శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 14వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని టిటిడి నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి సెప్టెంబరు 28వ తేదీ రాత్రి 7.00 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్ఫణ నిర్వహించనున్నారు. లోక కల్యాణార్థం, కోవిడ్ - 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆశాంతి, ఆనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపూర్ణ ఆరోగ్య సౌభాగ్యాలు, ఆర్థిక పరిపుష్ఠి నెలకొల్పడానికి 16 రోజుల పాటు టిటిడి నిష్ణాతులైన వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం జరిగిన సుందరకాండ పారాయణంలో ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ '' రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః '' మహామంత్రంలో 16 అక్షరాలు ఉన్నాయని, వాటి బీజాక్షరాలు 68 అవుతుందన్నారు. కావున టిటిడి ప్రచురించిన సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయని, ఇందులో 2821 శ్లోకాలను 16 రోజుల పాటు పారాయణం చేయనున్నట్లు తెలిపారు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయస్వామివారి అనుగ్రహంతో ప్రపంచంలోని మానవులు ధర్మాని ఆచరిస్తూ, సకల శుభాలను పొందాలని ఆకాంక్షిస్తూ షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని టిటిడి నిర్వహిస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కొరకు ఎస్వీబీసీ ప్రతిరోజు ఉదయం 9.00 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6.00 నుంచి 9.00 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని అయిన మహల్ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. అనంతరం అయిన మహల్ ముఖ మండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు.
అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక - యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు. అనంతరం రాత్రి 8.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
ఈ కార్యక్రమాల్లో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్‌రెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, డి.పి.అనంత, అర్బన్ ఎస్‌పి రమేష్‌రెడ్డి, సిఇ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యన్నారాయణస్వామివారి దేవస్థానం నిధుల కొరతతో కొట్టిమిట్టాడుతోంది. స్వామివారికి వచ్చిన ఆదాయం ఉద్యో గుల జీతాలకు కూడా సరిపోవడంలేదు. దీంతో గత మూడు నెలలుగా ఉద్యోగులకు, పొరుగు సేవల సిబ్బందికి సగం సగం జీతాలే ఇస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలతోపాటు అన్నవరం సత్యదేవుని ఆలయంపైనా అధికంగానే పడింది. ఇప్పటికే సిబ్బంది లేమితో కొట్టిమిట్టాడుతున్న దేవస్థానం.. ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు స్వామివారికి ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ల నుంచి నగదు తీసుకోవడానికి ప్రభుత్వానికి లేఖలు రాసినా అక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులతోపాటు, భక్తులు కూడా స్వామివారి కరుణకోసమే వేచి చూస్తున్నారు. లాక్ డౌన్ 4.0 నిబంధనల ప్రకారం భక్తులను అనుమతించినా, ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుంది. దానికితోడు కరోనా పాజిటివ్ కేసులు కూడా అధికంగా పెరుగుతుండటంతో భక్తులు కూడా ఆలయాలకు రావడానికి భయపడుతున్నారు. వచ్చిన భక్తులకు కూడా నిత్యన్నాధ పథకం నిర్వహణ కూడా ఇబ్బంది కర పరిస్థితుల్లోనే ఉందని అధికారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు చేసుకున్నవారంతా ఖచ్చితంగా స్వామివారి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ వస్తుండటంతో ఆ జంటలు మాత్రం వ్రతాలు చేయించుకోవడానికి వస్తున్నారు. స్వామివారి కళ్యాణం అయితే నేరుగా జరగకుండా కేవలం ఆన్ లైన్ లో మాత్రమే నిర్వహిస్తున్నారు. వైరస్ తీవ్రత తగ్గి, భక్తులు పెరిగి ఆదాయం వస్తే తప్పా దేవస్థాన ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు అందే పరిస్థితి కనిపించడం లేదు...
పర్యాటక ప్రమేమికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిని టూరిజం ప్యాకేజిగా అభివ్రుద్ధి చేయను న్నట్టు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలియజేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కొత్త పర్యాటక ప్రాంతాలు అన్ని జిల్లాల్లోనూ ఆదరణకి నోచుకోకుండా ఉన్నాయని వాటన్నింటిని గుర్తించి జిల్లాల వారీగా టూరిజం ప్రాజెక్టులుగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. తద్వారా విశాఖపట్నం లాంటి అంతర్జాతీయ ఖ్యాతి వున్న ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించడానికి వీలుపడుతుందని చెప్పారు. అదే విధంగా కొత్తగా టూరిజంహోటళ్లు కూడా రాబోతున్నాయని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ టూరిజం ప్రాజెక్టులను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ లో అభివృద్ధి చేసేందుకు పథకాలను, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖ నగరం, జిల్లాలో పర్యాటక ప్రాంతాల సందర్శన రంగంలో అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల సందర్శన, యాత్రా స్థలాల సందర్శన, విహారస్థలాలు చారిత్రక ప్రదేశాలు హస్తకళల విభాగాలను కలిపి ఒక ప్యాకేజీ గా చేస్తామని వివరించారు. దీంతో విశాఖజిల్లాలో ఇప్పటి వరకూ ఉన్న పర్యాటక ప్రాంతాలతోపాటు, కొత్తగా మరికొన్ని పర్యాటక ప్రాంతాలు ఏర్పాటు అయ్యే అవకాశం వుంది. తద్వారా మరికొందరికి ఉపాదికూడా పెరుగుతుందని మంత్రి మీడియాకి వివరించారు...
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థలో ఉత్తుత్తి కార్యదర్శిలు పనిచేస్తున్నారు..ఏంటి కాస్త తేడాగా ఉందనుకుంటున్నారా...మీరు చదువుతున్నది నిజమే. ప్రస్తుతం రాష్ట్రంలోని గత పంచాయతీలు మినహా కొత్తగా చేరిన కార్యదర్శిలకు పనిలేకుండా పోయింది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓఎంఎస్ నెంబను 149 అమలు చేయకపోవడమే. ఈ జీఓ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విధుల్లోకి చేరిన కార్యదర్శిలకు పూర్తిస్థాయిలో పని ఉండాలి. కానీ.. కార్యదర్శి అనే పదానికి అర్ధంలేకుండా పాత, సీనియర్ కార్యదర్శిలకు సహాయకులగానే నేటికీ నూతన గ్రేడ్5 కార్యదర్శిలు పనిచేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కొత్తగా చేరిన కార్యదర్శిలకు తమకు పనులు లేకుండా పోయాయని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్న విషయం నేడు హాట్ టాపిక్ గా మారింది. నూతన కార్యదర్శిలు పెట్టుకున్న జీఓ ప్రకారం వివిధ ప్రాంతాల్లో వున్న గ్రామసచివాలయాల పరిధిని విభజన చేయాలి. వారి విధులు వారిని నిర్వర్తించుకునేలా చేయాలి. కానీ రాష్ట్రప్రభుత్వం గ్రామసచివాలయ వ్యస్థ అని నామకరణం చేసి, దానికి ప్రభుత్వంలో ఒక ప్రత్యేక శాఖను కేటాయించినా ఇంకా రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థే నడుస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మా విధులు, మా ఉద్యోగాలు మమ్మల్ని ప్రభుత్వ జిఓ ప్రకారం చేసుకోనీయండి మహా ప్రభో అని గ్రేడ్ 5 నూతన కార్యదర్శిలు నెత్తీనోరూ మెరపెట్టుకుంటున్నా...ఫలితం లేకుండా పోతుంది. విశేషం ఏంటంటే గ్రామసచివాలయ కార్యదర్శిలు తాము చేస్తున్న ఉద్యోగం ఏమిటో తమకే తెలియడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సీనియర్ కార్యదర్శిల నుంచి కొన్నిచోట్ల వేధింపులు కూడా ఎదుర్కొంటున్నారు. అదీ ఎలా ఉంటే మేము చెప్పినట్టు ఉద్యోగం చేయకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్ అనే బెదిరింపుతో కొందరు కార్యదర్శిలు, సీనియర్ల దగ్గర అటెండర్లుగా పనిచేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. గ్రామసచివాలయ వ్యవస్థలో జరుగుతున్న లోపాలపైనా, రాష్ట్రవ్యాప్తంగా కార్యదర్శిలంతా జిల్లా పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్న విధుల బదలాయింపు విషయమై ఈఎన్ఎస్ నెట్వర్క్ గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ ప్రారంభించింది. ప్రభుత్వ ఆశయానికి కొందరు సీనియర్ ఉద్యోగులు, మరికొందరు మోనోపోలీ కార్యదర్శిలు, వారికి సహకరిస్తున్న మండల స్థాయి అధికారులు ఏవిధంగా గాలితీసే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. వాటిని గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు అనే దారావాహిక న్యూస్ కార్డ్ అర్టికల్స్ గా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. మరిన్ని వివరాలు గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-2 లో చూడవచ్చు..!
ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ రంగాలలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తగిన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. పొడవైన సముద్రతీరం, సుందరమైన బీచ్ లు, అడవులు, కొండలు విహారస్థలాలు, దేవాలయాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ ఉపయోగించుకొని ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం లో పెట్టుబడులను ఆహ్వానించవచ్చు అన్నారు. వివిధ పర్యాటక ప్రదేశాలలో 12 స్టార్ హోటళ్లను ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇప్పటికే టూరిజం ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తున్నామని రానున్న కాలంలో మరిన్ని ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. నదులు, సరస్సులు, రిజర్వాయర్లలో సురక్షిత బోటు విహారం కొరకు 9 కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. పర్యాటక ప్రదేశాలలో మరింత అభివృద్ధి చేయడం, టూరిజం యాప్ ద్వారా అవగాహన కల్పిస్తూ యాత్రికులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కరోనా రాష్ట్రంలో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది అన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి నందున ఇప్పుడిప్పుడే పర్యాటక రంగాన్ని మామూలు స్థితికి తీసుకు వస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో 30 శాతం దేశాలు పర్యాటక రంగం పైన ఆధారపడి ఉన్నాయని, మన దేశంలో కూడా కేరళ, గోవా వంటి రాష్ట్రాలు పర్యాటకరంగం ద్వారా ఎక్కువగా ఆదాయం పొందుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ టూరిజం ప్రాజెక్టులను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ లో అభివృద్ధి చేసేందుకు పథకాలను, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖ నగరం, జిల్లాలో పర్యాటక ప్రాంతాల సందర్శన రంగంలో అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల సందర్శన, యాత్రా స్థలాల సందర్శన, విహారస్థలాలు చారిత్రక ప్రదేశాలు హస్తకళల విభాగాలను కలిపి ఒక ప్యాకేజీ గా చేస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సమావేశంలో టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ రాంప్రసాద్, డి.వి.ఎం.ప్రసాద్ రెడ్డి, టి.ఐ.ఓ. పూర్ణిమా దేవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మశీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపిపీజీఇసెట్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయని కన్వీనర్ ఆచార్య పేరి శ్రీనివాస రావు తెలిపారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 28,726 మంది దరఖాస్తు చేసారన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, భీమవరం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్రంలో 40 పరీక్ష కేంద్రాలతో పాటు హైదరాబాదులో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్, గుర్తిపు కార్డును తీసుకురావాలన్నారు. మాస్క్ ధరించడం, శానిటైజర్‌ను వినియోగించడం తప్పనిసరి అన్నారు. పరీక్షల కేంద్రాలకు గంటన్నర ముందుగా విద్యార్థులు చేరుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థికి శరీర ఉష్ణోగ్రత పరిశీలించి పరీక్షకు అనుమతిస్తారన్నారు. అనారోగ్య లక్షణాలు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదన్నారు. కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ ఆన్‌లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించడం జరుగుతోందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలియజేశారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పు గోదావరి జిల్లాలలో ఒంటరి ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు వర్షాలపై హెచ్చరికలు చేస్తూ, తగిన జాగ్రత్తుల తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే గత కొద్ద రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, సబ్ కలెక్టర్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రెయిన్ ఫాల్ నమోదు చేయడంతోపాటు, అత్యవసర సమయంలో సేవలందించడానికి ప్రభుత్వం అధికారులను సిద్ధం చేసింది..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, శేఖర్ రెడ్డి, గోవిందహరి, డిపి అనంత, ఆలయ డెప్యూటి ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7.00 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
సంగీత ప్రపంచానికి గాన గంధర్వుడు డా.ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని తీరనదని ప్రముఖ సినీ సంగీత దర్శకులు డా.మహర్షి(జాన్ క్రిష్టఫర్) అన్నారు. శుక్రవారం బాలసుబ్రమణ్యం మరణవార్త విని కొద్దిసేపు కోలుకోలేకపోయానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన సంగీత దర్శకత్వంలో బాలుతో పాటపాడించుకోవాలనే ఆశ తనకు తీరనే లేదన్నారు. వేల పాటలు పాడిన గొంద నేటి నుంచి వినపడదనే విషయాన్నే జీర్ణించుకోవడం చాలా కష్టంగా వుందన్నారు. బాలు లాంటి గాయకుడు ఈ జన్మకి మళ్లీ పుట్టడని, అంత మంచి వ్యక్తిని కరోనా వైరస్ పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం ఇన్నిభాషల్లో వేల పాటలు పాడిన ఘనత ఒక్కబాలూకే దక్కుతుందన్నారు. ఆయనను ఎపుడైనా చూడాలనుకున్నా, ఆయనను గుర్తుచేసుకోవాలన్నా తెలుగు సినీ ప్రపంచానికి ఆ పాటలను వినడం ఒక్కటే మార్గమన్నారు డా.మహర్షి..ఈ సందర్భంగా ఆయన మ్రుతిని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిణిలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సెలవులు జీతంతోపాటు కలిపి ఇవ్వాలంటూ ఈరోజు ఉత్తర్వులు(జిఓఆర్టీనెం-4) జారీచేసింది. గ్రామ సచివాలయాల్లో గర్భిణిలు ప్రసూతి సమయంలో పడుతున్న ఇబ్బందు లను తెలియజేస్తూ..ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా..గర్భిణిల ప్రసూతి సెలవులపై క్లారిటీ ఎక్కడ.. అనే వార్తపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు స్పందించారు. ముఖ్యంగా ఈ విషయంలో విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ స్పందించారు. ఈఎన్ఎస్ వార్త రాసిన తరువాత, జిల్లాలో గర్భిణికి జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ఎంపీడిఓకి లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వు ప్రతిని చాలా జిల్లాల్లో మహిళా సచివాలయ ఉద్యోగిణిలు ఆయా జిల్లాల్లో ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తులు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తరువాత ప్రభుత్వం ద్రుష్టికి ఈ విషయం వెళ్లడంతో.. సచివాలయ ఉద్యోగిణిలకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు 6నెలలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తక్కువ జీతంతో తమకు ప్రసూతి సమయంలో పడే ఇబ్బందులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందని ఉద్యోగిణిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.