శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై తలపాగా, జాటీతో గోవుల గోపన్నగా దర్శనమిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు పాల్గొన్నారు. కాగా.. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా సేవలందించడంలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాకు ప్రథమ స్థానం దక్కిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సో మవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రారంభమైన తొలి నాటి నుండి ఈనాటి వరకూ అనగా 239 రోజుల వ్యవధిలో 1207 గ్రామ సచివాలయాలు ద్వారా 14, 32, 324 సేవలు అందించామన్నారు. ఒక్కొక్క గ్రామ సచివాలయం ద్వారా వేగంగా రోజుకు సగటున ఐదు సేవలు అందిస్తున్నామ న్నారు. సేవలందించడంలో రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే చాలా ముందున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ఉత్సాహంతో మరింతగా ప్రజలకు సేవలందించేందకు శక్తివంచన లేకుండా శ్రమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా 1207 గ్రామ సచివాలయాల ద్వారా 14, 32, 324 సేవలు అందించి సగటున రోజుకు 4.97 సేవలతో అగ్రస్థానంలో నిలువగా, తూర్పు గోదావరి జిల్లా1590 గ్రామ సచివాలయాల ద్వారా 14, 17, 788 సేవలు అందించి 3.73 సేవలతో రెండవ స్థానంలో నిలువగా, చిత్తూరు జి ల్లా1312 గ్రామ సచివాలయాల ద్వారా 9, 67, 566 సేవలు అందించి రోజుకు 3.09 సేవలతో మూడవ స్థానంలో నిలిచిందన్నారు. నెల్లూరు జిల్లా 927 గ్రామ సచివాలయాల ద్వారా 6, 03 , 779 సేవలు అందించి రోజుకు 2.73 సేవలను , గుంటూరు జిల్లా1334 గ్రామ సచివాలయాల ద్వారా 8, 64, 133 సేవలు అందించి రోజుకు 2.71 సేవలను పశ్చిమ గోదావరి జిల్లా 1165 గ్రామ సచివాలయాల ద్వారా 7, 49, 955 సేవలు అందించి సగటున రోజుకు 2.69 సేవలను, విజయనగరం జిల్లా 778 గ్రామ సచివాలయాల ద్వారా 4, 51,174 సేవలు అందించి సగటున రోజుకు 2.43 సేవలు , శ్రీకాకుళం జిల్లా 7930 గ్రామ సచివాలయాల ద్వారా 5, 11, 963 సేవలు అందించి సగటున రోజుకు 2.30 సేవలు, ప్రకాశం జిల్లాలో 1058 సచివాలయాల ద్వారా 533323 సేవలను అందించి సగటున రోజుకు 2.11 సేవలు,,కర్నూల్ జిల్లాలో 1187 సచివాలయాలకు గాను 588654 సేవలను సగటునరోజుకు 2.07 సేవలను ,కృష్ణా జిల్లాలో 1286 సచివాలయాలకు గాను 612408 సేవలను సగటున రోజుకు1.99 సేవలను , వైఎస్సార్ కడప జిల్లాలో 889 సచివాలయాలకు గాను 419329 సేవలను సగటున రోజుకు 1.97 సేవలను,విశాఖపట్నం జిల్లా లో 1341 సచివాలయాలకు గాను 508679 సేవలను సగటున రోజుకు1.59 సేవలను అందించాయన్నారు. అనంత జిల్లాలో గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన అందిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రోత్సహించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు కాళీయమర్ధన చిన్నికృష్ణుడి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు. ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. వాహనసేవలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, తిరుమల పూర్వపు జెఈవో కెఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్ పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన మంగళవారం ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖకు మరింత టెక్నాలజీని జోడిస్తోంది. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి యావత్ సాంకేతిక వ్యవస్థనే మార్చే పని లో నిమగ్నమైంది. ఈమేరకు సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసుశాఖకు అత్యాధునిక శాటిలైట్ ఫోన్లను డిజిపి గౌతం సవాంగ్ కు అందించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ, ట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి తెచ్చి రిమోట్ ఏరియా కమ్యూనికేషన్లు, వాహనాలకు జీపీఎస్, శాటిలైట్ ఫోన్ల వ్యవస్థ ఏర్పాటు చేశామని వివరించారు. అత్యవసర సమయంలో ఈ ఫోన్లు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా కమ్యునికేట్ చేయడానికి శాటిలైట్ ఫోన్లు పోలీసుశాఖకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. ఎలాంటి విపత్తులోనైనా ఈ శాటిలైట్ ఫోన్లు పనిచేస్తాయని సీఎం వివరించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎలాంటి నష్టం లేకపోయినా ఆ బిల్లుపై కాంగ్రెస్ ఎందుకు రాద్దాంతం చేయడం ఏమిటని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు కొమ్ము కాసే కాంగ్రెస్.. బిల్లును వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్లను తప్పుబట్టిన సోము హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు సనాతన ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవాచేశారు. అంతేకాకుండా 40 ఆలయాలు కూల్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. పుష్కరాల్లో చంద్రబాబు నిర్వాకం వల్ల 30 మంది చనిపోయారన్నారు. అలా ప్రాణాలు తీసిన వాళ్లు ఇపుడు ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పండించిన పంటను నేరుగా గిట్టుబాటు ధరకు రైతే అమ్ముకోవాలనే లక్ష్యం కేంద్రం ఈ బిల్లుని ప్రవేశపెడితే అన్ని వర్గాలు మద్దతు ఇచ్చాయన్నారు. వ్యాపార లావాదేవీల ద్వారా రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించిన ఆయన యూపీఏ ఇచ్చినా సబ్సిడీ కంటే రెండింతలు బీజేపీ ప్రభుత్వం ఇస్తోందని గుర్తుచేశారు. దేశంలో రైతులను ఆర్ధికంగా బలపడేవిధంగా చేయడానికి మోడి కంకణం కట్టుకున్నారన్న సోము మార్కెట్ యార్డులు రద్దు చేస్తారన్న ప్రచారంలో ఎలాంటి నిజమూ లేదని వివరించారు.
ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం కట్టుబడి వుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు. సోమవారం పోలీశాఖ దేశం లోనే తొలిసారిగా రూపొందించిన సరికొత్త యాప్ ఏపి పోలీస్ సేవ మొబైల్ యాప్ ను సీఎం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పోలీసులంటే భయప డాల్సిన అవసరం లేదని.. వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాలన్న ఆయన ఈ యాప్ ద్వారా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొ న్నారు. ఈ యాప్ ద్వారా 87 సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించిన సీఎం యాప్ ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితులు బాగా తగ్గించగలిగామనే భావన ప్రతీ పౌరుడికి కలుగుతుందన్నారు. పోలీసులు అందించే సేవలను ఒకే ఫ్లాట్‌ఫామ్ పైకి తీసుకొచ్చి సేవలు మరింత ఎక్కువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్య మన్నారు.. కేసు పెట్టిన దగ్గర నుంచి దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చన్నారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఏ దశలో కేసు ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషనల్లీ ఈ యాప్ లో అనుసంధానించినన ఈయాప్ ను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సీఎం సూచించారు. యాప్ చక్కగా తీసుకొచ్చిన రాష్ట్ర పోలీస్‌శాఖను సీఎం అభినందించారు. కార్యక్రమంలో డిజిపి గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామివారిని సింహ వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహా ధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవం తమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు పాల్గొన్నారు. కాగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
తిరుమల పుణ్యక్షేత్రం కొండపై ఆదివారం చాలా తక్కువ ఎత్తులో విమానం ప్రయాణించడం సంచలనం స్రుష్టించింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల క్షేత్రంలో విమానాలు తిరగడంపై నిషేధం ఉంది. అదీ కాకుండా బ్రహ్మోత్సవాల వేళ నిబంధనలకు విరుద్ధంగా విమానం రావడంతో సర్వత్రా ఆందోలన వ్యక్తమవుతుంది. కాగా ఈ వివాదంపై ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సురేష్ స్పందించారు. తిరుమలలో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. విమానయాన శాఖకు చెందిన నావిగేషన్ సర్వే విమానం తిరుమల మీదుగా వెళ్ళిందని, అయితే తిరుమల శ్రీవారం ఆలయం మీదుగా ఆ విమానం వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆలయానికి కొద్దిగా దూరం నుంచి ప్రయాణించిందని, తిరుమలపై విమాన రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. తిరుమల కొండను నో ఫ్లై జోన్‌గా ప్రకటించలేమని గతంలో కేంద్రం స్పష్టం చేసిందని, అయినప్పటికీ అనధికారికంగా తిరుమల నో ఫ్లై జోన్‌గా కొనసాగుతోందని వివరణ ఇచ్చారు.