సాహితీవేత్తగా',రచయిత్రిగా ,జర్నలిస్టుగా ,'చిరపరిచితురాలు బి. జయ.. ఎన్నో ఉన్నత భావాలు, మంచి అభిరుచి ఉన్న మహిళామణి ఈమె. కొత్త హీరోతో , కొత్త హీరోయిన్ తోనే కాకుండా , పలువురు కొత్త నటీనటులతో, సాంకేతిక నిపుణులతో తొలిసారిగా దర్శకత్వం వహించిన ఘనత బి.జయకు దక్కుతుంది. సూపర్ హిట్ ఫ్రెండ్స్ బ్యానర్ నిర్మించిన "చంటిగాడు "చిత్రం విడుదలై నేటికి పదిహేడు సంవత్సరాలు పూర్తయింది. విడుదల తేదీ 26-11-2003. మొదటి చిత్రంతోనే దర్శకురాలిగా విజయం సాధించారు బి.జయ..నూతన నటీనటులతో, నూతన దర్శకురాలితో చిత్ర నిర్మాణం గావించిన డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ బి.ఎ.రాజు ఎంతైనా అభినందనీయులు. చంటిగాడు సినిమా 17ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈఎన్ఎస్ సినిమా విభాగం అభినందనలు తెలియజేస్తుంది..!
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన "రాంగ్ గోపాల్ వర్మ" డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ర్యాప్ రాక్ షకీల్ స్వరకల్పనలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ కావడం తెలిసిందే. షకలక శంకర్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో కత్తి మహేష్, జబర్దస్త్ అభి ముఖ్య పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4 న విడుదల కానుంది. ఒకప్పుడు దర్శకుడిగా ఒక వెలుగు వెలిగి.. గత కొన్నేళ్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అర్ధ నగ్న, పూర్తి నగ్న చిత్రాలు తీస్తూ.. "సామాజిక కాలుష్యానికి" కారకుడు అవుతున్న ఒక ప్రముఖ దర్శకుడి విపరీత ధోరణిపై నిప్పులు చెరుగుతూ.... జర్నలిస్టు ప్రభు తెరకెక్కించిన "రాంగ్ గోపాల్ వర్మ" చిత్రం ఇప్పటికే అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తుండడం తెలిసిందే. చిత్ర పరిశ్రమతో పాటు, పలువురు సినీ ప్రముఖుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సినిమాలు తీస్తున్న సదరు దర్శకుడి మీదనే ఘాటైన విమర్శనాస్త్రాలు సందిస్తూ ఒక సినిమా వస్తుండటంతో చిత్ర పరిశ్రమలో ఈ సినిమా గురించి ఆసక్తిదాయకమైన చర్చ జరుగుతోంది!
నటసామ్రాట్ అక్కినేని నటించిన నటించిన 127 వ చిత్రం "పూలరంగడు." సినిమాకి 53 వసంతాలు నిండాయి.ఈ చిత్రం తేదీ 24-11-1967 న విడుదలైంది. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు నిర్మించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. మంచి కథా బలం ఉన్న ఈ చిత్రం లో, ఎంతో హుషారైన పాటలు ఉన్నాయి . పదకొండు కేంద్రాలలో విజయవంతంగా శతదినోత్సవం జరుపుకుంది ఈ చిత్రంలోఅక్కినేని , గుమ్మడి ,శోభన్‌బాబు , పద్మనాభం, చలం ,భానుప్రకాష్, అల్లు రామలింగయ్య ,జమున ,విజయనిర్మల ,సూర్యకాంతం ,రాధాకుమారి వంటి తారాగణం నటించారు. ఆ పాత మధురాల సినిమాల్లో పూల రంగడు కూడా ఒకటి. ఈ సినిమాతోనే పూలరంగడు అనే ఊత పదం కూడా తెలుగు ప్రేక్షలకు పరిచియం అయ్యిందని చెబుతారు. పూలరంగడు తరువాత అక్కినేని సినిమాలు వచ్చినప్పటికీ పూలరంగడులోని నటన అక్కినేనికి మంచిపేరు తెచ్చిపెట్టిందని నేటికీ సినిమా వర్గాలు చెబుతుంటాయి. ఆపాత మధురాల విశేషాలు అందించాలనే ఈఎన్ఎస్ సినిమా రిపోర్టర్ ఏరికోరి ఆ పాత సినిమా విశేషాలను అందిస్తున్నారు..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా రంగ ప్రవేశానికి సరిగ్గా 45 సంవత్సరాలు నేటితో పూర్తయింది. దర్శకరత్న దాసరి నారాయణరావు అందరూ నూతన నటీనటులతో "స్వర్గం -నరకం" చిత్రం నిర్మించారు. ఆ చిత్రం 22-11-1975 విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా మోహన్ బాబు , ఫటాఫట్ జయలక్ష్మి, ఈశ్వరరావు , అన్నపూర్ణ వంటి నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు దర్శకరత్న.వీరిలో ఈశ్వరరావు, ఫటాఫట్ జయలక్ష్మి, అన్నపూర్ణ వంటి వారు నటీనటులు గా రాణించారు . కాగా మంచు భక్తవత్సలం నాయుడు గా ఉన్న వ్యక్తిని మోహన్ బాబుగా పేరు మార్చి తెలుగుతెరకు పరిచయం చేశారు. మోహన్ బాబు ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు .దుష్టపాత్రలను, హీరో పాత్రలను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కామెడీ ఆర్టిస్ట్ గా పలు పాత్రలను పోషించి ,ఆ పాత్రలకు ఎంతో న్యాయం చేకూర్చారు .ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన మోహన్ బాబు విలక్షణమైన, సలక్షణమైన నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యి నేటికి నలభై అయిదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈఎన్ఎస్ సినిమా డెస్క్ శుభాకాంక్షలు. తెలియజేస్తుంది.
రంగు పడుద్ది...అదో తుత్తి...ఏవిటో... అనే డైలాగులు ఆయనని తలచుకోగానే మనకు తెలీకుండా పెదాలపై చిరునవ్వులు చిందుతాయి. ఎన్ని బాధల్లో ఉన్నా చిటికలో మనసు ఉల్లాసభరితమవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తుతుంది.. అదో తుత్తి అంటూ సరదాగా కడుపుబ్బా నవ్వేస్తాం.. ఆయన మంచి హాస్యానికి అసలు సిసలైన చిరునామాను సినిమాలు చూస్తూ వెతుక్కుంటూ పోతాం అందుకే... అంటారు ప్రేక్షకులంతా ముక్తకంఠంతో ఆమంచి మా మంచి హాస్యనటుడని. పేరు... ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం..సినిమావాళ్లు ముద్దుగా ఏవీఎస్ అంటారు.. బ్రహ్మానందంల్లాంటి నటుల సరసన సత్తా చాటుకున్న ప్రముఖ హాస్య నటుడు. అంతేనా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్రసీమలో తన ఉనికిని బలంగా నిరూపించుకున్నారు. పూర్వాశ్రమంలో ఆయన పాత్రికేయుడు కూడా..ఏవీఎస్. న సుప్రసిద్ధులు.ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ తెలియదు గానీ ఏవీఎస్ అంటే టక్కున గుర్తొచ్చే మంచి నటుడు ఏవీఎస్ ఆయన 2013, నవంబర్ 8న మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ... ఏవీఎస్ సినిమాల్లోని హాస్యాన్ని సరదాగా చూస్తూ తుత్తి పొందడమే...అమర్ రహే ఏవిఎస్..!
మంచి కధాంశంతో రూపొందిన "కరాబ్ శంకర్" చిత్రం ఘన విజయం సాధించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆకాక్షించారు. చిత్రం పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ తో కలిసి గంట్ల మీడియాతో మాట్లాడారు. అందాల విశాఖలో తీసిన ఎన్నో చిత్రాలు విజయవంతం అయ్యాయని ఈ చిత్రం కూడా మంచి హిట్ కావాలని ఆకాంక్షించారు. కరాబ్ శంకర్ షార్ట్ ఫిల్మ్ విడుదలకు సిద్ధమైందని విశాఖకు చెందిన డైరెక్టర్ రాబిన్ గణేష్ చెప్పారు. కన్నడ నటుడు గంధర్వ రాజ్ హీరోగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని విశాఖ పరిసరాల్లోనే నిర్మించామన్నారు. రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామన్నఆయన 30 నిముషాల నిడివి గల ఈ చిత్రంలో విజయవాడ కి చెందిన టీవీ ఆర్టిస్ట్ విజయలక్ష్మి హీరోయిన్ గా నటించారని చెప్పారు. హీరో గంధర్వ రాజ్ మాట్లాడుతూ, విశాఖ వాసులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాయినాధ కళాసమితి కూచిపూడి నాట్య గురువు డా..అరుణ్ సాయికుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రివ్యూ ఈ సాయంత్రం (శనివారం ) ఆరు గంటలకు నగరం లోని పబ్లిక్ లైబ్రరీలో ప్రదర్శించినట్టు చెప్పారు. నిర్మాత కస్తూరిబాయ్ మాట్లాడుతూ, కొత్త కధనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన తమ కుమారుడు గంధర్వ రాజ్ ని ఆశీర్వదించాలని కోరారు. హీరో తండ్రి ఈశ్వర్ దామెర్ల మాట్లాడుతూ, తాము కూడా తెలుగు వాళ్లమేనని, తమ పూర్వికులు మైసూర్ లో స్థిర పడ్డారన్నారు. విజేఎఫ్ కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు మాట్లాడుతూ, అద్భుతమైన టాలెంట్ కన్నడిగుల సొంతమన్నారు. ఇదే బృందం నేతృత్వంలో వచ్చే ఏడాది మరో చిత్రం తీయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. విజేఎఫ్ ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ.. చిత్రం యూనిట్ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. ఈ సమావేశంలో వినియోగదారుల రాష్ష్ట్ర మహిళా చైర్మన్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుమార్తె శివానీ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. ‘‘సిటీ న్యూరో సెంటర్‌లోని డాక్టర్ కృష్ణ నేతృత్వంలోని వైద్యుల బృందం మా తండ్రిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. మా తండ్రి కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు’’ అని శివానీ ట్వీట్ చేశారు. మరోవైపు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు సైతం రాజశేఖర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేశారు. ‘‘కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్‌లో చేరిన డాక్టర్ రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రాజశేఖర్ కూడా మా టీమ్ అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. ఇక కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రాజశేఖర్ సతీమణి జీవిత సైతం కోలుకున్నారు. ఈ రోజు ఆమెకు చేసిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జీ చేశాం’’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆపాత మధుర సినిమాల్లో కడుపుబ్బా నవ్వించాలంటే నవ్వుల రేడు రాజుబాబు తప్పా మరెవరూ లేరు...నేటికీ ఆ స్థాయిలో కామెడీ పంచగల కమీడియన్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ నవ్వుకే నవ్వు తెప్పించగలు.. ఆ నవ్వుల రేడు రాజబుబు జయంతి నేడు. సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడని అంటారు దానికి కారణం ఆయన పెరిగిన వాతావరణ అలాంటిది. అంతేకాదు మహా కవి శ్రీశ్రీ , రాజబాబులు ఇద్దరూ తోడళ్లుల్లు కావడం కూడా దానికొక కారణం. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించే వాడు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన బాలకృష్ణను సత్కరించాడు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇచ్చాడు. అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు. దాని పేరుకూడా ఆయన పేరు మీదే "రాజబాబు జూనియర్ కళాశాల"గా ఉంది. వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు. అంతటి మహా హాస్యనటుడిని ఒక్కసారి గుర్తుచేసుకుంటూ ఆయనకు మనసారా జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం...
రేణు దేశాయ్ ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కి మొదలు పెడతున్నారు.. డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడ క్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం తో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ హీరో 'వైభవ్ తత్వవాడి' ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 'హుషారు' ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే 'ఆద్య' విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాత రజనీకాంత్.ఎస్ తెలిపారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి, కథ-మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్యరెడ్డి.ఎస్, ప్రొడ్యూసర్స్: రావ్ డి.ఎస్-రజనీకాంత్.ఎస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల!!
శ్రీకాకుళం జిల్లాలో చారిత్రక నేపధ్యం గల వీరగున్నమ్మపై చిత్రీకరిస్తున్న యూనిట్ సభ్యులు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, గిరిజన విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి మరియు వీరగున్నమ్మ చిత్రంలో జమీందారీ పాత్రధారి ప్రొ. హనుమంతు లజపతిరాయ్ నేతృత్వంలో చిత్ర యూనిట్ సభ్యులు కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో వీరగున్నమ్మ ప్రభావం, స్వాతంత్ర్య సమరంలో ఆమె చూపిన తెగువ తదితర విషయాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ నివారణకు శాయశక్తులా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ నివాస్ కు చిత్ర యూనిట్ సభ్యులు సత్కరించారు. జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ చారిత్రాత్మక చిత్రాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగాను, సందేశాత్మకంగాను ఉంటాయన్నారు. మందస కోటను, పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయుటకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో లఖినాన వెంకటాచలం, ఎల్.రవికుమార్, ఆదిత్య భరద్వాజ్, అప్పారావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు కూడా ఉన్నారు.
యువ ప్రతిభాశాలి-నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ 'బ్యాక్ డోర్' పేరుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ కథానాయకి పూర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విభిన్న కథా చిత్రాన్ని.. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం లాంఛనంగా జరిగాయి. ఈ సందర్భంగా దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ, "బ్యాక్ డోర్"ఎంట్రీ అన్నది ఈరోజుల్లో అన్ని రంగాల్లో చాలా కామన్ అయిపోయింది. అటువంటి ఓ ప్రత్యేకమైన "బ్యాక్ డోర్" ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వినూత్న చిత్రం హీరోయిన్ పూర్ణ కెరీర్ లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది" అని అన్నారు. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 'త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. శర వేగంతో షూటింగ్ పూర్తి చేసేందుకు మా దర్శకుడు కర్రి బాలాజీ అన్ని సన్నాహాలు చేస్తున్నారు" అని వివరించారు. చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి పాటలు: జావళి, సంగీతం: ప్రణవ్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ. రచనాసహకారం: భూపతిరాజు రామకృష్ణ-రవి రోహిత్.జి, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ.
కరోనా వైరస్ మరో ప్రముఖ తెలుగు నటుడిని బలి తీసుకుంది. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన కోసూరి వేణుగోపాల్ కరోనా వైరస్ తో కన్నుమూశారు. గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న వేణుగోపాల్ బుధవారం రాత్రి మరణించారు. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోవడం విశేషం. నర్సాపురంకు చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. దాదాపు 27 సంవత్సరాలుగా నటిస్తున్న ఆయన `పిల్ల జమిందార్`, `మర్యాద రామన్న`, `విక్రమార్కుడు`, `అమీతుమీ`, `ఛలో` తదితర చిత్రాలలో నటించారు. ఆయన ఆకస్మిక మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు నటులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఇప్పటికే చాలా మంది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కరోనా భారిన పడగా, ఈయన మ్రుతితో వారందరిలో ఆందోళన మరింత పెరిగింది. ఇటు నర్సాపురంలో కూడా విషాద చాయలు అలముకున్నాయి...
కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ఆపదలో వున్నవారి ప్రాణాలను కాపాడిన వారవుతారని విలక్షణ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ట్విటర్ ద్వారా కోరారు. కరోనా నుంచి కోలుకున్నవారి శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని, ఆలోగానే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ప్లాస్మా దానం చేయడానికి తన శరీరంలో యాంటీ బాడీస్ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని వైద్యులు తెలిపారని వివరించారు. అందుకే తాను ప్లాస్మా దానం చేయలేద న్నారు. అయితే తన పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ప్లాస్మా దానం చేయడం ఆనందంగా వుందన్నారు. ఐజీజీ లెవల్స్ పెరగగానే తాను ప్లాస్మా దానం చేస్తానని రాజమౌళి ప్రకటించారు. కరోనా నుంచి కోలుకున్నవారం నేరుగా ప్లాస్మా దానం చేయడానికి వెళ్లపోకుండా ముందర ఐజీజీ లెవల్స్ ను పరీక్షించుకున్న తరువాత మాత్రమే దానానికి సిద్ధ పడాలని కూడా హెచ్చరించారు.