శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామివారిని సింహ వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహా ధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవం తమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు పాల్గొన్నారు. కాగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
తిరుమల పుణ్యక్షేత్రం కొండపై ఆదివారం చాలా తక్కువ ఎత్తులో విమానం ప్రయాణించడం సంచలనం స్రుష్టించింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల క్షేత్రంలో విమానాలు తిరగడంపై నిషేధం ఉంది. అదీ కాకుండా బ్రహ్మోత్సవాల వేళ నిబంధనలకు విరుద్ధంగా విమానం రావడంతో సర్వత్రా ఆందోలన వ్యక్తమవుతుంది. కాగా ఈ వివాదంపై ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సురేష్ స్పందించారు. తిరుమలలో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. విమానయాన శాఖకు చెందిన నావిగేషన్ సర్వే విమానం తిరుమల మీదుగా వెళ్ళిందని, అయితే తిరుమల శ్రీవారం ఆలయం మీదుగా ఆ విమానం వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆలయానికి కొద్దిగా దూరం నుంచి ప్రయాణించిందని, తిరుమలపై విమాన రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. తిరుమల కొండను నో ఫ్లై జోన్‌గా ప్రకటించలేమని గతంలో కేంద్రం స్పష్టం చేసిందని, అయినప్పటికీ అనధికారికంగా తిరుమల నో ఫ్లై జోన్‌గా కొనసాగుతోందని వివరణ ఇచ్చారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లనగ్రోవితో మురళి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్థభం వరకు స్వామివారిని చిన్న శేష వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, శేఖర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్రవ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. సచివాలయం లో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయపం పరీక్షవిజయవంతంగాగా జరిగిందని, మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్త అయ్యాయన్నారు. అభ్యర్ధులు నిర్ధేశించిన సమాయానికవ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభ్యర్ధల కోసం మంచినీరు, మందులు, పారామెడికల్ సిబ్బంది సేవలు అన్నీ అంబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో పల్స్ ఆక్సీ మీటరు ద్వారా టెంపరేచర్ పరీక్షలు చేసిన తరువాతే అభ్యర్ధులను లోనికి అనుమతిస్తామని చెప్పిన ఆయన ఆలస్యానికి అభ్యర్ధులే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు.
గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కొరకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతల నుండి కొన్నింటిని తొలగించినట్లు ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఏదై నా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు గుర్తించిన 4 సంవత్సరాల బిఎస్సి(హార్టికల్చర్), లేదా వైఎస్సార్ ఉద్యా న యూనివర్సిటీ నుండి 2 సంవత్సరాల డిప్లొమో(హార్టికల్చర్) పూర్తిచేసినవారు మాత్రమే అర్హులని,ఇవి గాక మరే అర్హతలున్నా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోమని ఆయన వివరించారు. నియామకంలో భాగంగా ఈ నెల 25 న నిర్వహించనున్న పరీక్షలకు మిగతా అర్హతలున్నవారు ఒక వేళ హాజరై పరీక్ష రాసినా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోమని, అభ్యర్థులందరూ ఈ విషయం గమనించాలని కమిషనర్ చిరంజీవి చౌదరి కోరారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. గోవిందాచార్యులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సప్తమరుత్తులను(దేవతాపురుషులు), రుషిగణాన్ని, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడాళ్వార్ ధ్వజస్తంభాన్ని అధిరోహిస్తారని ప్రాశస్త్యం. విశ్వమంతా గరుడుడు వ్యాపించి ఉంటారు. ఆయన్ను శ్రీనివాసుడు వాహనంగా చేసుకోవడంతో సర్వాంతర్యామిగా స్వామివారు కీర్తించబడుతున్నారు. కాగా, ధ్వజపటంపై గరుడునితోపాటు సూర్యచంద్రులకు కూడా స్థానం కల్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పెసరపప్పు అన్నం(ముద్గర) ప్రసాద వినియోగం జరిగింది. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంపదలు సమకూరుతాయని విశ్వాసం. అదేవిధంగా, ధ్వజస్తంభానికి కట్టిన దర్భ అమృతత్వానికి ప్రతీక. పంచభూతాలు, సప్తమరుత్తులు కలిపి 12 మంది దీనికి అధిష్టాన దేవతలు. ఇది సకలదోషాలను హరిస్తుంది. దర్భను కోసేటప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేటపుడు ధన్వంతరి మంత్ర పారాయణం చేస్తారు. ధ్వజారోహణం అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు.
ధ్వజారోహణ ఘట్టానికి ముందుకు సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, కుమారగురు, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా రోజూ వచ్చే వేలాది మంది భక్తులను డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ప్రశ్నించారు. మీడియా అడిగిన మేరకు మాత్రమే మాట్లాడుతున్నానని చైర్మన్ చెప్పారు. సోనియా గాంధీ, దివంగత సిఎం డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని మాత్రమే నేను చెప్పానని స్పష్టం చేశారు.. అందువల్ల ముఖ్యమంత్రి వైఎస్.జగ న్‌మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. టిటిడి చట్టంలోని రూల్ : 136 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు. స్వామివారి దర్శనం చేసుకోదలచిన ఇతర మతస్తులు తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి తమంతకు తాము డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్ : 137లో స్పష్టంగా ఉంది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే (ఉదాహరణకు ఏసయ్య, అహ్మద్, సర్దార్ సింగ్ ఇలాంటి ఇతరత్రా పేర్లు లేదా వారి శరీరం మీద ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉంటే) దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారు. గతంలో అనేకమంది ఇతర మతాలకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్నాకే తన సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారని గుర్తుచేశారు. పాదయాత్ర ముగిశాక తిరుపతి నుంచి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారన్న చైర్మన్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్వామివారి దర్శనం చేసుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు.. సీఎం వైఎస్ జగన్ కు శ్రీవేంకటేశ్వరస్వామివారి మీద అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదని సబ్బారెడ్డి స్పష్టం చేశారు.