 8వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న 195 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతుంది.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం డిసెంబరు 30వ తేదీ బుధవారం తిరుమలలో జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూలబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా బుధవారం పౌర్ణమి సందర్భంగా జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది.
కేందప్రభుత్వ గృహనిర్మాణ,పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పి.ఎం.ఏ.వై. – 2019 పధకాన్ని చక్కగా రాష్ట్రంలో చేపట్టినందుకు విశాఖపట్నాన్ని అత్యత్తమ మున్సిపల్ కార్పోరేషన్ నిర్వాహణా కేటగిరీల క్రింద అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గృహ నిర్మాణ పధకంలో ఆచరిస్తున్న అధునాత్మక పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిర్మాణాలు చేపడుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడు కేటగిరీలలో అవార్డులు, ప్రాజెక్టు మోనిటరింగ్ టూల్స్, ఇన్నోవేటివ్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ, ప్రత్యేకంగా బహుకరించింది. కేంద్ర ప్రభుత్వంలోని హౌసింగ్, పట్టణ వ్యవరాహాల శాఖ – 2019 “కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా” సమావేశంలో గౌరవ ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయం మేరకు దేశంలో గృహ నిర్మాణ రంగంలో అత్యత్తమ ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించడం మొదలగు ఉత్తమ ప్రమాణాలను పాటించే రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలలోని పట్టణ స్థానిక సంస్థలు, ఉత్తమ లబ్ధిదార్లకు అవార్డుల ప్రధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం మూడవ బెస్ట్ పెర్ఫార్మన్స్ క్రింద ర్యాంకు సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటిస్తూ ఈ అవార్డును గౌరవ ప్రధానమంత్రి చేతులు మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించే ఏర్పాటు చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించిన మూడు కేటగిరీలలో అవార్డుతో పాటు ఉత్తమ గృహ నిర్మాణ పధకం చేపట్టినందుకు నగరానికి చెందిన “సాత్రబోయిన దుర్గకు” ఉత్తమ లబ్దిదారునిగా సత్కరించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారులు తెలిపారు. ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమం తేది 01-01-202న వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం సూచించే అధికారులకు / ప్రతినిధులకుగాని అందిస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక విభాగమైన హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డులో రాష్ట్ర ప్రభుత్వం తో పాటు విశాఖపట్నాన్ని గుర్తింఛి నందుకుగాను జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా నగర పౌరులు క్రమశిక్షణతో చేయూత అందించడమే కారణమని, ఈ అవార్డు నగర పౌరులకు ముఖ్యంగా నిబద్దత కలిగిన లబ్దిదారులకు చెందుతుందని పేర్కొన్నారు. కార్పోరేషన్ పరిధిలో సాంకేతిక పరిజ్ఞానంతో పేదలకు గృహ నిర్మాణాలను చేపట్టేందుకు గాను తగు తోడ్పాటు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి , మున్సిపల్ శాఖా మంత్రి, రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, టిడ్కో అధికారులు సంబందిత జివిఎంసి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్పూర్తితో పనిచేస్తూ, నగరంలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయడానికి గాను తమవంతు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు.