1 ENS Live Breaking News

2020-09-18 19:59:37

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ..

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కన్యా మాసం హస్త నక్షత్రంలో శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం తరువాతే.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. అంకురార్పణ క్రమం.. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.   అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.          ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.          ఈ కార్యక్రమంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-09-18 19:54:35

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 ల‌క్ష‌లు విరాళం..

హైద‌రాబాద్‌కు చెందిన రసున్ ఎక్స్‌‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్ర‌వారం ఉద‌యం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమ లలోని ఛైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డికి  సంస్థ ఎండి  కె.ర‌వీంద్రా‌రెడ్డి, కుమారుడు కె.సిద్ధార్ధ‌రెడ్డిలు విరాళం డిడిని అంద‌జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామివారికి సేవచేయాలనుకుని ఈ విరాళాన్ని అందించినట్టు పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్న దాతలు,  ఎస్వీ ప్రాణదాన ట్రస్టు సేవాలు భక్తులకు మరింతగా దగ్గర చేయాలని కోరారు. దాతల సూచనలు స్వీకరించి భక్తులకు పూర్తిస్థాయిలో సేవలు చేయడంతో ట్రస్టు ముందుంటుందని వారికి తెలియజేశారు.

Tirumala

2020-09-18 19:41:19

ఏయూకు ప్రతిష్టాత్మక ఐపిఆర్‌ ‌చెయిర్‌ ‌మంజూరు..

ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన మేధోహక్కుల పరిరక్షణ చెయిర్‌(ఐపిఆర్‌ ‌చెయిర్‌) ‌మంజూరయినట్లు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలి పారు. శుక్రవారం ఆయన ఏయూలో మీడియాతో మాట్లాడుతూ,  కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, అతర్జాతీయ వాణిజ్య (డిపిఐఐటి) మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను ఏయూకు పంపింది. ఏడేళ్ల కాల పరిమితితో ఇది ఏయూలో ఏర్పాటు అవుతోంది. ఇప్పటి వరకు ఐపిఆర్‌ ‌చెయిర్‌ను జాతీయ సాంకేతిక విద్యా సంస్థలు(ఐఐటి), ఐఐఎంలు కలిగి ఉన్నాయి. రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కేంద్రం ఏయూకు మంజూరైంది. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, అంతర్జాతీయ వాణిజ్య మంత్రిత్వ శాఖ హోలిస్టిక్‌ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ అకడమియా(ఎస్‌పిఆర్‌ఐహెచ్‌ఏ) ‌పథకంలో భాగంగా ఏయూకు ఐపిఆర్‌ ‌చెయిర్‌ను మంజూరు చేసింది. దీనికి అవసరమైన నిధులను సైతం కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ అందిస్తుంది. ఈ కేంద్రంలో ఒక ఆచార్యునితో పాటు ఇద్దరు రీసెర్చ్ అసిస్టెంట్లు, ఒక రీసెర్చ్ ‌స్కాలర్‌ను నియమించుకునే అవకాశం కలుగుతుంది. మేధోహక్కుల పరిరక్షణ, ఆవిష్కరణలు, పేటెంట్‌లు పొందడం వంటి అంశాలపై ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐపిఆర్‌ ‌చెయిర్‌ ‌మంజూరు కావడం పట్ల వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌, ఎం‌పీ వి.విజయ సాయి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక కేంద్రాలను ఏయూలో ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామన్నారు. జాతీయ స్థాయిలో నిపుణులతో కూడిన ముగ్గురు సభ్యుల బృదం త్వరలో ఐపిఆర్‌ ‌చెయిర్‌కు సంబంధించిన నియామకాలు జరుపుతుందన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఏయూవెబ్‌సైట్‌లో పొందు పరచడం జరుగుతోందన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-09-18 19:28:26

సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి 100 రోజులు..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లను కోవిడ్ బారి నుండి కాపాడి మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వహిస్తున్న సుంద‌ర‌కాండ పారాయణం శుక్ర‌వారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంది.  విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుంచి ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. టిటిడి ప్రచురించిన సుందరకాండ పారాయణం పుస్తకంలో మొత్తం  68 సర్గలు 2821 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో  సుంద‌ర‌కాండ పారాయ‌ణం 100వ రోజు 15వ స‌ర్గ పూర్తి చేసుకుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ప‌ర్యా‌యాలు టిటిడి అఖండ పారాయ‌ణం నిర్వ‌హించింది. ఇందులో ప్ర‌థ‌మ స‌ర్గ నుండి 14వ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 716 శ్లోకాల‌ను ప్ర‌ముఖ వేద పండితులు అఖండ పారాయ‌ణం చేశారు. ఇందులోని శ్లోకాల‌ను భ‌క్తుల‌తో ప‌లికించి అర్థ‌ తాత్ప‌ర్యాల‌తో పాటు ఆ శ్లోక ఉచ్చా‌‌ర‌ణ వ‌ల‌న క‌లిగే ఫ‌లితం, నేటి ఆధునిక స‌మాజంలోని మాన‌వాళికి ఏవిధ‌‌మైన సందేశం ఇస్తుందో వివ‌రిస్తూ నిరంత‌రాయంగా పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు.           మొదటగా "యోగ‌వాశిస్టం - శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం" పారాయ‌ణాన్ని ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభమైన విష‌యం విదిత‌మే. ఎస్వీబీసీలో ఉద‌యం 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ విదేశాల్లోని భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో అనుస‌రించి త‌మ ఇళ్లలో పారాయ‌ణం చేస్తున్నారు.

Tirumala

2020-09-18 18:43:57

2020-09-18 13:27:22

శ్రీవారిని దర్శించుకున్న త‌మిళ‌నాడు గవర్నర్..

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితుల‌లో టిటిడి యాజ‌మాన్యం కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు చేసిన ద‌ర్శ‌న ఏర్పాట్ల‌ను త‌మిళ‌నాడు గవర్నర్‌ బన్వారిలాల్ పురోహిత్‌ కొనియాడారు. తిరుమల శ్రీవారిని శుక్ర‌‌వారం ఉద‌యం బ్రేక్ ద‌ర్శ‌నంలో త‌మిళ‌నాడు గవర్నర్‌ దర్శించుకున్నారు.  అనంత‌రం అద్ధాల‌ మండపంలో  వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అద‌న‌పు ఈవో తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్ర‌తి మ‌నిషికి జీవితంలో మ‌హ‌త్త‌రమైన రోజు ఉంటుంద‌ని, ఈ రోజు త‌న జీవితంలో మ‌ర‌పురాని రోజ‌న్నారు. తాను దేశ వ్యా‌ప్తంగా అనేక ఆల‌యాల‌ను సందర్శించానని, అయితే ప్రతిరోజూ వేలాది మంది భ‌క్తులు తిరుమలను సందర్శించినప్పటికీ  ఇక్క‌డ అనుసరిస్తున్న పరిశుభ్రత,  పర్యావరణం చక్కగా ఉన్నాయని ఇందుకోసం కృషి చేస్తున్న టిటిడి అధికారులు, సిబ్బంది నిబద్ధత మరియు అంకితభావాన్ని కొనియాడారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు "భ‌క్తులకు భౌతిక దూరం మరియు ఇతర నిబంధనలతో దర్శనం, నిర్వహణ  చాలా బాగా అమలు చేయబడుతుంది" అని ఆయన అభినందించారు. నాద‌నీరాజ‌నం వేధిక‌పై సుందరకాండ పఠనంలో పాల్గొన్న ఆయన త‌న అనుభూతిని తెలుపుతూ  "నేను హనుమంతుని భక్తుడ‌ను, ప్రతిరోజూ హనుమాన్ చలీసాను పఠిస్తాము, సుందరకాండను కూడా చాలా సందర్భాలలో పఠించిన‌ట్లు తెలిపారు. మన హిందూ సనాతన ధర్మం, భార‌త‌దేశ సంస్కృతిని అద్భుతంగా భ‌క్తుల‌కు చేర‌వేస్తున్న సుంద‌ర‌కాండ పఠ‌నం 100వ‌ రోజు పాల్గొనడం ఒక విశేషంగా భావిస్తున్నామన్నారు. కోవిడ్ సంక్షోభ‌ సమయంలో లోక క‌ల్యాణార్థం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలను చేపట్టి, నిర్వ‌హిస్తున్న‌టిటిడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను"అని ఆయ‌న అన్నారు.‌  ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవోబాలాజి పాల్గొన్నారు.

Tirumala

2020-09-18 13:26:23

సీఎం వైఎస్ జగన్ కు టిటిడి బ్రహ్మోత్సవ ఆహ్వానం

తిరుమలలో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజ‌రు కావాల‌ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వై.వి.సుబ్బారెడ్డి, ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం సాయంత్రం తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో వీరు ముఖ్య‌మంత్రిని క‌లిశారు. ప్రతీఏటా స్వామివారికి జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పి స్తారు. అదేవిధంగా ఆనవాయితీగా ముఖ్యమంత్రిని టిటిడి ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. అందులోభాగంగనే టిటిడి చైర్మన్ తోపాటు, ఈఓ, అదనపు ఈఓలు సీఎంని వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఆరోజు సీఎం రాకకోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా టిటిడి చేపట్టింది. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Tadepalle

2020-09-17 21:16:48

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భచాప, తాడు సిద్ధం..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా నిర్వహించే ధ్వజారోహణంకు దర్భ చాప, తాడు సిద్ధమయ్యాయి. ఈ క్రతువుల్లో దర్బచాప, తాడు అతిముఖ్యమైనవి.  బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం  మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు.దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో  విష్ణు దర్బ ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంటకాలువల మీద పెరిగే ఈ దర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరిస్తారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్బను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు. ధ్వజారోహణం కు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి.  అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది.  టీటీడీ డి ఎఫ్ ఓ చంద్ర‌శేఖ‌ర్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వచ్చి వీటిని ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ కు  అందిచారు. ఈ నెల 19వ తేదీ జరిగే ధ్వజారోహణం లో వీటిని ఉపయోగిస్తారు.

Tirumala

2020-09-17 21:09:06

న్యాయవ్యవస్థలో పక్షపాత వైఖరి కనిపిస్తోంది..

చట్టం ముందు అందరూ సమానమనే అన్న సూత్రాన్ని విస్మరించి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చెప్పారు. గురువారం పార్లమెంట్‌ వద్ద విజయసాయిరెడ్డి  మీడియాతో మాట్లాడారు.  తాను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదన్న ఆయన అసాధారణ  పరిస్థితుల్లో మాత్రమే నిషేధం విధిస్తారని వివరించారు. న్యాయ స్థానాలు పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని, మీడియా నోరు నొక్కు తున్నాయని, ఆవేదన వెలిబుచ్చారు. ధర్మాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్థ  పక్షపాతంతో వ్యవహరిస్తోందని చెప్పారు. తాజా వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యానించిన అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజాగా విధించిన ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్న ఆయన ఈ విధంగా ముందుకెళితే న్యాయవ్యవస్థ ద్వారా ప్రభుత్వాలు, తద్వారా ప్రజలకు ఏం చేస్తుందనే అనుమానాలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు.

New Delhi

2020-09-17 16:01:17

సెప్టెంబర్ 18న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమలో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ బ్ర‌హ్మో త్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. బ్ర‌హ్మోత్స‌వాల కోసం సెప్టెంబర్ 18న శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మ‌ధ్య‌ అంకు రార్పణ నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా శ్రీ విష్వ‌క్సేనుల వారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది. సెప్టెంబర్ 19న ధ్వజారోహణం :  శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 19వ తేదీ శ‌నివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ ఉంటుంది.

Tirumala

2020-09-17 15:23:29

మొన్న అంతర్వేది.. నిన్న విజయవాడ.. నేడు ఏలేశ్వరం

ఆంధ్రప్రదేశ్ లో  హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.అంతర్వేది రధం దగ్ధం విషయంలో రేగిన గాయం మానక ముందే అమ్మల గన్న అమ్మ ఇంద్రకీలాద్రి పై వేంచేసిఉన్న కనకదుర్గమ్మ వారి వెండిరధం కి అమర్చిన మూడు సింహాలు మాయమయ్యాయి. అదే రోజే నిడమానూరులో సాయి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వాటివలన దెబ్బతిన్న మనోభావాలనుండి తెరుకోకముందే గతరాత్రి తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం లో హనుమాన్ విగ్రహం,కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని ప్రాచీరణ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో స్వామి వారి ముందుండే నంది విగ్రహాన్ని ధ్వంసం చేయటం రాష్ట్రంలో చర్చనీ యాంశంగా మారింది.  ఇన్ని దాడులు చేస్తున్నా ప్రభుత్వం ఏమీ చెయ్యదనా?ఏమీ చెయ్యలేదనా ?అనే ధీమా ఈ విధ్వంసానికి పాల్పడుతున్న దుండగుల్లో నాటుకుపోయి ఈ దూరాగతాలకు పాల్పడుతున్నారా?అని హిందూ బంధువులు ప్రశ్నిస్తున్నారు. అంతర్వేదిలో రేగిన ఆందోళన తర్వాత అయినా ఇలాంటి దుష్ట చేష్టలకు స్వస్తి చెప్పవలసిన దుష్టులు ఇంకా చెలరేగి పోతూ ఒకదాని అనంతరం మరొక దూరాగతానికి పాల్పడటం వలన ఏమి సాధించాలి? ఇలాంటి నీచ నికృష్ట చేష్టలకు పాల్పడుతూ ప్రభుత్వానికే సవాల్ విసురుతున్న దుష్టుల అట కట్టించాలని హిందూ బంధువులు కోరుతున్నారు. ఈ ఆటవిక చర్యల వెనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దుష్ట శక్తుల ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే పలు ఆశక్తికర అంశాలు వెలుగుచూసే అవకాశం వుంది..

Yeleswaram

2020-09-17 15:12:21