శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు బుధవారం ఒక కోటి రూపాయలు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన కామాక్షి శంకర్ ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలో టిటిడి అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ధర్మప్రచారంలో భాగంగా టిటిడి చేపడుతున్న సుందరకాండ, వేదపారాయణం, భగవద్గీత, విరాటపర్వ పారాయణం చాలా బాగున్నాయని ఈ సందర్భంగా దాత అభినందించారు. స్వామివారి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజలకు టిటిడి ఎస్వీబీసీ ద్వారా అన్ని భాషల్లో చేరేందుకు చర్యలు తీసుకోవాలి దాతలు కోరారు. స్వామివారికి జరిగే అన్ని సేవలు సమస్త ప్రజలకు తెలియాలని, ఆ స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపైనా ఉండాలన్న వారు ఎస్వీబీసీ ద్వారా ఎందరో శ్రీవారి భక్తులు స్వామికోసం తెలుసుకోవడానికి వీలుపడుతుందన్నారు. అన్ని బాషల్లో ప్రసారాలు చేయడం ద్వారా దేశంలోని అన్ని వర్గాలకు స్వామి చేరువ అవుతారని అన్నారు. అనంతరం దాత శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వసంతమండపంలో జరుగుతున్న షోడషదిన సుందరకాండ పారాయణ దీక్షలో పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీవారికి ప్రతినెలా జరిగే పౌర్ణమి గరుడసేవ అక్టోబరు 1న గురువారం సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య జరుగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా, అక్టోబరు నెలలో శ్రీ మలయప్పస్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరుగనుంది. పౌర్ణమి సందర్భంగా నెల ప్రారంభంలో అక్టోబరు 1న, చివరిరోజైన అక్టోబరు 31న, అదేవిధంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నుద్రుష్టిలో ఉంచుకొని ముఖ్యమైన అర్చకులు ఆలయంలోని ప్రధాన శాఖ అధికారులు తప్పా,మరెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతించలేదు. పైగా కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ముందస్తు చర్యలు తీసుకుంటూనే స్వామివారికి నిర్వహించే ఉత్సవాలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. కార్యక్రమాలన్నీ ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది..
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఎరువుల శాఖ కింద ఉండే మధ్యప్రదేశ్ లోని రాఘోగడ్ కి చెందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటిఐ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యం పెంచి భారీ పరిశ్రమలలోను, ప్రాసెసింగ్ యూనిట్లలోను ఉద్యోగావకాశాలను అందుకోగలిగేలా ఉద్యోగ సామర్థ్యం పెంచటానికి శిక్షణ ఇవ్వటం ఈ ఒప్పంద లక్ష్యం. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ లాంటి వృత్తి విభాగాలలో యువతకు శిక్షణ ఇవ్వటానికి ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా యువతకు రెండు రకాల శిక్షణనిస్తారు. ఆరు నెలలపాటు ఐటిఐ లో థియరీ నేర్చుకోవటంతో బాటు ఎన్ ఎఫ్ ఎల్ విజయ్ పూర్ యూనిట్ లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. మొత్తంగా శిక్షణ మొత్తం ఐటిఐ సిలబస్ ప్రకారం సాగుతుంది. అయితే అందులో భాగంగా ఆరు నెలలపాటు పరిశ్రమలో పనిచేసిన అనుభవం పొందుతారు. ఎన్ ఎఫ్ ఎల్ యూనిట్ ఈ అవకాశం కల్పిస్తుంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కు అమ్మోనియా ఆధారిత యూరియా తయారీ యూనిట్లు ఐదు ఉన్నాయి. వాటిలో పంజాబ్ లో నంగల్, బఠిండా లలోను, హర్యానాలో పానిపట్ లోను, మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా విజయ్ పూర్ లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఎన్ ఎఫ్ ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ జగదీప్ షా సింగ్ సమక్షంలో ఎన్ ఎఫ్ ఎల్ విజయ్ పూర్ యూనిట్ చీఫ్ మేనేజర్ (హెచ్ ఆర్) నరేందర్ సింగ్, రాఘోగడ్ ఐఐటి ప్రిన్సిపాల్ జెపి కోలి ఈ ఒప్పందం సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. స్కిల్ ఇండియాకు ఊతమిచ్చేందుకు చుట్టుప్రక్కల ఉన్న మరిన్ని సంస్థలకు చెందిన యువతతో ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని కంపెనీ భావిస్తోంది.
మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ తాత్వికత అయిన ఆరోగ్య స్వావలంబన ద్వారా సంపూర్ణ స్వావలంబన సంధించడం అనే అంశం పై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పూణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాచురోపతి (ఎన్ఐఎన్) వరుస వెబినార్లను నిర్వహించనుంది. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వెబినారు్ల నవంబర్ 18, నేచురోపతి డే వరకు సాగుతాయి. మనందరికీ సులభంగా అందుబాటులో ఉన్న సరళమైన సహజ (ప్రకృతి) పద్ధతులను అవలంబించడం దా్వరా ప్రజలు తమ ఆరోగ్యానికి తామే బాధ్యత తీసుకోవచ్చనే సందేశాన్ని ఈ వెబినార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాయని కేంద్ర ఆయుష్ విభాగం పేర్కొంది. ప్రకృతి వైద్య పద్ధతులనుతారి్కకంగా నిరూపించడం ద్వారా ప్రజలలో ప్రకృతి వైద్యం పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. లైవ్ చాట్ల ద్వారా, ఆ వృత్తిని అవలంబిస్తున్న వారితో చర్చల ద్వారా ఫీడ్ బ్యాక్ తో సెషన్లను బలోపేతం చేయనున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమై 48 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమం రోజుకు ఒక గంటపాటు, అది కూడా భారతీయ కాలమానం (ఐఎస్‌టి) ప్రకారం నిర్ధిష్ట సమయంలో జరుగుతుంది. నవంబర్ 18న నేచురోపతీ దినోత్సవం సందర్భంగా వర్చువల్ వెబినార్లు ముగియన నున్నాయి. ఇదే రోజున మహాత్మా గాంధీ ఆలిండియా నేచర్ క్యూర్ ఫౌండెషన్ ట్రస్టుకు జీవితకాల చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుని, అన్ని వర్గాల ప్రజలకు ప్రకృతి వైద్య ఉపయోగాలను, లాభాలను అందించే లక్ష్యంతో ఒక ఒప్పందంపైఔ సంతకం చేశారు. వెబినార్లతో పాటుగా కాలేజీ, పాఠశాల విద్యార్దులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు, సాధారణ ప్రజలకు సోషల్ మీడియాలో పోటీలు నిర్వహించనున్నారు. అలాగే అంతర్జాతీయ గాంధేయ సంస్థలైన మహాత్మా గాంధీ కెనెడియన్ ఫౌండేషన్ ఫర్ వరల్్డ పీస్, జర్మనీకి చెందిన గాంధీ ఇన్ఫర్మేషన్ సెంటర్, మహాత్మా గాంధీ సెంటర్ ఫర్ గ్లోబల్ నాన్ వయొలెన్్స వర్జీనియా, యుఎస్ఎ, యుటిఎస్, సిడ్నీ, ఆస్ర్టేలియాకు చెందిన ప్రముఖ వక్తలు కూడా ఇందులో పాల్గొననున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీలో శీతాకాలపు నెలల్లో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. వాయు కాలుష్యం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పౌరులు కలసికట్టుగా కృషి చేయవలసి ఉంటుందన్నారు. మంగళవారం ఈమేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వాయు కాలుష్యంపై ఢిల్లీతోపాటు, దాని పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పర్యావరణ శాఖా మంత్రుల వర్చువల్ సమావేశం అక్టోబరు 1న నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే మొదట సదరు సమస్యను గుర్తించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో గాలి నాణ్యతా సూచికను ప్రారంభించారని చెప్పారు. వాయుకాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, కాలుష్యాన్ని నియంత్రణకు విధానపరమైన చర్యలు తీసుకునేలా తగిన సూచనలు చేయడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. న్యూఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యానికి వాతావరణ సంబంధమైన కారణాలున్నాయని మంత్రి వివరించారు. గాలి, వాయు ప్రసరణ సరిగా లేకపోవడమే ఢిల్లీలో గాలి నాణ్యతను దెబ్బతీస్తోందన్న మంత్రి శీతాకాలాల్లో చలిగాలి, పొడిగాలులు, మైదానం ఉపరితలంపై మంద్రస్థాయి గాలుల కారణంగా ఢిల్లీ నగరంలో గాలి స్తబ్దుగా ఉండిపోతోందన్నారు. శీతాకాలాల్లో దేశం ఉత్తరాది నుంచి, వాయవ్య దిశనుంచి తూర్పు దిశగా వీచే గాలులు చివరకు తీవ్రమైన కాలుష్యానికి, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. వాయుకాలుష్యం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తీసుకున్న చర్యలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. బందార్ పూర్ విద్యుత్ ప్లాంట్.ను మూసివేయడం, సోనీపట్ విద్యుత్ ప్లాంట్.ను దశలవారీగా నిలిపివేయడం, తక్కువ కాలుష్యం వెదజల్లే బి.ఎస్.-VI వాహనాలను ప్రవేశపెట్టడం, ఇంధన ప్రమాణాలను నిర్దేశించడం, ఢిల్లీ చుట్టూ ఎక్స్.ప్రెస్.వే రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం, విద్యుత్ వాహనాలకు సబ్సిడీ సదుపాయం కల్పించడం తదితర చర్యలను ప్రభుత్వం తీసుకున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు.
లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ షోడశదిన సుందరకాండ దీక్షను ప్రారంభించామని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని వసంత మండపంలో మంగళవారం ప్రారంభమైన ఈ దీక్ష అక్టోబరు 14వ తేదీ వరకు జరుగనుంది. షోడషాక్షరి మహామంత్రం ప్రకారం మొదటి రోజు రా అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం సుందరకాండలోని మొదటి సర్గలో 211, రెండో సర్గలో 58 కలిపి మొత్తం 269 శ్లోకాలను పారాయణం చేశారు. మొదట సంకల్పంతో ప్రారంభించి శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆ తరువాత 16 మంది ఉపాసకులు శ్లోక పారాయణం చేశారు. బుధవారం నాడు మూడో సర్గ నుండి ఆరో సర్గ వరకు మొత్తం 152 శ్లోకాలను పారాయణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః అనే మహామంత్రం ప్రకారం సీతాసమేతుడైన శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తే సంకల్పసిద్ధి చేకూరుతుందని, ఈతిబాధలు తొలగుతాయని తెలిపారు. ఈ మహామంత్రంలో 16 అక్షరాలు ఉన్నాయని, ఈ అక్షరాలకు ఉన్న బీజాక్షరాలను కూడితే ఆ సoఖ్య 68 అవుతుందన్నారు. సుందరకాండలో మొత్తం 68 సర్గలు ఉన్నాయని వివరించారు. వీటిలోని 2,821 శ్లోకాలను 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేస్తారని తెలియజేశారు. ఉపాసకులు ఒకపూట మాత్రమే భోజనం, బ్రహ్మచర్యం, నేలపై విశ్రమించడం లాంటి నియమాలను పాటిస్తారని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఒక గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. పారాయణం శ్లోకాలను ఎస్వీబీసీలో స్క్రోలింగ్ ఇస్తున్నామని, www.svbcttd.com వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని భక్తులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. శ్లోకాలను పలకలేని వారు ఏకాగ్రతతో విన్నా సమానమైన ఫలితం లభిస్తుందన్నారు. భక్తులందరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొని సంకల్పసిద్ధి పొందాలని కోరారు. ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయస్వామివారి అనుగ్రహంతో ప్రపంచంలోని మానవులు ధర్మాని ఆచరిస్తూ, సకల శుభాలను పొందాలని ఆకాంక్షిస్తూ షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని టిటిడి నిర్వహిస్తోందన్నారు. వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, డెప్యూటీ ఈవో(ఆర్1)బాలాజి, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్ఆర్.రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, అన్నప్రసాదం ఏఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.