ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను మోదీ ఆవిష్కరించారు. వీటి వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో దేశంలోని పాతరికార్డులన్నీ చెరిగిపోయాయన్నారు. రైతులకు కనీస మద్ధతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇది ఆహార భద్రతకు ఎంతో అవసరమని మోదీ వెల్లడించారు. సరైన వసతులు లేనందువల్ల ఆహారధాన్యాలను నిల్వ చేసుకోవడం సమస్యగా మారుతోందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు మరింత లబ్ధిపొందుతారని ప్రధాని మోదీ అన్నారు. ఈఏడాది నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమానికి ప్రకటించడాన్ని మోదీ ఆహ్వానించారు. అందులో భారత్ కూడా భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మరోవైపు పెళ్లి వయస్సు ఎంత ఉండాలన్న దానిపై తనకు లేఖలు వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
కేరళలో కొన్నాళ్లపాటు తగ్గిన కరోనా ఉద్ధృతి తాజాగా మరోసారి పెరుగుతోంది. దేశంలోనే తొలిసారి ఇక్కడ వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను కట్టుదిట్టం చేయడంతో కేసులు గణనీయంగా తగ్గాయి. అయితే తాజాగా గడిచిన కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మరోవైపు ప్రఖ్యాత శబరిమల యాత్ర కూడా దగ్గర పడుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు యాత్రకు రానున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురిస్తూ అందరికీ తెలియజేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా కోరారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మార్గదర్శకాలివే..!
* భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం https://sabarimalaonline.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
* వారం ప్రారంభంలో రోజుకు 1000 మంది, వారాంతాల్లో రోజుకు 2000 మంది చొప్పున పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునే వీలు కల్పించారు. పరిస్థితులను మార్పులు చేస్తారు.
* దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగటివ్ వచ్చిన వారినే అనుమతిస్తారు. ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు.
* పది సంవత్సరాలలోపు వారికి, 60-65 సంవత్సరాలు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదు.
* శబరిమల యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్ భారత్, బీపీఎల్ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది.
* స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బసచేయడం వంటివాటిని అనుమతించరు.
* కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. మిగతా అన్ని రూట్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు.